(విశాఖపట్నం నుంచి లియోన్యూస్ ప్రతినిధి)
రామతీర్థం ఘటనపై భారతీయ జనతా పార్టీ సాగిస్తున్న పోరాటంతో మైలేజీ సాధించింది. ఈ విషయంలో ప్రధాన ప్రతిపక్షాన్ని వెనక్కు నెట్టి బిజెపి ఆందోళనలు కొనసాగిస్తోంది. బిజెపి, జనసేన రామతీర్థం యాత్రకు ప్రభుత్వం అడుగడుగునా ఆటంకాలు కల్పిస్తున్నా వెనక్కు తగ్గకుండా పదేపదే ఆలయ క్షేత్ర పర్యటనకు పిలుపునిస్తూ ప్రజల దృష్టిని ఆకర్షిస్తోంది. పోలీసులు అనుమతి లేదంటూ ముఖ్య నాయకులకు ముందస్తు నోటీసులు, హౌస్ అరెస్టులు చేస్తుండడంతో సర్వత్రా చర్చ నడుస్తోంది. మతతత్వ పార్టీగా బిజెపికి ముద్ర ఉన్నప్పటికీ.. హిందువుల మనోభావాలను ఆకట్టుకునే విధంగా ఆ పార్టీ ఆందోళన కార్యక్రమాలను నిర్వహిస్తోంది.
వారం రోజులుగా ఇదే టాపిక్ ఎక్కడ చూసినా నడుస్తోంది. సోషల్ మీడియాలోనూ హల్ చల్ చేస్తోంది. విశాఖ, విజయనగరం బిజెపి కార్యాలయాల వద్ద భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసి బీజేపీ నాయకులను కట్టడి చేస్తున్నా, ఏదో ఒక రూపంలో ప్రజల దృష్టిని తమ వైపునకు తిప్పుకోవడంలో బిజెపి నాయకులు సఫలం అయ్యారనే చెప్పాలి. విశాఖలో ఈ యాత్ర ప్రారంభిస్తున్న బీజేపీ నాయకులు పోలీసుల వలయాలను దాటుకుని రామతీర్థం ఆర్చి వద్దకు ఏదో ఒక మార్గంలో చేరుకుంటూ ఇరు జిల్లాల్లో సంచలనం రేపుతున్నారు.
Must Read ;- చినజీయర్ యాత్ర.. వైసీపీకి పెద్ద టెన్షన్
బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, ఉపాధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు, ఎమ్మెల్సీ మాధవ్, బిజెవైఎం అధ్యక్షులు కేతినేని సురేంద్ర మోహన్ ఇలా ప్రతి ఒక్కరు ఆందోళన కార్యక్రమాల్లో చురుగ్గా భాగస్వామ్యం అవుతుండడంతో ఈ వ్యవహారంలో అధికార పార్టీకి ప్రధాన సమస్యగా మారారు.
చంద్రబాబు రామతీర్థ పర్యటన తర్వాత.. టిడిపి నాయకులు ప్రెస్‌మీట్లు, సోషల్ మీడియా ప్రకటనలకే పరిమితం అయ్యారు. విశాఖలో నలుగురు ఎమ్మెల్యేలు టీడీపీకి ఉన్నప్పటికీ… అధికార పార్టీని ఇరుకున పెట్టడంలో విఫలమయ్యారు. ఇద్దరు ఎమ్మెల్యేలు వైసీపీకి మద్దతుగా వ్యవహరిస్తుండడంతో ఇతర నాయకులు ఈ వ్యవహారంపై కిమ్మనడం లేదు. విశాఖలో తెలుగుదేశం పార్టీకి ఉన్న కేడర్‌తో బిజెపికి ఉన్న క్యాడర్ ను పోలిస్తే.. దరిదాపుల్లోకి కూడా బిజెపి చేరలేదు. కానీ బి జె పి రాష్ట్ర అధ్యక్షుడు రెండు రోజులుగా విశాఖలో తిష్ట వేసి అటు టిడిపిని వైసీపీని టార్గెట్ చేస్తూ ఆందోళన కార్యక్రమాలు, మీడియా సమావేశాలు నిర్వహిస్తూ… పోలీసులకు చేతినిండా పని చెబుతున్నారు.
రామతీర్థం యాత్ర కు అనుమతి లేదంటూ అడ్డుకోవడం సమంజసం కాదని పోలీసులు, ప్రభుత్వంపై విరుచుకు పడుతున్నారు. జగన్మోహన్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే హిందూ ఆలయాల పై దాడులను నియంత్రించాలని డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్రంలో ఎన్నో ఆలయాలపై వరుస దాడులు జరుగుతున్నా ఒక్కరిని కూడా అరెస్ట్ చేయకపోవడంపై ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు.
ప్రస్తుతం బీజేపీని విమర్శిస్తున్న దేవాదాయ శాఖ మంత్రి తీరు పైనా విమర్శలు సంధిస్తున్నారు. ఆలయాల పై దాడులకు నైతిక బాధ్యత వహిస్తూ వెల్లంపల్లి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. తమ పార్టీకి ఉనికే లేదని చెప్పిన మంత్రి గతంలో బీజేపీ తరపున ఎమ్మెల్యేగా పోటీ చేసిన విషయాన్ని.. అతి తక్కువ ఓట్ల తేడాతో ఓడిపోయిన విషయాన్ని వెల్లంపల్లికి గుర్తు చేస్తున్నారు.
ఇదే క్రమంలో టీడీపీని ఇరుకున పెట్టే పనిలో కూడా సఫలం అవుతున్నారు. టిడిపి రాజకీయ కోణంలో ఈ ఘటనను చూస్తే.. తాము హిందువులు మనోభావాల కోసం పోరాడుతున్నాం అని ప్రచారం చేసుకుంటున్నారు. అధికార పార్టీ, ప్రతిపక్షం రెండు ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తుంటే… ప్రజల మనోభావాల కోసం పని చేస్తున్నామని.. తిరుపతి ఎన్నికల్లో జనసేన, బీజేపీ సత్తా ఏంటో రెండు పార్టీలకు తెలుస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. రామతీర్థం ఘటనలో నిందితులను పట్టుకోవడంలో విఫలమైన ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడంలో మొత్తంగా తెలుగుదేశం విశాఖ నాయకులు విఫలం అయ్యారు.
Also Read ;- రంగంలోకి యోగి : రామతీర్థంపై కేంద్ర బీజేపీ సీరియస్