ఓటీటీ ప్రియులకు మంచి అనుభూతినిచ్చే సినిమా ‘ఆండ్రాయిడ్ కుంజప్పన్ వెర్షన్ 5.25’. అమెజాన్ ప్రైమ్ లో అందుబాటులో ఉన్న ఈ సినిమా మానవ సంబంధాల్ని హృద్యంగా ఆవిష్కరిస్తుంది. వృద్ధాప్యంలో ఉన్నవారు.. తమ అవసాన దశలో పిల్లలు తమతోనే ఉండాలని కోరుకుంటారు. అలా కాని పక్షంలో తమ వెంట ఉన్నవారితోనే అటాచ్ మెంట్ ఏర్పరుచుకుంటారని ఈ సినిమా చాటిచెబుతుంది.
కథేంటి? : భాస్కర్ పొదువాల్ అనే వృద్ధుడు భార్యను పోగొట్టుకొని ఉన్న ఒక్కగానొక్క కొడుకు సుబ్రమణియన్ తో జీవిస్తుంటాడు. ప్రాణ భయం వల్ల .. కొడుకుని ఉద్యోగం చేయనీయకుండా తనదగ్గరే ఉండిపోమని పోరుతుంటాడు. కానీ అతడికి రష్యాలో ఒక జపనీస్ కంపెనీలో మంచి ఉద్యోగం వస్తుంది. తండ్రికి ఇష్టం లేకపోయినా.. అతడికి చేదోడు వాదోడుగా ఉండేలా ఒక మేల్ నర్స్ ను అపాయింట్ చేసి రష్యా వెళ్ళిపోతాడు. అక్కడ అతడికి ఓ జపాన్ అమ్మాయి పరిచయం అవుతుంది. ఆమెకు మలయాళం నేర్పిస్తాడు. అయితే అతడి తండ్రికి సేవ చేయలేక మేల్ నర్స్ పని మానేసి వెళ్ళిపోతాడు. ఇంటిదగ్గర ఒంటరిగా ఉన్న తండ్రికి సహాయంగా ఉండేందుకు ఒక హ్యూమనాయిడ్ రోబోను తన వెంట తీసుకెళతాడు. ఆ రోబో పొదువాల్ కు అన్ని పనులూ చేసిపెడుతుంటుంది. కొన్నాళ్ళకు పొదువాల్ కి రోబో .. తన కొడుకుకన్నా ఎక్కువ అనిపిస్తుంది. దానికి కుంజప్పన్ అని పేరు పెడతాడు. దానితోనే ఎక్కువ అటాచ్ మెంట్ పెట్టుకుంటాడు. చివరికి ఆ వృద్ధుడు యంత్రాలకు , మనిషుల్లా మనసుండదు అని అర్ధం చేసుకోవడమే ఈ సినిమా కథ.
ఎలాతీశారు? : యంత్రాలు మనుషుల కన్నా ఎక్కువ వేగంతో పనిచేస్తాయి కానీ..వాటికి మనుషుల్లా లాజికల్ గా ఆలోచించే శక్తి ఉండదు. పైగా వాటికి బంధాలు, అనుబంధాలు అన్న సెంటిమెంట్సూ ఉండవు. ఈ పాయింట్ ను చాలా క్లారిటీ గా .. నిజాయితీగా తెరకెక్కించాడు కొత్త దర్శకుడు రతీష్ బాలకృష్ణన్ పొదువాల్. కొడుకు తనని నిర్లక్ష్యం చేసి వెళ్ళిపోయాడన్న అక్కసుతో మాత్రమే .. ఆ వృద్ధుడు రోబోతో బాగా అటాచ్ మెంట్ పెంచుకుంటాడు, కానీ కొడుకంటే అతడికి వల్లమాలిన ప్రేమ అని .. మరో యాంగిల్ లో చక్కగా చూపించాడు దర్శకుడు. ఫైనల్ గా యంత్రాలు ప్రేమను పంచలేవు అన్న చక్కటి సందేశాన్ని ఇచ్చాడు. భాస్కర్ పొదువాల్ గా సురాజ్ వెంజారమూడ్ అదరగొట్టాడు. అలాగే.. అతడి కొడుకు సుబ్రమణియన్ గా సౌబిన్ షాహిర్ చాలా సహజంగా నటించాడు.
హైలైట్స్ : టెక్నాలజీ అంటే ఏమిటో తెలియని పక్కా పల్లెటూళ్ళో… రోబో సంచరించడం చాలా కొత్త గా అనిపిస్తుంది. అలాగే.. దానికి ఒక మోనిటర్ ను ఏర్పాటు చేసి.. బ్లూటూత్ కనెక్షన్ ఇవ్వడం కూడా ఆకట్టుకుంటుంది. ఇంకా.. వృద్ధునికి రోబో ప్రేమరాయబారం నడపడం కూడా ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తుంది. అలాగే.. మరో ముఖ్యమైన పాయింట్ ఏంటంటే… మనుషుల దగ్గర రోబోలు సర్టెన్ పిరీయడ్ కన్నా ఎక్కువ కాలం ఉంటే..అవి మనుషుల్ని చంపేస్తాయనే పాయింట్ ను ఈ సినిమా కథకు కీలకంగా మార్చడం ..దానికి అనుగుణంగానే క్లైమాక్స్ ను ప్లాన్ చేయడం మంచి థాట్.
నటీనటులు : సురాజ్ వెంజారమూడ్, సౌబిన్ షాహిర్, మాలా పార్వతి, సైజు కురుప్పు, రాజేష్ మాధవన్, ఉన్నిరాజా, శివదాస్ కణ్ణూర్ తదితరులు
నిర్మాణం: సంతోష్ టి.కురువిల్లా
దర్శకత్వం : రతీష్ బాలకృష్ణన్ పొదువాల్
ఎక్కడ చూడాలి?: అమెజాన్ ప్రైమ్
ఒక్కమాటలో : హార్ట్ టచింగ్ డ్రామా
భాష : మలయాళం
రేటింగ్ : 3.5 /5
-ఆర్కే











