మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికలు ముగిశాయి. ఇప్పుడు సరికొత్త పరిణామాలకు తెరలేస్తోంది. మా రెండు వర్గాలుగా చీలిపోతుందన్న ప్రచారం సాగుతోంది. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ కు మూకుమ్మడి రాజీనామాలు చేయాలన్న ఆలోచనలో ప్రకాష్ రాజ్ వర్గం ఉన్నట్టు సమాచారం. ఇది ప్రకాష్ రాజ్ వర్గానికి మరింత మైనస్ గా మారే ప్రమాదం లేకపోలేదు. అసలు రాజీనామాలు చేయాలనుకోవడమే తొందరపాటు చర్య. ఇప్పుడు గెలుపొందిన వారు కూడా రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం.
అసలు మాలో ఇంత గందరగోళానికి దారితీస్తున్న పరిస్థితులేమిటో అర్థం కావడంలేదు. మంచు మోహన్ బాబు, మంచు విష్ణుల మాటలు తమను బాధపెట్టాయని ప్రకాష్ రాజ్ వర్గం అంటోంది. మరో పక్క ఇక్కడ ప్రాంతీయ వాదం ఉందని, తాను తెలుగు వాడిని కాకపోవడం వల్లే తనను ఓడించారని ప్రకాష్ రాజ్ అంటున్నారు. ప్రాంతీయ వాదం ఉన్న అసోసియేషన్ లో తాను ఉండలేనని ఆయన అంటున్నారు. కొత్త పరిణామాల దృష్ట్యా మా రాజకీయం మరింత ముదిరిపాకానపడబోతోంది.ఏటీఎంఏఏ (ఆల్ తెలుగు మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్) పేరుతో మరో అసోసియేషన్ ను ఏర్పాటు చేయబోతున్నట్టు సమాచారం.
ఇలాంటి పరిణామాలు జరిగితే సినిమా ఇండస్ట్రీ రెండు వర్గాలుగా చీలిపోయే ప్రమాదముంది. తాను బాంబు పేల్చబోతున్నట్టు ఉదయమే ప్రకాష్ రాజ్ ట్విట్టర్ ద్వారా సంకేతమిచ్చారు. సాయంత్రం నుంచి వరుసగా రాజీనామాల పర్వం కొనసాగే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది. ఇది వ్యక్తులుగా వీరు తీసుకున్న నిర్ణయమా? ఓటమిని జీర్ణించుకోలేక కొందరు సినీ పెద్దలు దీన్ని ప్రోత్సహిస్తున్నారా ? అన్న అనుమానాలు కూడా తలెత్తుతున్నాయి. నటీనటుల సంఘంలో చీలిక ఏర్పడితే 24 క్రాఫ్ట్ లలో ఉన్న ఇతర అసోసియేషన్ల మీద కూడా ఆ ప్రభావం కచ్చితంగా పడుతుంది.
దీన్ని ఛాంబర్ ఏ విధంగా ఆమోదిస్తున్నది మరో ప్రశ్న. ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం తెలియాలంటే సాయంత్రం వరకూ ఆగాల్సిందే. సాయంత్రం 5 గంటలకు ఫిలింనగర్ లోని ఎఫ్ఎన్ సీసీలో మీడియా సమావేశాన్ని ప్రకాష్ రాజ్ వర్గం ఏర్పాటుచేసింది. సినీ పరిశ్రమంలో ఇది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అనంతరం మంచు విష్ణు వర్గం కూడా ప్రతిస్పందించే అవకాశం లేకపోలేదు. ఈ పరిణామాలను అడ్గుకోడానికి ఏ పెద్ద మనిషి రంగంలోకి దిగబోతున్నారో చూడాలి.
400 మంది సభ్యులతో కొత్త అసోసియేషన్
కొత్త మా అసోసియేషన్ దిశగా ప్రకాష్ రాజ్ వర్గం పావులు కదుపుతోంది. తమకు ఓటేసిన సభ్యులందరితోనూ కొత్తగా అసోయేషన్ ఏర్పాటుచేయాలన్న నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. దీనికి నిర్మాత అల్లు అరవింద్ కు చెందిన గీతా ఆర్ట్స్ లో కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. దీని వెనక మెగా ఫ్యామిలీ ఉండి ఈ ఏర్పాట్లన్నిటినీ చూసుకుంటున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా మా మాజీ అధ్యక్షుడు నరేష్ కారణంగానే ఈ ఎన్నికల్లో ఇంత గందరగోళ వాతావరణం నెలకొందని ప్రకాష్ రాజ్ వర్గం భావిస్తోంది.
Must Read ;- నాగబాబు, ప్రకాష్ రాజ్ .. క్విట్ ‘మా’ ఉద్యమం











