ఏపీలో వైసీపీ పాలన మొదలయ్యాక పరిస్థితి ఒక్కసారిగా మారిపోయిందన్న వాదనలు వినిపిస్తున్నాయి.ఎన్నికలకు ముందుకు లెక్కలేనన్ని హామీలిచ్చిన వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి జనాన్ని తన వైపునకు బాగానే తిప్పేసుకున్నారు. ఎన్నికల ఫలితాలు వెల్లడై… తాను సీఎంగా పదవీ ప్రమాణం చేసిన నాడే తన అసలు లక్ష్యమేమిటో కూడా జగన్ చెప్పేశారు.తన రాజకీయ ప్రత్యర్థులను వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నరీతిలో సంచలన ప్రకటనలు చేసిన జగన్… ఏకంగా మీడియా సంస్థలకు కూడా గట్టి వార్నింగే ఇచ్చారు.ఆ వార్నింగ్‌లకు అనుగుణంగానే కదులుతున్న జగన్… నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు వ్యవహారంలో అనుసరించిన తీరే నిదర్శనమన్న వాదనలు వినిపిస్తున్నాయి.
ప్రభుత్వ అసంబద్ధ నిర్ణయాలపై విమర్శలు
గడచిన ఎన్నికలకు కాస్తంత ముందుగా వైసీపీలోకి ఎంట్రీ ఇచ్చిన రఘురామకృష్ణరాజుకు ఆయన అడిగిన మేరకు పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం లోక్‌సభ సీటు దక్కింది.ఎన్నికల్లో వైసీపీ మాదిరే రఘురామకృష్ణరాజు కూడా విజయం సాధించారు.ఆ తర్వాత ఆయా అంశాలపై తన సొంత అభిప్రాయాలను వెల్లడించడానికి వీల్లేదన్న రీతిలో సాగిన వైసీపీ సర్కారు వైఖరికి విసుగెత్తిన రఘురామకృష్ణరాజు ప్రభుత్వ అసంబద్ధ నిర్ణయాలపై వరుసగా విమర్శలు సంధిస్తున్నారు.ఈ క్రమంలో తనకు ఎదురవుతున్న బెదిరింపులకు ఆయన ధీటుగానే సమాధానం చెబుతూ వస్తున్నారు.తననే ప్రశ్నిస్తారా? అన్న దిశగా ఆలోచించిన జగన్ సర్కారు… రఘురామకృష్ణరాజును ఆయన జన్మదినం నాడే అరెస్ట్ చేసింది.ఈ ఘటన ఇటు ఏపీలోనే కాకుండా దేశవ్యాప్తంగా పెను సంచలనం రేపింది.రఘురామకృష్ణరాజుపై రాజద్రోహం కేసులు నమోదు చేసిన జగన్ సర్కారు…ఈ కేసులో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, టీవీ5లపై కూడా అవే సెక్షన్ల కింద కేసు పెట్టింది.
Also Read ;- రఘురామరాజుపై దేశద్రోహం కేసు.. టీవీ5, ఏబీఎన్‌లపై కూడా!

అక్రమంగా అరెస్ట్ చేశారటూ..
అయితే తనను అక్రమంగా అరెస్ట్ చేశారని ఆరోపించిన రఘురామకృష్ణరాజు న్యాయపోరాటం చేసేందుకే సిద్ధపడ్డారు. అరెస్ట్ చేసినా రఘురామకృష్ణరాజు తగ్గలేదని భావించిన జగన్ సర్కారు…ఆయనపై సీఐడీ అదుపులో ఉండగానే భౌతిక దాడి చేయించిందన్న ఆరోపణలు పెను కలకలమే రేపాయి.అంతేకాకుండా రఘురామకృష్ణరాజుకు వైద్య పరీక్షలు, వైద్య సహాయం విషయాల్లో కోర్టు ఆదేశాలను కూడా పట్టించుకోని జగన్ సర్కారుపై…బాధ్యత కలిగిన విపక్ష నేతగా ఉన్న టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు విరుచుకుపడ్డారు.రాష్ట్రంలో భారత రాజ్యాంగ ప్రకారం పాలన సాగుతోందా? లేదంటే జగన్ తన సొంత రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారా? అంటూ నిలదీశారు.ఈ విషయంపై ఆయా రంగాలకు చెందిన నిపుణులతో సమావేశం నిర్వహించిన చంద్రబాబు.. జగన్ సర్కారు వ్యవహార సరళిపై నిప్పులు చెరిగారు. చంద్రబాబు తీసుకున్న వ్యూహాత్మక దాడి ఫలితంగా రఘురామకృష్ణరాజు విషయంలో సుప్రీంకోర్టు సంచలన నిర్ణయాన్ని వెలువరించింది.రఘురామకృష్ణరాజుపై పోలీసుల అదుపులోనే భౌతిక దాడి జరిగిందా? లేదా? అన్న విషయాన్ని తేల్చే బాధ్యతను సికింద్రాబాద్‌లోని ఆర్మీ ఆస్పత్రికి అప్పజెప్పింది.
ఆధారాలు బయటపెట్టడానికి బదులు..
ఇలాంటి సమయంలో ఏ పార్టీ అయినా,ఏ పార్టీ ప్రభుత్వమైనా సంయమనంతో వ్యవహరించాలి. అప్పటిదాకా తీసుకున్న తన చర్యలు తప్పని తేలిన విషయాన్ని గుర్తించి దిద్దుబాట పట్టాలి.అయితే అందుకు భిన్నంగా వైసీపీ విచిత్రంగా వ్యవహరించింది.అసలు దిద్దుబాటు అన్న మాటే తమకు సూటవదన్నట్లుగా వైసీపీకి చెందిన ఎంపీలు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, బాలశౌరి, లావు శ్రీకృష్ణదేవరాయలు… చంద్రబాబుపై తమదైన శైలి ఆరోపణలు గుప్పించారు.అసలు రఘురామకృష్ణరాజు వైసీపీపై చేసిన ఆరోపణల వెనుక చంద్రబాబు పాత్రకు సంబంధించిన ఆధారాలు బయటపెట్టడానికి బదులుగా…చంద్రబాబుపై దిగజారుడు విమర్శలు చేసి తనదైన విచిత్ర వైఖరిని ప్రదర్శించారు.అసలు తమ పార్టీ ప్రభుత్వం తీసుకునే ఏ నిర్ణయంపై అయినా ప్రశ్నించడానికే వీల్లేదన్నట్లుగా వైసీపీ ఎంపీలు మాట్లాడుతున్నారరన్న వాదనలు వినిపిస్తున్నాయి.
Must Read ;- పేలుడులో జగన్ కుట్ర కోణం బీటెక్ రవి బద్దలు కొట్టేశారు!











