కరోనా కష్ట కాలంలో ఎన్నెన్ని ఇంగ్లీష్ మందులు వచ్చినా.. నెల్లూరు జిల్లా కృష్ణపట్నం గ్రామానికి చెందిన ఆనందయ్య తయారు చేసిన ఆయుర్వేద మందు విశేష ప్రాచుర్యం పొందింది. ఈ మందుతో ఆనందయ్య పేరు కూడా మారుమోగిపోయింది. ఇంగ్లీష్ మందులకే లొంగని కరోనాను నివారించే ఆయుర్వేద మందును తయారు చేసినా.. ఏమాత్రం ధనార్జన దిశగా ఆలోచించని ఆనందయ్య.. ఆ మందును ఉచితంగానే పంపిణీ చేసి మరింతగా ప్రాచుర్యం పొందారు. ఆనందయ్య మందు కోసం కృష్ణపట్నంలో బారులు తీరిన జనం, పరుగులు పెట్టిన ప్రజాప్రతినిధులు, క్రెడిట్ కొట్టేసేందుకు జరిగిన యత్నాలు, ఆనందయ్య మందు పేరిట ఎంట్రీ ఇచ్చిన నకిలీలు.. ఇలా ఆనందయ్య కేంద్రంగా చోటుచేసుకున్న పరిణామాలన్నీ వైరల్‌గానే మారాయి. ఆయుర్వేద మందుల తయారీలో దిట్టగా పేరుగాంచిన ఆనందయ్య ఇప్పుడు రాజకీయ పార్టీ స్థాపించే దిశగా సాగుతున్నారు. బీసీల కోసమే ఎంట్రీ ఇవ్వనున్న ఆ పార్టీకి రెండు తెలుగు రాష్ట్రాల శాఖల బాధ్యతను స్వీకరించేందుకు తాను సిద్ధమేనని ఆనందయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు.
దేవుడి దయ ఉంటే ఎమ్మెల్యే అవుతా!
ఆనందయ్య రాజకీయ వాసనలు తెలియని వ్యక్తేమీ కాదు. ఎందుకంటే.. గతంలో టీడీపీతో కలిసి సాగిన ఆనందయ్య ఇప్పుడు ఏపీలో అధికార పార్టీగా ఉన్న వైసీపీలో కొనసాగుతున్నారు. గతంలో కృష్ణపట్నం గ్రామ సర్పంచ్ గా పనిచేసిన ఆయన ఇప్పుడు అదే గ్రామానికి ఎంపీటీసీగా కొనసాగుతున్నారు. ఇటీవల ముగిసిన ఎన్నికల్లో ఆనందయ్య ఎంపీటీసీగా ఎన్నికయ్యారు. తాజాగా బీసీల పేరిట వస్తున్న పార్టీలో తాను ఎమ్మెల్యేను కూడా అవుతానంటూ ఆనందయ్య ఆసక్తికర కామెంట్ చేశారు. ‘‘సర్పంచ్‌గా చేశాను, ఇప్పుడు ఎంపీటీసీగా కొనసాగుతున్నాను. దేవుడి దయ ఉంటే ఎమ్మెల్యేను కూడా అవుతా’’ అంటూ ఆనందయ్య వ్యాఖ్యానించారు. ఆనందయ్య చెప్పిన దాని ప్రకారం బీసీల పేరిట వచ్చే పార్టీ ఒక్క తెలుగు రాష్ట్రాలకే పరిమితం కాదట. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ ఈ పార్టీ ప్రారంభమవుతుందట. ఇందుకోసం అఖిల భారత యాదవ సమాఖ్య కసరత్తులు చేస్తోందట. ప్రస్తుతం ఏపీలో సమీక్షలు నిర్వహిస్తున్న సమాఖ్య నుంచి ఆనందయ్యకు కూడా పిలుపు వచ్చిందట. రాజకీయాల్లో బీసీలకు తగిన మేర ప్రాధాన్యం లేదని ఆరోపిస్తున్న సమాఖ్య.. ఆ ప్రాధాన్యాన్ని దక్కించుకోవడంతో పాటుగా దేశంలో దేశంలో ధర్మబద్ధమైన పాలన అందించే దిశగా కొత్త పార్టీని పెట్టాలని భావిస్తున్నదట.
ఈ దిశగా నడిపిందెవరంటే..?
కరోనాను ఆయుర్వేద మందుతో తరిమికొడతానని ప్రకటించిన ఆనందయ్య.. తాను తయారు చేసిన మందులను తన గ్రామానికి చెందిన వారికి ఉచితంగా పంపిణీ చేశారు. ఈ విషయం తెలిసి చాలా మంది కృష్ణపట్నం తరలివచ్చారు. రోజుకు వేలాది మంది వస్తుండటంతో.. ఆనందయ్య పేరు రాష్ట్రం దాటి దేశవ్యాప్తంగా మారుమోగిపోయింది. అయితే అక్కడి ఎమ్మెల్యే, వైసీపీ నేత కాకాణి గోవర్ధన్ రెడ్డి ఎంట్రీ ఇచ్చారు. మందు పంపిణీని నిలుపుదల చేయించి.. ఆనందయ్యను తన నివాసానికి పిలిపించి.. తన మాటలను ఆనందయ్య నోట పలికించారన్న ఆరోపణలు వినిపించాయి. ఈ పరిణామాలపై టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి నిరసన వ్యక్తం చేశారు. మందును ఉచితంగా ఇస్తానంటే ఆపడమెందుకు? అంటూ కాకాణిపై విరుచుకుపడ్డారు. అయినా కూడా కాకాణి తన వైఖరి మార్చుకోకపోగా.. మందు తయారీ మొత్తం తన ఆధీనంలోనే కొనసాగాలన్నట్లుగా వ్యవహరించారన్న ఆరోపణలు వినిపించాయి. ఈ క్రమంలో కొన్ని రోజుల పాటు ఆనందయ్య అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు కూడా. ఈ సమయంలో ఆయన చేత పలువురు వైసీపీ నేతలు బలవంతంగా మందును తయారు చేయించుకున్నారన్న ఆరోపణలూ వినిపించాయి. ఈ క్రమంలో చోటుచేసుకున్న రాజకీయ పరిణామాలతో విసుగెత్తిపోయిన ఆనందయ్య.. యాదవ సమాఖ్య పిలిచినంతనే రాజకీయాల్లోకి పూర్తి స్థాయిలో ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధపడిపోయారన్న వాదనలు వినిపిస్తున్నాయి.
Must Read ;- వైసీపీది ద్వంద్వ వైఖరే.. ఇదిగో నిదర్శనం











