ఏపీలో వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత… మహిళలపై అకృత్యాలను నివారించేందుకోసమంటూ దిశ పేరిట ప్రత్యేక చట్టాన్ని తీసుకొచ్చే యత్నం చేశారు. ఈ యత్నం కేంద్రం వద్ద బోల్తా కొట్టగా… రాష్ట్రంలో మహిళలు, యువతులు, ముక్కుపచ్చలారని బాలికలపై యథేచ్ఛగా అకృత్యాలు జరిగిపోతున్నాయి. ఇందులో భాగంగా బుధవారం అనంతపురం జిల్లాలో మరో యువతి దారుణ హత్యకు గురైంది. బ్యాంకు ఉద్యోగినిగా పనిచేస్తున్న సదరు యువతిపై అత్యాచారం చేసి ఆపై హత్య చేశారన్న వాదనలు వినిపించగా… తాజాగా ట్రాయాంగిల్ లవ్ నేపథ్యంలోనే ఈ హత్య జరిగిందన్న చర్చలు జరుగుతున్నాయి.
హత్య చేసి పెట్రోలు పోసి కాల్చే యత్నం
అనంతపురం నగరానికి చెందిన స్నేహలత జిల్లాలోని ధర్మవరం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శాఖలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగినిగా పనిచేస్తోంది. ఈ క్రమంలో రోజూ తన సొంతూరు నుంచి బైక్‌పై ధర్మవరం వెళ్లి ఉద్యోగం చేసుకుని తిరిగి అదే బైక్‌పై వచ్చేది. మంగళవారం ఉదయం కూడా ఎప్పటి లాగే బైక్‌పై ధర్మవరానికి ఉద్యోగ నిమిత్తం వెళ్లిన స్నేహలత… రాత్రి అయినా తిరిగి ఇంటికి చేరలేదు. దీంతో అనుమానం వచ్చిన ఆమె తల్లిదండ్రులు అనంతపురం వన్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు స్నేహలత కోసం గాలింపు మొదలు పెట్టారు. ఈ క్రమంలో ధర్మవరం మండలం బడనపల్లి గ్రామం వద్ద గుర్తు తెలియని యువతి మృతదేహం పడి ఉండటాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. హుటాహుటీన అక్కడకు చేరుకున్న పోలీసులు చనిపోయిన యువతి స్నేహలతేనని గుర్తించారు. పరిశీలనలో భాగంగా హత్యకు గురైన స్నేహలతపై పెట్రోల్ పోసి నిందితులు శవాన్ని కాల్చి వేసే యత్నం చేశారు. అయితే, శవం పూర్తిగా కాలకుండానే నిందితులు అక్కడి నుంచి వెళ్లిపోయినట్లుగా పోలీసులు గుర్తించారు.
Must Read ;- దశా దిశా లేని దిశ చట్టం అస్తవ్యస్తమైన ఇసుక విధానం ఇవీ జగన్ నిర్ణయాలు
పోలీసుల దర్యాప్తులో..
స్నేహలత దారుణంగా హత్యకు గురైన విషయాన్ని గుర్తించిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. స్నేహలత తల్లిదండ్రులను రప్పించి విచారణ మొదలు పెట్టారు. విచారణలో బాగంగా రాజేశ్ అనే యువకుడు స్నేహలతను ప్రేమ పేరిట చాలా కాలం నుంచి వేధిస్తున్నాడన్న విషయం బయటపడింది. ఈ విషయంపై స్నేహలత, ఆమె కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేసినా… పోలీసుల నుంచి పెద్దగా స్పందన కనిపించలేదట. దీంతో తాజా ఫిర్యాదు నేపథ్యంలో పోలీసులు వెంటనే రాజేశ్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు తమదైన రీతిలో విచారించగా.. తన స్నేహితుడు రాకేశ్‌కు కూడా ఈ ఘటనలో ప్రమేయమున్నట్లుగా తేలింది. దీంతో రాజేశ్‌తో పాటు రాకేశ్ పైనా పోలీసులు హత్యానేరంతో పాటు అట్రాసిటీ కేసును నమోదు చేశారు. విచారణలో భాగంగా మరో కీలక విషయం కూడా వెలుగులోకి వచ్చింది. ప్రవీణ్ అనే యువకుడితో స్నేహలత సన్నిహితంగా ఉంటోందని, ఈ విషయమే రాజేశ్‌కు కోపం తెప్పించిందని తేలినట్లు సమాచారం. తనను ప్రేమించాలంటూ వెంటబడుతుంటే… తనను కాదని ప్రవీణ్‌తో స్నేహలత సన్నిహితంగా ఉంటోందన్న విషయం తెలుసుకున్న రాజేశ్… తనకు దక్కని స్నేహలత మరెవరికీ దక్కరాదన్న భావనతో స్నేహలతను హత్య చేసినట్లుగా తెలుస్తోంది.
ట్రయాంగిల్ లవ్ నేపథ్యంలోనేనా..
ఇదిలా ఉంటే, స్నేహలత హత్యకు సంబంధించి పోలీసులు… అప్పటికప్పుడు కొన్ని వివరాలను వెల్లడించారు. అందరూ అనుకుంటున్నట్లుగా స్నేహలతను చంపేసే ముందు ఆమెపై నిందితులు అత్యాచారానికి పాల్పడినట్లుగా ఆధారాలు లేవని అనంతపురం ఎస్సీ సత్య యేసుబాబు తెలిపారు. అంతే కాకుండా ట్రయాంగిల్ లవ్ నేపథ్యంలోనే స్నేహలత హత్య జరిగి ఉంటుందని కూడా ఆయన వెల్లడించారు. దర్యాప్తు అనంతరం బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ తెలిపారు. మొత్తంగా పోలీసుల నిర్లక్ష్యం కారణంగానే ఏపీలో మరో యువతి దుండగుల చేతిలో ప్రాణాలు కోల్పోయిందని తేలిపోయింది. ప్రేమ పేరిట వేధింపులు ఎదురవుతున్నాయని స్నేహలత కుటుంబం ఫిర్యాదు చేసినప్పుడే పోలీసులు స్పందించి ఉంటే… ఇప్పుడు స్నేహలత హత్య జరిగి ఉండేది కాదన్న మాట వినిపిస్తోంది. దిశ పేరిట మహిళలకు సంపూర్ణ భద్రత కల్పిస్తామని చెబుతున్న వైసీపీ సర్కారు మాటలు నీటి మూటలుగానే మిగిలిపోతున్నాయన్న మాట కూడా గట్టిగానే వినిపిస్తోంది.
Also Read ;- అకుంటిత దీక్షతో అనుకున్న లక్ష్యం అందుకున్న ‘గరిమా అబ్రాల్’