( విశాఖపట్నం నుంచి లియో న్యూస్ ప్రతినిధి)
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఆరంభమైన ‘విశాఖ ఉక్కు.. ఆంధ్రుల హక్కు‘ ఉద్యమం రాజకీయాలకు అతీతంగా సాగుతుందా? ఒకరిపై మరొకరు పైచేయి సాధించే క్రమంలో రాజకీయ పార్టీలు ఉద్యమానికే ఎసరు పెడతాయా? అన్ని వర్గాల అంతిమ లక్ష్యం స్టీల్ ప్లాంటును కాపాడటమేనా? అంటే అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా రాష్ట్ర ఎన్నికల కమిషన్ జివిఎంసి ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో రాజకీయ పక్షాల్లో స్వార్థం నిలువెల్ల ఆవహిస్తోందని కార్మికులు ఆందోళన చెందుతున్నారు.
విశాఖ చరిత్రలో అతిపెద్ద ఉద్యమం
విశాఖ చరిత్రలో ఉద్యమం పేరు ఎత్తితే ముందుగా చెప్పుకోవాల్సింది..’ విశాఖ ఉక్కు.. ఆంధ్రుల హక్కు’. ప్రాణ త్యాగాల తో ఆవిర్భవించిన విశాఖ స్టీల్ ప్లాంట్ ఇప్పుడు కష్టాల్లో పడింది. నష్టాల సాకు చూపుతూ బీజేపీ ప్రభుత్వం.. విశాఖ వాసుల సెంటిమెంట్‌కు మసి పూసి మారేడు కాయ చేసే ప్రయత్నం చేస్తోంది. ఇటీవల విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటు పరం చేయాలని నిర్ణయం తీసుకోవడంతో ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఉద్యమం మరోమారు ఉగ్రరూపం దాల్చింది. ఇదే తరుణంలో ఒకవైపు పంచాయితీ ఎన్నికలు జరుగుతుండగా, మరోవైపు జీవీఎంసీ ఎన్నికలకు నగారా మోగింది. గతంలో నిలిచిపోయిన ఎన్నికలను కొనసాగించేందుకు అనుమతిస్తూ రాష్ట్ర ఎన్నికల కమిషన్ షెడ్యూల్ విడుదల చేసింది. మార్చి 10న విశాఖలో పోలింగ్ జరగనుంది. రూరల్ ప్రాంతంలో ఉద్యమ తీవ్రతకు పంచాయతీ ఎన్నికలు గండి కొట్టగా, ప్రస్తుతం జీవీఎంసీ ఎన్నికలు ఉద్యమంపై ఎటువంటి ప్రభావం చూపిస్తుందో అన్న ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది.
ఎవరి దారి వారిదేనా?
ఈ నెల 6న ప్రారంభం అయిన విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యతిరేక ఉద్యమం … ఇప్పుడిప్పుడే రాజకీయ పక్షాలను ఏకం చేస్తున్న తరుణంలో… గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు వచ్చి పడడంతో.. రాజకీయ పార్టీలు ఎవరి దారి వారు చూసుకునే అవకాశం ఉందని ఉద్యమకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత కొద్ది రోజులుగా తలో దారిలో ఆందోళనలు చేస్తున్నా… అంతిమంగా ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగానే జరుగుతోందన్న సంతృప్తి ప్రజల్లో వ్యక్తమైంది.
క్రెడిట్ కొట్టేసే ప్రయత్నం..
పరిపాలనా రాజధానిగా విశాఖను ప్రకటించడంతో గ్రేటర్ ఎన్నికలను అధికార, విపక్షాలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఎలాగైనా మేయర్ పీఠాన్ని దక్కించుకోవాలని యాక్షన్ ప్లాన్ తయారు చేసుకున్నాయి. ఈ దశలో జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో విశాఖ ఉక్కు ఉద్యమంలో పాల్గొనడం వల్ల ప్రయోజనం పొందలేము అన్న భావన అధికార వైసీపీ లో స్పష్టంగా కనిపిస్తోంది. దీంతో తెలుగుదేశం పార్టీని పక్కకునెట్టి, ఉద్యమాన్ని లీడ్ చేసి… ఎన్నికలు ముగిసేవరకు కాలక్షేపం చేసి, మెజారిటీ సీట్లతో పాటు మేయర్ పీఠాన్ని దక్కించుకోవాలని, అందుకు ఉద్యమాన్ని తమకు అనుకూలంగా మలచుకునేందుకు కుయుక్తులు పన్నుతున్నారని విశాఖ వాసులు ఆరోపిస్తున్నారు. పరిపాలన రాజధాని విశాఖలో పరిపాలనా వ్యవహారాలు ప్రారంభమైతే… జీవీఎంసీ అత్యంత కీలకంగా మారుతుంది. అటువంటి కార్పొరేషన్‌పై పట్టు కోల్పోతే… అది అధికార పార్టీకి అతి పెద్ద మైనస్ అవుతుంది. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఎట్టి పరిస్థితుల్లోనూ.. ఉద్యమాన్ని వాడుకొని అయినా.. విజయం సాధించాలని ఎత్తుగడలు వేస్తోందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి.
