తెలంగాణలో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. అన్ని పార్టీల వారు ఎన్నికలకు ప్రిపేరవుతూ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. అధికారంలో ఉన్న సీఎం కేసీఆర్ కూడ ఇంత వరకు పెండింగ్‌లో పెట్టిన కొన్ని సమస్యల పరిష్కారానికి త్వరిత గతిన నిర్ణయం తీసుకుంటున్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం నియామకాల పేరుతో అధికారంలోకి వచ్చి నిరుద్యోగులను మోసగిస్తోందని ప్రతిపక్షాల నుంచి తీవ్ర విమర్శలు వస్తున్న నేపథ్యంలో కేసీఆర్ ఉద్యోగాల భర్తీ ప్రక్రియను చేపట్టారు.
50 వేల ఉద్యోగ ఖాళీల భర్తీకి చర్యలు
తెలంగాణలో నూతన జోనల్ విధానానికి రాష్ట్రపతి ఆమోదం లభించడంతో రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ నియామకాల ప్రక్రియకు తెరలేపింది. అత్యంత శాస్త్రీయ విధానం అనుసరించి ఈ జోనల్ విధానానికి రూపకల్పన చేసినట్టు టీఆర్ఎస్ సర్కారు చెబుతోంది. రాష్ట్రంలో ఉద్యోగ ఖాళీల భర్తీకి చర్యలు తీసుకోవాలంటూ సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. అన్ని శాఖల్లో ఉన్న దాదాపు 50 వేల ఉద్యోగాలను మొదటి దశలో భర్తీ చేయాలని, దీనికి సంబంధించిన ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని స్పష్టం చేశారు. పదోన్నతుల కారణంగా ఏర్పడే ఖాళీలను గుర్తించి, వాటిని రెండో దశలో భర్తీ చేయాలని సీఎం సూచించారు.
అంతే కాకుండా టీఆర్‌ఎస్ నుంచి వెళ్లి పోయిన ఈటల రాజేందర్ స్థానంలో మాజీ టీటీడీపీ అధ్యక్షుడు రమణను పార్టీలో చేర్చుకుని బీసీలు తమకు దూరంగా చూడాలని కేసీఆర్ ప్లాన్ చేశారు. హుజురాబాద్ ఉప ఎన్నికల్లో ఎలాగైనా ఈటలను ఓడించేందుకు కేసీఆర్ సర్వశక్తులూ ఒడ్డుతున్నారు.
అందరూ టీడీపీ నుంచి వచ్చిన వారే : రేవంత్ రెడ్డి
టీఆర్‌ఎస్‌లో చేరిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు స్పీకర్ ఫార్మెట్‌లో రాజీనామాలు ఇవ్వాలని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన తర్వాత తాను జీతం తీసుకోలేదని మీడియాతో మాట్లాడుతూ తెలిపారు. కేసీఆర్, గంగుల, ఎర్రబెల్లి, తలసాని, మల్లారెడ్డి, కొప్పుల టీడీపీ నుంచి వచ్చిన వారేనని అన్నారు. తెలంగాణ ఇస్తే టీఆర్‌ఎస్‌ను విలీనం చేస్తానని చెప్పి కేసీఆర్ సోనియాను మోసం చేశారని ఆరోపించారు. జలవివాదాలపై సీఎం కేసీఆర్, జగన్ సురభి నాటకాలు ఆడుతున్నారని విమర్శించారు.
‘‘నా వల్లే కిషన్‌రెడ్డికి కేబినెట్ హోదా దక్కింది. కాంగ్రెస్‌కు బలమైన పీసీసీ ఉన్నాడు కాబట్టే కిషన్‌రెడ్డికి ప్రమోషన్ వచ్చింది. బీజేపీలో చేరి.. తెలంగాణ ఉద్యమకారుడని చెప్పుకొనే అర్హత ఈటల రాజేందర్ కోల్పోయారు. ఈటల రాజేందర్ ఒకప్పుడు కమ్యూనిస్టు, ఇప్పుడు క్యాపిటలిస్ట్. తెలంగాణ అమర వీరుల స్తూపం కాంట్రాక్టులో రూ.100 కోట్ల దోపిడీ జరిగింది. 2022 ఆగస్టు తర్వాత కేసీఆర్ ప్రభుత్వాన్ని రద్దు చేస్తారు. రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు వస్తాయి. వైఎస్‌ఆర్ చివరి కోరిక రాహుల్ గాంధీని ప్రధానిని చేయడం. వైఎస్‌ఆర్ చివరి కోరికను ఆ కుటుంబం నెరవేర్చాలి’’ అని రేవంత్‌రెడ్డి అన్నారు.
పాదయాత్రతో ప్రజల్లోకి బీజేపీ
దుబ్బాకలో విజయం, జీహెచ్ఎంసీలో మెరుగైన ఫలితాలతో ఊపులోకొచ్చిన బీజేపీ తర్వాత చతికిల పడింది. తెలంగాణలో టీఆర్‌ఎస్‌కు తామే ప్రత్యామ్నాయం అంటూ పాదయాత్రతో ప్రజల్లోకి వెళ్ళేందుకు బండి సంజయ్ ప్లాన్ చేస్తున్నారు. వారు ఏ మేరకు సక్సెస్ అవుతారో చూడాలి.
ఈ పార్టీలతో పాటు తెలంగాణలో రాజన్న రాజ్యం తెస్తానంటూ వైఎస్సార్ తెలంగాణ పార్టీ పేరుతో షర్మిల కూడ రంగ ప్రవేశం చేశారు. ఆ పార్టీ ప్రభావం ఏ మేరకు ఉంటుందనేది ఎన్నికల్లోనే తేలేది.
Must Read ;- రెండున్నరేళ్లు హీటే.. మారుతున్న తెలంగాణ పొలిటికల్ సీన్











