సార్వత్రిక ఎన్నికలను తలపించిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైసీపీ నిజంగానే దొంగ దెబ్బ వేసిందన్న వాదనలు ఆసక్తి రేపుతున్నాయి. జీహెచ్ఎంసీ ఎన్నికలకు తాము దూరమంటూ ప్రకటించిన వైసీపీ… హైదరాబాద్‌లోని ఆంధ్రోళ్లు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో రహస్యంగా టీఆర్ఎస్ విజయానికి శక్తి వంచన లేకుండా పని చేసిందట. ఈ కారణంగానే శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి ప్రాంతాల్లో ఆంధ్రోళ్ల ఓట్లన్నీ గంపగుత్తగా టీఆర్ఎస్‌కు పడిపోయాయట. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో తాము సఖ్యతగానే ఉన్నట్లు నటిస్తున్న జగన్ అనుసరించిన వ్యూహంతో… జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బంపర్ విక్టరీ కొట్టాలనుకున్న బీజేపీకి భారీ నష్టమే జరిగిందట. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రతి చిన్న అంశమూ ఆసక్తి రేపగా శుక్రవారం వెలువడిన ఫలితాలను చూసిన తర్వాత వైసీపీ వేసిన ‘దొంగ’ దెబ్బ అన్నింటి కంటే ఆసక్తికర అంశంగా మారిపోయింది. ఇప్పుడీ అంశమే అన్ని చోట్లా పెద్ద ఎత్తున చర్చకు తెర లేపింది.
ఇక్కడ ఆంధ్రోళ్లు అత్యధికం
ఆది నుంచి హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి పరిధిలోనే ఆంధ్రోళ్లు అత్యధికంగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ కారణంగానే తెలంగాణ సెంటిమెంట్ అధికంగా ఉన్న సమయంలోనే తెలుగు దేశం పార్టీ ఈ ప్రాంతాలపై పట్టు కనబరచింది. ఈ కారణంగానే ఈ రెండు ప్రాంతాలపై టీఆర్ఎస్ నేతలు తమదైన శైలి కోపాన్ని ప్రదర్శించేవారు. ఎలాగైనా ఈ రెండు ప్రాంతాల్లో పట్టు సాధించేందుకు టీఆర్ఎస్ వేయని ఎత్తు లేదు. రచించని వ్యూహమూ లేదు. అయితే ఎన్ని ప్లాన్‌లు అమలు చేసినా అక్కడ టీఆర్ఎస్‌కు ఎప్పుడూ ఆధిక్యం కనబడ్డ దాఖలా లేదు. ఇక జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తనకు ఎదురు గాలి వీస్తున్నదని గ్రహించిన టీఆర్ఎస్ అధిష్ఠానం… ఎలాగైనా ఆంధ్రోళ్ల ఓట్లను ఈ ఎన్నికల్లో దక్కించుకోవాల్సిందేనని పథకం రచించింది. ఇందులో భాగంగా ఏపీలోని అధికార పార్టీగా ఉన్న వైసీపీతో టీఆర్ఎస్ రహస్య మంతనాలు సాగించింది. 2019 ఎన్నికల ముందు నుంచీ ఇరు పార్టీల మధ్య కొనసాగుతున్న స్నేహం నేపథ్యంలో టీఆర్ఎస్‌కు సహాయం చేసేందుకు వైసీపీ ఎంతమాత్రం సంకోచించలేదు.
Also Read ;- నాగార్జునసాగర్‌పై బీజేపీ కన్ను.. పట్టున్న నాయకుడిని పట్టే ఆలోచన
రంగంలోకి వైసీపీ నేతలు
ఈ క్రమంలో ఎలాగూ తెలంగాణ ఎన్నికల్లో వైసీపీ పోటీ చేయట్లేదు కనుక… ఆ పార్టీ ఓట్లతో పాటు శేరిలింగంపల్లి, కూకట్ పల్లి పరిధిలోని మొత్తం ఆంధ్రోళ్ల ఓట్లన్నీ కూడా గంపగుత్తగా టీఆర్ఎస్‌కు పడేలా సాయం చేయాలని గులాబీ పార్టీ నేతలు ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదనకు ఓకేనన్న వైసీపీ… బయటకు మాత్రం తాము జీహెచ్ఎంసీ ఎన్నికలకు దూరంగా ఉంటున్నామని ప్రకటించింది. అయితే టీఆర్ఎస్‌కు ఇచ్చిన హామీ మేరకు జగన్ తన పార్టీ నేతలను రంగంలోకి దించారట. ఏ ఒక్కరి కంట బడకుండానే వైసీపీ నేతలు శేరిలింగంపల్లి, కూకట్‌పల్లిలో దిగిపోయారు. అక్కడి ఆంధ్రోళ్లతో రహస్య సమావేశాలు జరిపి.. ఈ సారి ఎలాగైనా వారి ఓట్లన్నీ టీఆర్ఎస్‌కే వేయాలని వైసీపీ నేతలు చెప్పారట. తెలంగాణలో టీడీపీ నామమాత్రంగా మారిన వైనాన్ని కూడా వారు ఈ సందర్భంగా ఆంధ్రోళ్లకు చెప్పారట. ఇక చేసేదేమీ లేదని గ్రహించిన ఆంధ్రోళ్లు… వైసీపీ చెప్పినట్లుగానే తమ ఓట్లన్నీ కారు గుర్తుపైనే గుద్దేశారట.
33 ఇక్కడ నుంచే..
ఫలితంగా మిగిలిన ప్రాంతాల్లో చావుదెబ్బ తిన్న టీఆర్ఎస్… ఆంధ్రా ఓట్లు అధికంగా ఉన్న శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి ప్రాంతాల్లో మాత్రం క్లీన్ స్వీప్ చేసినంత పని చేసింది. ఈ రెండు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో మొత్తం 37 డివిజన్లు ఉంటే… ఏకంగా 33 చోట్ల టీఆర్ఎస్ జెండా ఎగిరింది. కూకట్‌పల్లి పరిధిలో మొత్తం 22 డివిజన్లు ఉండగా… టీఆర్ఎస్‌కు 20 చోట్ల విజయం దక్కగా… శేరిలింగంపల్లి పరిధిలోని 15 డివిజన్లలో ఏకంగా 13 చోట్ల కారు విజయఢంకా మోగించింది. ఇక మొత్తం మీద టీఆర్ఎస్ 56 డివిజన్లు గెలిస్తే… వాటిలో ఆంధ్రోళ్లు అధికంగా ఉన్న ఈ రెండు నియోజకవర్గాల పరిధిలోనివే 33 ఉండటం గమనార్హం. మొత్తంగా గుట్టు చప్పుడు కాకుండా వ్యూహాలు అమలు చేసిన జగన్… చావుతప్పి కన్ను లొట్టబోయిన టీఆర్ఎస్‌ను విజయ తీరాలకు చేర్చి…దుబ్బాక విజయంతో రెట్టించిన ఉత్సాహంతో జీహెచ్ఎంసీని కూడా కైవసం చేసుకునేందుకు వ్యూహాలు రచించిన బీజేపీకి ఆ కుర్చీ దక్కకుండా చేశారన్న మాట. అంటే జగన్ కొట్టిన ‘దొంగ’ దెబ్బ.. బీజేపీకి భారీ నష్టాన్ని మిగల్చగా… టీఆర్ఎస్ పరువు కాపాడిందన్న మాట.
Must Read ;- గెలిచినా..మరక మంచిది కాదు..!