తిరుపతి నగరంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దేవాలయాలపై దాడులకు నిరసనగా తెలుగుదేశం పార్టీ ఇవాళ తిరుపతిలో ధర్మపరిరక్షణ యాత్రకు పిలుపునిచ్చింది. ఇందుకోసం ముందస్తుగా పోలీసుల అనుమతి కూడా తీసుకున్నారు. అయితే బుధవారం యాత్రకు అనుమతి ఇచ్చిన పోలీసులు గురువారం అనుమతి రద్దు చేశారు. దీనిపై తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తీవ్రంగా మండిపడ్డారు. భూకంపం వచ్చినా తిరుపతిలో చేపట్టిన ధర్మపరిరక్షణ యాత్ర కొనసాగి తీరుతుందని ఆయన స్పష్టం చేశారు. దీంతో ఎన్టీఆర్ సర్కిల్ వద్ద భారీగా పోలీసులను మొహరించారు.
తిరుపతిలో అరెస్టులు
తిరుపతిలో తెలుగుదేశం పార్టీ చేపట్టిన ధర్మపరిరక్షణ యాత్రలో పాల్గొనేందుకు పెద్ద ఎత్తున నాయకులు, కార్యకర్తలు ఎన్టీఆర్ సర్కిల్ వద్దకు చేరుకుంటున్నారు. పోలీసులు వీరిని బలవంతంగా అదుపులోకి తీసుకుని తరలిస్తున్నారు. ఎన్టీఆర్ సర్కిల్ వద్ద టీడీపీ నాయకులు ఏర్పాటు చేసుకున్న మైకులు, స్పీకర్లను కూడా పోలీసులు తొలగించారు. టీడీపీ కీలక నేతల ఇళ్ల వద్ద పోలీసులను భారీగా మోహరించారు. ధర్మపరిరక్షణ యాత్రకు ముందు అనుమతి ఇచ్చి తరవాత రద్దు చేయడాన్ని టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు తప్పుపట్టారు.
Must Read ;- తిరుపతిలో టీడీపీ నేతల అరెస్ట్!