ఒక్కసారే కలిశారు..!
తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, వైఎస్సార్సీపీ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు ట్రేడ్ యూనియన్లు నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్ష వేదికగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా సీపీఐ నారాయణ ఇద్దరూ కలిసి పోరాడాలని ఆకాంక్షించారు. అదే విధంగా జగన్, చంద్రబాబు కూడా ఉద్యమం కోసం కలవాలని ఆశపడ్డారు. ఎట్టిపరిస్థితుల్లోనూ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ మేనేజ్‌మెంట్ చేతుల్లోకి వెళ్లకూడదని ఆయన పిలుపునిచ్చారు. తరువాత నుంచి అధికార పక్షం ప్రతిపక్షం కలిసి ఉద్యమాన్ని నడిపిస్తాయని అంతా ఆశించారు. కానీ అది వాస్తవ రూపం దాల్చలేదు. ఇంతలోనే కార్పొరేషన్ పోలింగ్ తేదీ ప్రకటించడంతో ఉద్యమాన్ని పెట్టుబడిగా పెట్టాలని అధికార పార్టీ వ్యూహం రచిస్తోంది. మరోవైపు తెలుగుదేశం ఇప్పటికే ఉద్యమ క్రెడిట్‌ను తన ఖాతాలో వేసుకుంది. ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు రాజీనామా, గాజువాక మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు నిరవధిక నిరాహార దీక్ష ప్రజల్లో ఉద్యమ స్ఫూర్తిని రగిలించాయి . దానిని ఎలా ఓవర్‌టేక్ చేయాలన్న దానిపై మల్లగుల్లాలు పడ్డ అధికారపక్షం… పాదయాత్రకు ప్లాన్ చేసింది.
Must Read ;- పల్లా దీక్ష భగ్నం : ఇది సర్కారు మోసం, పిరికి తనం!
ఎవరి కోసం పాదయాత్ర..
బీజేపీ ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా.. ఎమ్మెల్యేలు, ఎంపీలు రాజీనామాలు చేయరు. తెలుగుదేశం పార్టీతో కలిసి ఉద్యమ కార్యాచరణ రూపొందించరు. కానీ కేంద్రానికి లేఖ రాస్తారు… ట్రేడ్ యూనియన్ నాయకులతో… కమ్యూనిస్టులతో కలిసి అఖిలపక్ష సమావేశాలు నిర్వహిస్తారు. ఉద్యమంలో మీతో పాటు కలిసి పని చేస్తామని హామీలు గుప్పిస్తున్నారు. క్షేత్రస్థాయిలో మాత్రం వారికి నచ్చినట్టు వ్యవహరిస్తారు. విశాఖ గ్రేటర్ ఎన్నికలపై తీవ్ర ప్రభావం చూపనున్న స్టీల్ ప్లాంట్ ఉద్యమాన్ని తమకు అనుకూలంగా మలుచుకుని.. ప్రభుత్వం, కేంద్రానికి వ్యతిరేకంగా ప్రజల కోసం పోరాడుతోందనే భావన కల్పించేందుకు పాదయాత్రను ఎంచుకున్నట్టు ప్రజా సంఘాలు ఆరోపిస్తున్నాయి. విశాఖలో అన్ని నియోజకవర్గాలను కలుపుతూ చేపట్టబోయే పాదయాత్ర లక్ష్యం అదే అని ఆరోపిస్తున్నారు. ఇదే పాదయాత్రను ఢిల్లీలో చేయాలని చంద్రబాబు హితవు పలికారు. ఇక్కడ పాదయాత్ర వల్ల ఉపయోగం ఏమిటని ప్రశ్నించారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ రాజీనామాలు చేస్తే కేంద్రంపై ఒత్తిడి పెరుగుతుందని ప్రజలు చేస్తున్న డిమాండ్‌ను వైసిపి పట్టించుకోవడం లేదు.
