హైదరాబాద్‌లోని హఫీజ్‌పేటకు చెందిన కోట్లాది రూపాయల విలువ చేసే భూ వివాదంలో మాజీ మంత్రి అఖిలప్రియతో పాటు ఆమె భర్త భార్గవ్‌రామ్ కూడా పూర్తిగా మునిగిపోయారు. ఇప్పటికే అఖిలప్రియ అరెస్ట్ కాగా… ఆమె భర్త కోసం పోలీసులు ముమ్మరంగా గాలింపు సాగిస్తున్నారు. మాజీ మంత్రి అరెస్ట్ అయిన ఈ కేసులో వీరిద్దరి కంటే కూడా మరింత ఎక్కువగా పోలీసులు ఓ వ్యక్తి కోసం గాలిస్తున్నారు. అతడు ఏ రాజకీయ నేపథ్యం, ఎలాంటి క్రిమినల్ హిస్టరీ లేని కుటుంబానికి చెందిన ఓ యువకుడు. అతడి పేరు మాదాల శీను. గుంటూరు నగరానికి చెందిన ఇతడిని అంతా గుంటూరు శీనుగా పిలుస్తారు. ఎలాంటి రాజకీయ నేపథ్యం లేని ఇతడు… ఏకంగా భూమా ఫ్యామిలీకి అత్యంత సన్నిహితుడిగా ఎలా మారాడు? హఫీజ్ పేట కేసులో ఎంత కీలకంగా వ్యవహరించారన్న విషయంపై ఇప్పుడు ఆసక్తికర విశ్లేషణలు సాగుతున్నాయి. ఈ విశ్లేషణలు హఫీజ్‌పేట భూ వివాదానికి మించి ఆసక్తి రేకెత్తిస్తున్నాయి.
గుంటూరు శీను నేపథ్యం..
అసలు ఈ మాదాల శీను అలియాస్ గుంటూరు శీను నేపథ్యం ఏమిటన్న విషయానికి వస్తే… గుంటూరు నగర శివారులోని ఓ ఇంజినీరింగ్ కళాశాలలో మాదాల శీను సివిల్ ఇంజినీరింగ్ విద్యార్థి. చదువు అంతగా ఒంటబట్టని నేపథ్యంలో ఇంజినీరింగ్‌లో బ్యాక్‌లాగ్స్ అలా పేరుకుపోయాయి. వాటిని క్లియర్ చేయడం చేతకాక పోవడంతో మధ్యలోనే చదువుకు స్వస్తి చెప్పేశాడు. సహచర ఇద్దరు విద్యార్థులతో కలిసి 2014లో గుంటూరు బ్రాడీపేటలో ఇళ్ల నిర్మాణాలకు సంబంధించిన ఇంటీరియర్ డిజైన్ వర్క్స్ కన్సల్టెన్సీ కంపెనీ ప్రారంభించారు. ఈ క్రమంలో అతడికి 2015లో విద్యానగర్‌లో భూమా నాగిరెడ్డికి చెందిన ఇంటిలో ఇంటీరియర్ వర్క్స్ పనులు చేసే కాంట్రాక్టు దక్కింది. ఆ పనుల నిర్వహణలో భాగంగా శ్రీనుకు భూమా నాగిరెడ్డితో పరిచయం ఏర్పడింది. ఫ్యాక్షన్ నేతగా ముద్రపడిన భూమా వద్దకు వచ్చిపోయే అభిమానులు, అనుయాయుల హడావుడి శీనును బాగా ఆకట్టుకున్నాయి. దీంతో భూమా నాగిరెడ్డికి మరింత దగ్గరయ్యేలా వ్యవహరించిన శీను… అందులో సక్సెస్ అయ్యాడు.
Must Read ;- అఖిల ప్రియ కేసు.. మైహోంకు ఆ స్థలం లీజుకిచ్చారా?
నంద్యాల ఉప ఎన్నికలో ప్రచారం..
