నట సింహం నందమూరి బాలకృష్ణ అభిమానులకు నిరాశ కలిగించే వార్త ఇది. ఈసారి జూన్ 10న జరిగే తన పుట్టిన రోజు వేడుకలకు ఎవరూ రావద్దని నందమూరి బాలకృష్ణ పిలుపునిచ్చారు. దీనిపై ఆయన తన ట్విట్టర్ ఖాతాలో ఓ పోస్టు పెట్టారు. ‘ఏటా జూన్ 10 వతేదీ నాపుట్టినరోజునాడు నన్ను కలిసేందుకు నలుదిక్కుల నుంచీ తరలివస్తున్న మీ అభిమానానికి సర్వదా విధేయుడ్ని. కరోనా విలయ తాండవం చేస్తున్న ఈ విపత్కర పరిస్థితుల్లో మీరు రావటం అభిలషణీయం కాదు.
నన్నింతటివాడ్ని చేసింది మీఅభిమానం ఒక్క అభిమాని దూరమైనా నేను భరించలేను. మీ అభిమానాన్ని మించిన ఆశీస్సు లేదు.. మీ ఆరోగ్యాన్ని మించిన శుభాకాంక్ష లేదు. మీ కుటుంబంతో మీరు ఆనందంగా గడపటమే నా జన్మదినవేడుక. దయచేసి ఎవరూ నా దగ్గరకు రావద్దు.’ అంటూ ఆయన పోస్టు పెట్టారు. ఈ కరోనా విపత్కాలంలో అసువులు బాసిన నా అభిమానులకూ కార్యకర్తలకూ అభాగ్యులందరికీ నివాళులర్పించారు.
అఖండ విడుదలపై ఉత్కంఠ
బాలయ్య, బోయపాటి కాంబినేషన్ లో రూపొందుతున్న అఖండ సినిమా విడుదలపైనా అభిమానుల్లో ఉత్కంఠ ఏర్పడింది. కరోనా సెకండ్ వేవ్ లేకుంటే ఎన్టీఆర్ పుట్టిన రోజు నాడే ఈ సినిమా విడుదలై ఉండేది. ఇప్పుడీ సినిమా విడుదల దసరాకి ఉండొచ్చన్న ఊహాగానాలు సాగుతున్నాయి. ఈ సినిమా విడుదలపై స్పష్టత ఈ నెల 10 వ తేదీన వచ్చే అవకాశం ఉంది.
అలాగే ఈ సినిమా తర్వాత బాలయ్య ఏయే సినిమాల్లో నటించనున్నారన్నదానిపైన కూడా అప్ డేట్స్ సిద్ధమవుతున్నాయి. మలినేని గోపీచంద్ దర్శకత్వంలో ఓ సినిమాని బాలకృష్ణ అంగీకరించారు. అఖండ తర్వాత ఆయన నటించే సినిమా ఇదే కావడానికి అవకాశం ఉంది. దీని తర్వాత అనిల్ రావిపూడి దర్శకత్వంలో సినిమా ప్రారంభమవుతుంది. మరి కొన్ని అప్ డేట్స్ తో పాటు పుట్టిన రోజున ఓ బిగ్ అప్ డేట్ కూడా ఉన్నట్టు వార్తలు అందుతున్నాయి.
Must Read ;- యంగ్ డైరెక్టర్స్ కే ఓటేస్తున్న బాలయ్య