(విశాఖపట్నం నుంచి లియో న్యూస్ ప్రతినిధి)
ప్రజల ఓట్లతో గెలుపొంది, అధికారంలోకి వచ్చి ఆ ప్రజలకు ఇబ్బంది కలిగే అంశాలను వ్యతిరేకించాల్సిన ప్రజాప్రతినిధులు తమకు పార్టీనే ముఖ్యమని తేల్చిపారేశారు. ఘనత వహించిన అధికార పార్టీ వైఎస్సార్సీపి కార్పొరేటర్లు జీవీఎంసీ కౌన్సిల్ రెండవ సమావేశంలో ప్రజల అభిప్రాయానికి భిన్నంగా ఓటేశారు.
ఆస్తి పన్ను పెంపుపై భగ్గుమన్న ప్రతిపక్షాలు..
కౌన్సిల్ సమావేశంలో ఆస్తి పన్ను పెంపుపై ప్రతి పక్షాలు భగ్గుమన్నాయి. కౌన్సిల్ బయట, లోపల ఆందోళనలతో అధికార పార్టీని ఉక్కిరి బిక్కిరి చేశాయి. ఆస్తి పన్ను పెంపును నిరసిస్తూ కౌన్సిల్ ప్రారంభానికి ముందే కమ్యూనిస్టులు జీవీఎంసీ ప్రధాన కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. అదేవిధంగా ప్రతిపక్షాల వాకౌట్‌లు, వాగ్వాదాల అనంతరం అజెండాలోని 140 అంశాలకు 138 అంశాలకు కౌన్సిల్ ఆమోదం తెలిపింది.
పెంచిన ఆస్తిపన్నుకు ఆమోదం..
ఆస్తి పన్ను పెంపుపై ప్రతిపక్షాల ఆందోళనల నడుమ, మేయర్ హరి వెంకట కుమారి పెంపు ప్రతిపాదనను కౌన్సిల్ ముందు ఉంచారు. దీంతో తెలుగుదేశం పార్టీ, కమ్యూనిస్టులు, బిజెపి, జనసేన, ఇండిపెండెంట్లు ముక్తకంఠంతో వ్యతిరేకించారు. నగర మేయర్ పోడియాన్ని చుట్టుముట్టారు. ఇటువంటి పరిస్థితుల్లో ప్రజలపై భారం మోపడం సరికాదని తమ వాదన వినిపించారు. ఈ క్రమంలో పలు మార్లు వాకౌట్ చేశారు. అయితే ఆస్తి పన్ను పెంపు ప్రతిపాదనను ఎంతమంది ఆమోదిస్తున్నారు అన్న విషయాన్ని మేయర్ ఓటు ద్వారా తెలుసుకోవాలని నిర్ణయించారు. మెజారిటీ సీట్లు సాధించిన వైఎస్‌ఆర్‌సిపి కార్పొరేటర్లు అంతా ప్రభుత్వ నిర్ణయానికి అనుకూలంగా ఆమోదం తెలిపారు. 65 మందికి పైగా ఆస్తి పన్ను పెంపును సమర్థించారు. దీంతో అజెండాలో ఈ అంశం కూడా పాస్ అయ్యింది. దీనిని బట్టి చూస్తే ప్రజల మనోభావాలతో, అభిప్రాయాలతో, ఆర్థిక ఇబ్బందులతో అధికార పార్టీ ప్రజాప్రతినిధులకు సంబంధం లేదని స్పష్టం చేశారు. తమకు పార్టీ ప్రయోజనాలే ముఖ్యమని చాటి చెప్పారు.
రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు..
