Bandla Ganesh Involved In Maa Elections 2021 Big Shock To Prakash Raj :
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికల తేదీ రాక ముందు నుంచి ప్రకాష్ రాజ్, మంచు విష్ణు, జీవిత, హేమ, సివిఎల్ నరసింహారావు పోటీ చేయనున్నట్టు ప్రకటించి వార్తల్లో నిలిచారు. దీంతో ఈసారి మా ఎన్నికలు రసవత్తరంగా జరగనున్నాయి అని సినీ ప్రముఖులు మాత్రమే కాకుండా సామాన్యులు సైతం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇదిలా ఉంటే.. ప్రకాష్ రాజ్ జీవిత, హేమలను ఒప్పించి పోటీ నుంచి తప్పించారు. అంతే కాకుండా తన ప్యానల్ తరుపున పోటీ చేయిస్తుండడం.. ఈ విషయాన్ని ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పడం జరిగింది.
ఇదే ఓ పెద్ద ట్విస్ట్ అనుకుంటే.. బండ్ల గణేష్ అంతకంటే పెద్ద ట్విస్ట్ ఇచ్చారు. ప్రకాష్ రాజ్ ప్యానెల్‌కు అధికారిక ప్రతినిధిగా ఉంటూ ఆ ప్యానెల్‌కు మద్దతుగా ఇన్నాళ్లూ మాట్లాడుతూ వచ్చిన నటుడు, నిర్మాత బండ్ల గణేష్ షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడు. ఆ ప్యానెల్ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. అంతే కాకుండా రాబోయే ఎన్నికల్లో జనరల్ సెక్రటరీ పదవికి పోటీ చేస్తున్నట్టు అనౌన్స్ చేశారు. ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నారని బండ్ల గణేష్ ని అడిగితే… జీవితను జనరల్ సెక్రటరీ పదవికి పోటీలో నిలపడం తనకు నచ్చలేదన్నారు బండ్ల గణేష్.
మాట తప్పను .. మడమ తిప్పను. నాది ఒకటే మాట ఒకటే బాట. నమ్మడం నమ్మినవారి కోసం బతకడం. నా మనస్సాక్షి చెప్పినట్టు నడుచుకుంటాను. నేను ఎవరి మాట వినను. త్వరలో జరిగే మా ఎన్నికల్లో జనరల్ సెక్రటరీగా పోటీ చేస్తాను. ఘన విజయం సాధిస్తాను అని చెప్పారు. అంతే కాకుండా.. తను గెలిస్తే… వంద మంది పేద కళాకారులకు డబుల్ బెడ్ రూం ఇళ్ల వచ్చేలా చేస్తాను. దాని కోసం పోరాడతా. వారి సొంత ఇంటి కల నిజం చేస్తానన్నారు. బండ్ల గణేష్ ఇలా ప్రకాస్ రాజ్ కి షాక్ ఇవ్వడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యింది. ఆయన వెనుక ఉన్నది ఎవరు..? అనేది ఆసక్తిగా మారింది. మా ఎన్నికలు జరిగే లోపు ఇంకెన్ని ట్విస్టులు చూడాల్సి వస్తుందో అనే టాక్ వినిపిస్తోంది.
Must Read ;- నారి నారి నడు‘మా’ ప్రకాష్ రాజ్?