నటన అనే నవరసాల కళాక్షేత్రంలో ఎందరెందరో నందమూరి వారసులు. తెలుగు సినిమా రంగంలో హీరోకు ఇంత క్రేజ్ ఉంటుందని తెలియజెప్పిన ఏకైక నటుడు ఒక్క విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావే.
జూనియర్ లు ఎందరొచ్చినా ఎన్టీఆర్ అంటే ఆయనొక్కరే. తెలుగు సినీ రంగంలో ఎన్టీఆర్ తర్వాత ఎందరెందరో హీరోలు వచ్చినా ఆయన బెదరలేదు.. ఆయన స్థానం చెక్కుచెదరలేదు. చరిత్ర చర్విత చరణం అంటారు. ఎవరికైనా మూడో తరంలో అలాంటి వైభవం వస్తుందని జ్యోతిషవేత్తల మాట కూడా. నందమూరి హరికృష్ణ కుమారుడు జూనియర్ ఎన్టీఆర్ విషయంలో అది నిజమైంది. ఇప్పుడు అసలైన ఆట మొదలు కాబోతుందనుకోవాలా?. ‘ఫ్లూటు జింక ముందు ఊదు సింహం ముందు కాదు’ అంటూ డైలాగుల్లో తన తండ్రి మార్కు చూపించే నట సింహం నందమూరి బాలకృష్ణ తెలుగు సినిమా రంగానికి తన వారసుడిని పరిచయం చేయాలనుకుంటున్నారు.
స్వర్గీయ నందమూరి తారక రామారావు ఓ సందర్భంలో ‘నా వారసుడు బాలయ్యే’ అంటూ ప్రకటించారు. ఏ ముహూర్తాన ఆయన ఆ మాట అన్నారో గానీ బాలకృష్ణ ఆ మాటను నిలబెట్టుకున్నారు. సినీ రంగంలో తనకంటూ ఓ ప్రత్యేక పేజీని నిర్మించుకున్నారు. నందమూరి మూడో తరానికి ఇప్పుడు ముహూర్తం సిద్ధమైపోయింది. నందమూరి బాలకృష్ణ నట వారసుడిగా నందమూరి మోక్షజ్ఞ రంగ ప్రవేశానికి సర్వం సిద్ధమవుతోంది. మోక్షజ్ఞ మొదట్నుంచీ సినిమాల మీద అంత ఆసక్తి చూపలేదు. అవకాశం ఉన్నా ఏ సినిమాలోనూ కనీసం బాలనటుడిగానూ నటించలేదు. బాలయ్య అభిమానులు మాత్రం మోక్షజ్ఞ సినిమాల్లోకి రావలసిందే అంటున్నారు.
Must Read ;- నందమూరి అందాల రాముడి ‘లేఖా’రవిందం
ముహూర్తం ఎప్పుడు?
నందమూరి మోక్షజ్ఞ సినీ రంగ ప్రవేశం వార్త నందమూరి అభిమానుల్లో ఆనందోత్సాహాలు నింపుతోంది. అయితే ముహూర్తం ఎప్పుడు అనేది పెద్ద ప్రశ్నగా మారింది. నందమూరి బాలకృష్ణ పుట్టిన రోజైన జూన్ 10న ఈ సినిమా ప్రారంభమవుతుందని వార్తలు వస్తున్నాయి. దీనికి పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించనున్నారనే ప్రచారం కూడా సాగుతోంది. నిజానికి ఆరోజు ఈ సినిమా ప్రారంభమయ్యే అవకాశం లేదు. ఎందుకంటే ఆరోజు తిథి అమావాస్య. సెంటిమెంట్లకు అధిక ప్రాధాన్యం ఇచ్చే బాలకృష్ణ ఆ రోజు ప్రారంభించడానికి అంగీకరించపోవచ్చు. అలాంటప్పుడు దానికి ప్రత్యేమ్నాయంగా ఓ ముహూర్తానికి అవకాశం ఉంది. అది మే 28.
స్వర్గీయ నందమూరి తారక రామారావు పుట్టిన రోజది. నందమూరి బాలకృష్ణ ‘తాతమ్మ కల’ చిత్రంతో వెండి తెరకు పరిచయమయ్యారు. దీనికి ఎన్టీఆర్ స్వయంగా దర్శకత్వం వహించారు. 1974లో ఈ సినిమా ప్రారంభమైంది. హీరోగా ‘సాహసమే జీవితం’ చిత్రంతో ఆయన కెరీర్ ప్రారంభమైంది. ఇది 1984లో విడుదలైంది. ఈ పదేళ్ల వ్యవధిలో తండ్రితో పాటు బాలయ్య సినిమాల్లో కనిపించారు. కొన్ని కీలక పాత్రలు కూడా చేశారు. బాలయ్య తన 24వ ఏటకే హీరోగా స్థిరపడ్డారు. మోక్షజ్ఞకు ఇప్పుడు 26 ఏళ్లు. హీరోగా పరిచయానికి ఇంత ఆలస్యం కావడానికి మోక్షజ్ఞకు నటనపై అంత ఆసక్తి లేకపోవడం కూడా కారణం కావచ్చు. ఇదిగో అదిగో అంటున్నా మోక్షజ్ఞ సినీ రంగ ప్రవేశం ఆలస్యం కావడానికి కారణం అదే. ఈ ఏడాది నందమూరి అభిమానుల కోరిక తీరే అవకాశం అయితే కనుచూపు దూరంలోనే ఉంది.
– హేమసుందర్ పామర్తి
Also Read ;- ‘తారా’స్థాయిలో సినిమాలు చేయబోతున్న రాజకీయం?