ఇంటీరియర్ పనుల బిల్లుల కోసం తరచూ నాగిరెడ్డి వద్దకు వెళుతూ ఉండే శీను… భూమా కూతురు అఖిలప్రియకు సన్నిహితంగా మారారని చెబుతున్నారు. నాగిరెడ్డి మరణానంతరం అఖిలప్రియ మంత్రి అయ్యారు. గుంటూరు నుంచి విజయవాడకు ఆమె మకాం మారటంతో అక్కడ ఇంటి నిర్వహణ పనులు చక్కబెడుతూ ఆమెకు మరింత ముఖ్య అనుయాయుడిగా మారాడు. నంద్యాల ఉప ఎన్నికల సమయంలో అఖిలప్రియతో పాటే ఎన్నికల ప్రచారంలో చురుగ్గా పాల్గొన్నారు. మంత్రి హోదాలో అఖిలప్రియ ఓ రోజు గుంటూరులోని శీను నివాసానికి వచ్చారట. అది అతడిని మరింతగా భూమా కుటుంబానికి దగ్గర చేసిందట. ఈ క్రమంలోనే తనకు ఏ రాజకీయ నేపథ్యం లేకున్నా మంత్రి తన ఇంటికి వచ్చారని సన్నిహితుల వద్ద అంటుండేవాడట. మొత్తంగా భూమా కుటుంబానికి ఇలా దగ్గరైన ఆ యువకుడు 2019 సార్వత్రిక ఎన్నికల్లో అఖిలప్రియ ఓటమి అనంతరం కూడా ఆమెతోనే ప్రయాణం చేస్తున్నాడు. సుమారు రెండేళ్ల నుంచి శీను గుంటూరరులో ఉండటం లేదని… మొత్తంగా అఖిల వెంటే తిరగడం మొదలెట్టినట్టుగా గుంటూరులోని డొంకరోడ్డు ప్రాంతవాసులు చెబుతున్నారు.
కుటుంబ నేపథ్యం ..
ఇక శీను కుటుంబ నేపథ్యం విషయానికి వస్తే… అతడి తండ్రి రమణయ్య నగరంలో కొన్నాళ్లు టీస్టాల్ నిర్వహించారు. ఈ టీ స్టాల్‌ను కొంత కాలం పాటు శీను కూడా నిర్వహించాడట. ఇక వీరి కుటుంబానికి వడ్డీ, స్థిరాస్తి వ్యాపారాలు ఉన్నాయి. రమణయ్య ఆరేడు మాసాల కిందట ఓ దొంగ బంగారం కేసులో అభియోగాలు ఎదుర్కొన్నారట. అరండల్‌పేట స్టేషన్ పరిధిలో నివాసం ఉండే శీనుపై ఎలాంటి పోలీసు కేసులు లేవని పోలీసు రికార్డులు చెబుతున్నాయి. మొత్తంగా ఎలాంటి రాజకీయ నేపథ్యం గానీ, ఎలాంటి నేర చరిత్ర గానీ లేని శీను… భూమా ఫ్యామిలీకి అత్యంత సన్నిహితుడిగా మారిపోవడం నిజంగానే ఆసక్తికరమనే చెప్పాలి. భూమా ముఖ్య అనుచరుడు ఏవీ సుబ్బారెడ్డిని అంతమొందించేందుకు భూమా అఖిలప్రియ ఓ పథకం వేస్తే… అందులో సుపారీ గ్యాంగ్‌కు శీను ద్వారానే రూ.50 లక్షలు అందినట్లుగా కూడా ఆరోపణలు వినిపించాయి. ఈ వ్యవహారంలో పోలీసులు శీనును అరెస్ట్ చేయగా… మూడు నెలల పాటు జైల్లో కూడా ఉండి వచ్చాడట.
శీనూదే ప్లానా?
ఇక హఫీజ్‌పేట భూ వివాదం వ్యవహారంలో శీనే అత్యంత కీలకంగా వ్యవహరిచినట్లుగా తెలుస్తోంది. ప్రవీణ్‌రావుతో పాటు అతడి పార్టనర్లను కిడ్నాప్ చేసేందుకు స్వయంగా శీనే ప్లాన్ చేసినట్లుగా తెలుస్తోంది. ఇందుకోసం హైదరాబాద్‌లోని శ్రీనగర్ కాలనీలో సినీ ఆర్టిస్టులకు దుస్తులు అద్దెకు ఇచ్చే కంపెనీకి వెళ్లి పోలీసులు, ఇన్‌కమ్ ట్యాక్స్ అధికారులకు మల్లే కనిపించే విధంగా ప్రత్యేకంగా దుస్తులు తయారు చేయించాడట. అంతే కాకుండా కిడ్నాప్ వ్యవహారం బాధితులకు తెలియకుండా ఉండేలా కిడ్నాప్ ఎపిసోడ్‌పై మూడు, నాలుగు రోజుల పాటు తర్ఫీదు కూడా పొందాడట. అంటే… ఈ వ్యవహారంలో శీను అత్యంత కీలకంగా వ్యవహరించాడన్న మాట. అయితే ఎటొచ్చి బాధితులు రాజకీయంగా కాస్తంత పలుకుబడి కలిగినవారు కావడంతో శీను ప్లాన్ మొత్తం రివర్స్ కొట్టేసింది. ఫలితంగా అఖిలప్రియ అరెస్ట్ కాగా… ఆమె భర్త భార్గవ్‌రామ్‌తో పాటు కీలకంగా వ్యవహరించిన శీను కూడా అజ్జాతంలోకి వెళ్లిపోవాల్సి వచ్చింది.
ఆల్సో 2 Read ;- ఆ హరీష్ కోసం వచ్చి.. వీరిని కిడ్నాప్ చేశారా?











