జీవితం ఎలా సాగుతుందనేది కొందరి విషయంలో పుట్టుకపైన ఆధారపడుంటే.. మరి కొందరి జీవితాలు పట్టుదలపై ఆధారపడుంటాయి. ఎక్కడైనా పుట్టుండచ్చు.. సాధారణ రైతు కుటుంబం నుండి దేశ రాజకీయాల్లో చక్రం తిప్పే వ్యక్తిగా ఎదగచ్చు.. చదువన్నదే తెలియని కుటుంబం నుండి జిల్లాను నడిపించే కలెక్టర్లుగా నియమితులయిన వారు లేకపోలేదు. అంతేకాదు.. మురికివాడలో పుట్టినా.. కలల కనగలిగి.. వాటిని నేరవేర్చుకోగలిగే సత్తా ఉంటే గ్లామర్ ప్రపంచంలో మోడలింగ్ రంగంలో ఎదగచ్చని నిరూపించిందో బాలిక.. అదీ కూడా కేవలం 12 ఏళ్ల వయసులో..
ముంబైలోని మురికివాడలో పుట్టిన ఓ 12 సంవత్సరాల అమ్మాయికి ఫ్యాన్స్ అయిపోయారు మన సినీలోక ప్రముఖులు. అదేంటీ మురికివాడలో చిన్నారిని సెలబ్రిటీలు ఫిదా అయ్యారా అని ఆశ్చర్యపోతున్నారా? అవునండీ! మరి సెలబ్రిటీలు సైతం తన వర్క్‌ను మెచ్చుకునేలా చేసిన ఈ చిన్నారిలో ఉన్న ప్రత్యేకత ఏంటనేది తెలుసుకోవాలనే కుతుహలం కలుగుతుంది కదా! అయితే ఈ స్లమ్ బ్యూటీ కథేంటో తెలుసుకుందాం రండి..
మరికివాడలో మాణిక్యం..
ముంబైలో సముద్రపు ఒడ్డున ఒక మురికవాడలో పుట్టింది మలీశా కర్వా. బతుకు తెరువు కోసం గుజరాత్ నుండి ముంబైకి వలస వచ్చింది మలీశా కుటుంబం. తన తండ్రి, తమ్ముడే తన ప్రపంచం. ముంబైలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో ఏడవ తరగతి చదువుతున్న మలీశా ఇంగ్లీష్‌లో అనర్గళంగా మాట్లాడగలదు. చిన్నతనం నుండే డ్యాన్స్ నేర్చుకోవాలని, మోడలింగ్ రంగంలో సూపర్ మోడల్‌గా పేరు తెచ్చుకోవాలని కుతూహలపడేది. తన కలలకు తగ్గట్టుగా ఇంగ్లీష్ భాషలో ప్రావీణ్యం సంపాదించడం, మోడల్ రంగానికి సంబంధించిన మెలకువలను స్వయంగా నేర్చుకునేది. మురికివాడలో పుట్టిన నేను మోడలింగ్ రంగంలో ఎలా రాణించగలనని తనెప్పుడూ నిరుత్సాహపడలేదు. తన కలను నేరవేర్చుకోవడానికి కావాల్సినట్టుగా సిద్ధమవుతూ ఉండేది.
అనుకోని అదృష్టం..
అలా సాగుతున్న తన జీవితంలో అనుకోని అదృష్టం ఒక హాలీవుడ్ నటుడి రూపంతో ఎదురైంది. స్టెపప్ 2:ద స్ట్రీట్స్ అనే చిత్రంలో నటించిన రాబర్ట్ హోఫ్‌మన్ భారత్‌లో పర్యటించిన సందర్భంలో ముంబై సముద్రపు ఒడ్డున అనుకోకుండా మలీశాను కలిసారు. అదే తన అదృష్ట రేఖను మార్చింది. మలీశాకు ‘పిన్సెన్ ఫ్రమ్ ద స్టమ్’గా పేరుపెట్టి తన పేరు మీద ఒక ఇన్‌స్టాగ్రామ్‌ను మొదలుపెట్టించారు రాబర్ట్. అదే తన దశ తిరిగేలా చేసిందని చెప్పచ్చు. అంతేకాదు, మలీశా కలలు నేరవేర్చుకునేందుకు అనుగుణంగా తనకు ఆసరాగా నిలవడానికి ముందకురావాల్సిందిగా పిలుపునిచ్చారు.
must Read ;- మీకుతెలుసా? మన క్రికెటర్లందరికీ బంగారు తల్లులే!
అలా తనకు అండగా నిలవాలనుకునే వారు గో ఫండ్ మీ వెబ్‌సైట్ ద్వారా విరాళాలు అందించే విధంగా ఏర్పాట్లు చేశారు రాబర్ట్. అంతేకాదు, మురికి వాడలో తన జీవితం గురించి వివరిస్తూ కొన్ని వీడియోలు చేసి రాబర్ట్ సాయంలో యూట్యూబ్‌లో పోస్ట్ చేసింది మలీశా. అలా ఎంతో పాపులారిటీ సంపాదించుకుంది మలీశా. ఇన్‌స్టాలో తనకు 65 వేలకు పైగా ఫాలోవర్స్ ఉన్నారు. తను ఇన్‌స్టా ఖాతాను మొదలుపెట్టి కేవలం 10నెలలు మాత్రమే కావడం విశేషం.
మోడలింగ్‌లో మొదటి అడుగు..
తన కలలను నిజం చేస్తూ.. ఒక పాపులర్ మ్యాగజైన్‌లో మోడలింగ్ అవకాశం దక్కించుకుంది మలీశా. మ్యాగజైన్ కవర్ పేజీ అవకాశం అందుకున్న ఈ బాలిక తన నేచురల్ లుక్‌తో అందరి ప్రశంసలు అందుకుంది. కవర్ పేజ్‌పై ఏమాత్రం బెరుకు, భయం లేకుండా నవ్వులు విరజిమ్ముతూ.. తన ఆత్మ విశ్వాసాన్ని ప్రదర్శించింది. ఎంతో అనుభమవమున్న మోడల్స్‌కు ఏ మాత్రం తీసిపోనంతగా పోజులచ్చి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది ఈ ముంబై బ్యూటీ.
అనుకోకుండా అందిన అదృష్టాన్ని.. తన కృషితో అవకాశంగా మలచుకుని.. మోడలింగ్ రంగంలో ఎదగాలనే తన అభిలాషను చిన్న వయసులోనే నిజం చేసుకుంది మలీశ. తన మోడలింగ్ కెరీర్‌కు మరిన్ని మెరుగులు దిద్దుకుంటూ తను కోరుకున్నట్లు ‘సూపర్ మోడల్’గా నిలవాలని కోరుకుందాం.