అది వారికే నష్టం..
ఉద్యమాన్ని వినియోగించుకొని ఎన్నికల్లో లబ్ది పొందాలని చూస్తే అది వారికి చేటు చేస్తుందని… భవిష్యత్తులో భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని రాజకీయ విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. ఉద్యమాన్ని ఉద్యమంగానే నడిపించాలని.. రాజకీయాలతో ముడిపెట్టడం సరి కాదని హితవు పలుకుతున్నారు.
ఎన్నికల కోడ్ వేళ..
ఎన్నికల కోడ్ అమలులో ఉన్నంత కాలం… ట్రేడ్ యూనియన్ల సారథ్యంలో ఉద్యమాన్ని లోప్రొఫైల్లో నడిపించాలని లెఫ్ట్ పార్టీలు సూచిస్తున్నాయి. ఉద్యమం ఏమాత్రం చల్లారినా అది కేంద్ర ప్రభుత్వానికి లాభిస్తుందని సూచిస్తున్నారు. రాజకీయ లబ్ధి కోసం ఉద్యమాన్ని పెట్టుబడిగా, ఫణంగా పెట్టవద్దని కోరుతున్నారు.
పోస్కోపై కొత్త నాటకం..
విశాఖ పర్యటనకు వచ్చిన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కొత్త విషయాన్ని బయట పెట్టారు. పోస్కో ప్రతినిధులు తనను కలిసిన మాట వాస్తవమేనని, అయితే వారికి కడపలో పరిశ్రమ పెట్టడం ఉత్తమమని సూచించానని తాజాగా ప్రకటించారు. పోస్కోతో కుదుర్చుకున్న ఒప్పందానికి… ముఖ్యమంత్రి చేసిన ప్రకటనకి మధ్య వ్యత్యాసం కనిపిస్తోంది. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్.. రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు ఇచ్చిన సమాధానంలో RINL భూముల విలువ ఆధారంగా స్టీల్ ప్లాంట్ షేర్ నిర్ణయిస్తామని, ఈ మేరకు unconditional ఎంఓయు కుదుర్చుకున్నట్టు లిఖితపూర్వకంగా ఇచ్చారు. అయితే, ముఖ్యమంత్రి మాత్రం విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రాంగణంలో ఎట్టి పరిస్థితుల్లోనూ పోస్కో ప్లాంట్ ఏర్పాటు చేయబోరని హామీ ఇచ్చారు. ఇదే విషయాన్ని ఎప్పుడో ముఖ్యమంత్రికి స్పష్టం చేసే అవకాశం ఉన్నప్పటికీ, విశాఖ పర్యటనలోనే ఈ విషయాన్ని చెప్పడం వెనుక స్థానిక ఎన్నికల్లో లబ్ధి పొందే కోణం ఉందని ఉద్యోగులు, ప్రజలు ఆరోపిస్తున్నారు. ప్రతిపక్షాలు ఎప్పటి నుంచో ఈ విషయమై స్పష్టత కోరుతున్నప్పటికీ.. నోరు మెదపని ముఖ్యమంత్రి శారదాపీఠం స్వామి సేవకు వచ్చి, ఉద్యమకారులను చల్లబరిచేందుకు, స్థానిక ఎన్నికల్లో రాజకీయ లబ్ధి పొందేందుకు అన్నట్టు ఆ విషయాన్ని ప్రకటించారు. కేంద్రానికి లేఖ రాశామని, ఆశాజనకంగానే కేంద్రం నిర్ణయం వస్తుందని, తాను దేవుడుపై విశ్వాసం ఉంచుతానని ముఖ్యమంత్రి చెప్పుకొచ్చారు. దీని వెనుక కూడా ఎటువంటి రాజకీయ లబ్ధి, ఉద్యమ స్ఫూర్తిని నీరుగార్చే కుట్ర ఉండకూడదని ప్రజలు ఆశిస్తున్నారు.
Also Read ;- అమరావతి నుంచి.. విశాఖ ఉక్కు వరకు.. రావణ కాష్ఠంలా జగనన్న రాజ్యం!











