చుండ్రు.. సీజన్‌తో సంబంధం లేకుండా.. మగవారు, ఆడవారు అనే తేడా లేకుండా అందరినీ ఇబ్బందులకు గురిచేస్తున్న సమస్య. దీని నుంచి మన కురులను కాపాడుకోవడానికి మనం పడని పాట్లుండవు. ఖరీదైన యాంటీడాండ్రఫ్ షాంపూల నుంచి బామ్మల కాలం నాటి చిట్కాల వరకు.. ఎవరు ఏది చెప్పినా చేయడానికి వెనకాడం.. అంతిమంగా మన లక్ష్యం.. చుండ్రు నుంచి జుట్టుకు విముక్తి కలిగించడమే. కానీ, ఇలాంటివి ఎన్ని పాటించినా.. కొన్ని సందర్భాల్లో ఫలితాలు మాత్రం శూన్యం. అలా ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారి కోసమే నిపుణుల సలహాలతో మీ ముందుకొచ్చాము.
అసలు చుండ్రు ఎలా ఏర్పడుతుంది?
మన తలపైనే కాకుండా.. శరీరంపైన కూడా సాధారణంగా ఒక ఫంగస్ ఉంటుంది. అదే ‘మెలసీసియా ఫంగస్’. ఈ ఫంగస్ ఎక్కువగా ఉత్పత్తైనపుడు మన శరీరంపైన కానీ, తలపైన కానీ రియాక్షన్ లాంటిది ఏర్పడుతుంది. అలాంటి సందర్భంలో చిన్న చిన్నగా తెల్లటి ఫ్లేక్స్ లాంటివి ఏర్పడుతాయి. దాన్నే మన వాడుక భాషలో చుండ్రు అంటారు. సాధారణంగా చుండ్రు టీనేజ్ వయసు నుంచి 30 ఏళ్ల వయసు వారికి ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే.. ఆ వయసులో హార్మోన్స్ యాక్టివ్‌గా ఉండడం, మన తలపైన నూనె ఉత్పత్తులు లాంటివి ఆ వయసులో ఎక్కువగా ఉంటాయి. ఇలాంటి వాటి వల్ల మెలసీసియా ఫంగస్ రియాక్షన్ ఆ వయసు వారిలో ఎక్కువగా ఉంటుంది.

Must Read ;- ఆయన కనీసం 180 ఏళ్లు జీవిస్తాడట!
సెబోరి డెర్మటైటిస్ అంటే ఏమిటి?
మెలసీసియా ఫంగస్ రియాక్షన్ కారణంగా ఏర్పడే చిన్న చిన్న తెల్లటి ఫ్లేక్స్‌ను సాధారణంగా చండ్రు అంటారు. కానీ, ఇదే పరిస్థితి తీవ్ర రూపం దాల్చి ఒక రోగంగా మారే దశకి చేరుకుంటే ‘సెబోరి డెర్మటైటిస్’ అంటారు. చుండ్రుగా ఉన్నప్పుడు కేవలం తెల్లటి ప్లేక్స్ కనిపిస్తాయి. కానీ, అది కాస్త ముదిరినపుడు తలపై పెచ్చులుగా ఏర్పడడం, చిన్న గుల్లలు లాంటివి, తలపై పింపుల్స్, చీముతో కూడిన గుల్లలు ఏర్పడడం లాంటివి జరుగుతున్నప్పుడు.. మీ సమస్య సెబోరి డెర్మటైటిస్‌గా మారిందని తెలుసుకోవాలి.