రాష్ట్ర ప్రభుత్వం ఆస్తి పన్ను ప్రతిపాదనను తెరపైకి తెచ్చినప్పటి నుంచి అన్ని వర్గాల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఎక్కడికక్కడ ఆందోళనలు జరుగుతున్నాయి. ఈ సమయంలో ప్రజల పక్షాన నిలవాల్సిన ప్రజా ప్రతినిధులు, పార్టీ నిర్ణయానికి అండగా నిలవడం విడ్డూరం. ప్రజల ఓట్లతో గెలిచి, వారి పైన ఆర్థిక భారం మోపే ప్రతిపాదనకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం వెన్నుపోటుతో సమానమని కమ్యూనిస్టు నేతలు అభివర్ణించారు. ప్రజల్లోకి ఈ విషయాన్ని తీసుకెళ్లడంలో ప్రతిపక్షాలు ఏ మేరకు సఫలమవుతాయో వేచి చూడాలి.
మధ్యస్తంగా మాట్లాడిన వాళ్లే లేరు..
వైఎస్సార్సీపీ కార్పొరేటర్లలో ఒక్కరు కూడా మధ్యస్తంగా మాట్లాడే ప్రయత్నం చేయలేదు. ప్రజల అభిప్రాయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పన్ను పెంపుపై పునరాలోచనకు కృషి చేస్తామని ఒక్కరు కూడా ముందుకు రాలేదు. అలా చేస్తే పార్టీ పెద్దలు కన్నెర్ర చేస్తారనే భయం నేతల్లో కనిపించింది. ప్రభుత్వ నిర్ణయాలను అధికార పార్టీ నేతలు నూరు శాతం వ్యతిరేకించకపోయినా.. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని ప్రజల పక్షాన మాట్లాడే ప్రయత్నం చేస్తుంటారు. విశాఖలో అదీ జరగలేదు.
మూడు రాజధానులకు వ్యతిరేకంగా..
ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నేతల అంశాన్ని ప్రస్తావించాల్సి ఉంది. మూడు రాజధానుల ప్రతిపాదనకు తెలుగుదేశం పార్టీ పూర్తి వ్యతిరేకం. అమరావతి మాత్రమే రాజధానిగా ఉండాలని, మూడు రాజధానుల ప్రతిపాదనను వ్యతిరేకించాలని ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు ఎమ్మెల్యేలకు, పార్టీ నేతలకు స్పష్టం చేశారు. అయితే ప్రజల అభీష్టం మేరకు విశాఖలోని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ప్రకటనలు చేశారు. పార్టీ కన్నా ప్రజలే ముఖ్యమని నిరూపించారు. అధినేత ఆదేశాలను ధిక్కరించి, విశాఖ వాసులుగా.. తాము విశాఖ పరిపాలన రాజధానిగా స్వాగతిస్తున్నామని నగర ఎమ్మెల్యేలు ప్రకటించారు. అయితే ముందుగా అమరావతి రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ తెరపైకి తెచ్చారు. అదేవిధంగా నగరంలో లా అండ్ ఆర్డర్ పరిరక్షణకు హామీ ఇవ్వాలని స్పష్టం చేశారు. అవసరమైతే అధినేత దృష్టికి ప్రజల అభిప్రాయాన్ని తీసుకువెళతామని ఎమ్మెల్యేలు హామీ ఇచ్చారు. ఈ విషయంలో చంద్రబాబు కూడా నేతల అభిప్రాయానికి విలువ ఇచ్చారు. క్రమశిక్షణ పేరిట చర్యలు తీసుకోవడం, పార్టీ చెప్పింది చేయాల్సిందేనంటూ పట్టుబట్టడం లాంటి దిగజారుడు చర్యలకు ఉపక్రమించ లేదు. అదే పన్ను పెంపు విషయం వచ్చే సరికి అధికార పార్టీ కార్పొరేటర్లు అంతా ప్రభుత్వ నిర్ణయానికి జై కొట్టడం.. ప్రజల మనోభావాలను కించపరచడమే అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
Must Read ;- మానసిక వికలాంగులున్న సంస్థ షెడ్ కూల్చివేత.. జీవీఎంసీ అధికారులపై విమర్శలు