చుండ్రుకు కారణాలేంటి?
చుండ్రుకు అనేక కారణాలుంటాయంటున్నారు నిపుణులు. అందులో ఒకటి మన శరీర తీరు కూడా ఉంటుంది. ఫంగస్‌కు మన శరీరం రియాక్ట్ అవుతున్న తీరు కూడా చుండ్రు హెచ్చు తగ్గులకు కారణమవుతుందని నిపుణులు పేర్కొంటున్నారు. ఇక మరొక కారణం తీసుకంటే.. ఒత్తిడి. నేటి కాలంలో యువత ఎక్కువగా ఇబ్బందిపడుతున్న వాటిలో ఒత్తిడి ఒకటి. ఒత్తిడి వల్ల కూడా చుండ్రు సమస్య పెరిగే అవకాశాలు ఉన్నాయి. మరి ఒత్తిడిని దూరం చేసుకోవాలంటే మన జీవనవిధానంలో కొన్ని మార్పులు తీసుకోవాలి.
Also Read ;- ‘ప్రేగు ఇన్‌ఫెక్షన్’కు చెక్ పెట్టాలంటే ఈ ఆహారం తీసుకుంటే సరి..!
శాశ్వత పరిష్కారం లేదా..
చుండ్రుకు శాశ్వత పరిసష్కారం కావాలంటే.. మందులు వాడినంత మాత్రానా సరిపోదంటున్నారు నిపుణులు. అది కేవలం మన జీవన విధానంపైన ఆధారపడుంటుంది అని చెప్తున్నారు. మన లైఫ్ స్టైల్‌లో హెల్దీ మార్పులు చేసుకోనిదే.. ఎన్ని మందులు వాడినా.. ఉపయోగం ఉండదని చర్మ నిపుణులు కచ్చితంగా చెప్తున్నారు.

- మీరు రోజులో ఎన్ని గంటలు నిద్రపోతున్నారో సరి చూసుకోవాలి. కనీసం 8 గంటలు నిద్ర ఉండేలా చూసుకోవాలి.
- దేని గురించైనా తీవ్రంగా ఆలోచిస్తూ ఒత్తిడికి గురవుతున్నారేమో చూసుకోవాలి. ముందు అటువంటి ఆలోచనలకు చెక్ పెట్టాలి.
- ఇక పనికి సంబంధించిన ఒత్తిడి పని సమయంలో మాత్రమే ఉండేలా చూసుకోవాలి. ఒక్కసారి పని సమయం ముగిశాక ఆహ్లాదంగా ఉండడానికి ప్రయత్నించాలి. దీని వల్ల కూడా ఫంగస్ ఇన్ ఫెక్షన్ లాంటివి తగ్గుముఖం పడతాయి.
- మీరు తీసుకునే ఆహారం కూడా మీ జుట్టు ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తుంది. కాబట్టి పండ్లు తినడం, నూనె వస్తువులు, వేపుళ్లు, ఫాస్ట్ ఫుడ్ వంటివి తక్కువ మోతాదులో తినాలి. ప్రోటీన్ ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవాలి.
Also Read ;- గ్యాస్ట్రిక్ సమస్యా.. అయితే వీటికి దూరంగా ఉండండి!
ఏవి చేయాలి.. ఏవి చేయకూడదు..
ఫంగస్‌తో బాధపడుతున్నవారు ఎలాంటి పాటించాలి.. వేటికి దూరంగా ఉంచాలో చూద్దాం రండి..

- ఫంగస్‌తో బాధపడుతున్నప్పుడు తలపై ఎక్కువగా నూనెను పెట్టడం మంచిది కాదుంటున్నారు నిపుణులు. నూనెల వల్ల ఫంగస్ ఇంకా బలపడే అవకాశాలు ఎక్కువుంటాయంటున్నారు.
- ఫంగస్ ఉన్న సందర్భంలో సహజమైన నూనెలను తగ్గించుకోవాలంటే తరచూ యాంటీడాండ్రఫ్ షాంపూలను వాడితే మంచిది. దీని వల్ల తలపైన నూనెల ఉత్పత్తి తగ్గి.. ఫంగస్ రియాక్షన్ కూడా మెల్లగా తగ్గుతుంది.
- ఒకవేళ నూనె పెట్టుకోవాలనుకుంటే.. కండీషనర్ లాగే రాసుకోవాలే తప్ప.. తలపై అంటుకోరాదు అంటున్నారు నిపుణులు.
సహజ చిట్కాలు..
తలకు పెరుగు పెట్టడం, నిమ్మకాయ రసం తలపై రాసుకోవడం లాంటివి చేయడం వల్ల తాత్కాలికంగా చుండ్రుకు బ్రేక్ వేయచ్చు. కానీ ఇలాంటి సహజ చిట్కాలు పాటించినపుడు.. జుట్టును బాగా శుభ్రం చేసుకోవాలి.. లేకపోతే చుండ్రు తగ్గడమేమోగానీ.. ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయి.
Also Read ;- ‘లెమన్ టీ’ ప్రయోజనాలు తెలిస్తే అసలు వదిలిపెట్టరు..!











