నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య అనారోగ్యంతో చనిపోవడంతో ఆ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక జరగనుంది. ఈ నేపథ్యంలో అప్పుడే రాజకీయ పార్టీలు తమ తమ ప్రయత్నాలు మొదలు పెట్టి అంచనాలు వేసుకుంటున్నాయి. దుబ్బాక గెలుపుతో స్పీడ్ పెంచిన బీజేపీ.. ఆపరేషన్ కమలంలో భాగంగా.. నేతలను, నాయకులను తమ పార్టీలో చేర్చుకునేందుకు పావులు కదుపుతోంది. ఇప్పటికే స్వామిగౌడ్‌ని తమ పార్టీలో చేర్చుకున్న బీజేపీ టీఆర్ఎస్‌కు షాక్ ఇచ్చింది. ఇక కాంగ్రెస్ నేత విజయశాంతి కూడా ఆ పార్టీలో చేరేందుకు సిద్దంగా ఉన్నారన్న వార్తలు వస్తున్నాయి. నాగార్జున సాగర్ ఉప ఎన్నికపై బీజేపీ కన్ను పడింది. వాస్తవానికి ఆ నియోజకవర్గంలో బీజేపీకి ఎక్కడా పెద్దగా పట్టులేదు. 2018లో ఒంటరిగా పోటీ చేసిన బీజేపీ అభ్యర్థి నివేదితకు 2675 ఓట్లు మాత్రమే వచ్చి డిపాజిట్ కోల్పోయారు. గతంలో చలకుర్తి నియోజకవర్గంగా ఉన్నా.. నియోజకవర్గాల పునర్విభజన తరువాత నాగార్జున సాగర్ గా మారింది. పాత నియోజకవర్గంలో అంటే..చలకుర్తిలో 1994లో పోటీచేసిన బీజేపీకి 522 ఓట్లు వచ్చి ఐదో స్థానంలో నిలిచింది. అప్పటికి ఇప్పటికి పార్టీలో, బయట రాజకీయ సమీకరణాల్లో మార్పులు వచ్చిన నేపథ్యంలో కాంగ్రెస్ కంచుకోటగా పేరున్న నల్గొండ జిల్లాలో టీఆర్ఎస్ తరహాలో తాము కూడా పాగా వేయాలనే వ్యూహంలో బీజేపీ ఉందని చెప్పవచ్చు.
కాంగ్రెస్ పట్టు..
ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్‌కు గట్టి పట్టుంది. ఇక్కడ కీలకంగా ఉన్న జానారెడ్డి 1978 నుంచి 2014 వరకు 7సార్లు గెలిచారు. జనతా పార్టీ, టీడీపీల్లో కొంత కాలం ఉన్న జానా.. తరువాత కాంగ్రెస్‌లో చేరారు. జానారెడ్డి విషయంలో దేశవ్యాప్తంగా ఓ అంశం చర్చకు నిలిచింది. 1994లో తాను ఎన్నికల్లో ప్రచారం చేయనని, అయినా గెలుస్తానని వ్యాఖ్యానించారు. అనుకున్నట్లుగానే ఆయన ప్రచారం చేయలేదు. కాని సమీప టీడీపీ ప్రత్యర్థి జి.రామ్మూర్తి చేతిలో కేవలం 2వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఆయన ఓడిపోయినా, నియోజకవర్గంలో జానారెడ్డి పట్టు ఎంత అనేది చర్చకు వచ్చింది. అయితే 2018లో టీఆర్ఎస్ అభ్యర్థి నోముల నర్సింహయ్య జానారెడ్డి చేతిలో ఓడారు.
అంతకు ముందు నోముల రెండు సార్లు సీపీఎం నుంచి నకిరేకల్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2014లో టీఆర్ఎస్‌లో చేరారు. అప్పటి చలకుర్తి (నాగార్జున సాగర్ )లో పోటీచేసి జానారెడ్డి చేతిలో ఓడారు. 2018లో జానాపై 7వేల మెజార్టీతో గెలిచారు. అదే సమయంలో జానారెడ్డికి అండగా ఉన్న నల్లమోతు భాస్కర్ (ఎమ్మెల్యే), హన్మంతరావు లాంటి లీడర్లు టీఆర్ఎస్‌లో చేరారు. దీంతో పాటు జానారెడ్డికి పట్టు ఉన్న గిరిజన ప్రాంతాల్లోనూ టీఆర్ఎస్ పట్టు బిగించింది. దీంతో జానాకు కొంత ఇబ్బంది అయింది. దీంతో ఓడిపోవాల్సి వచ్చింది. అయినా జానారెడ్డికి ఇప్పటికీ అక్కడ భారీగానే ఓటు బ్యాంకు ఉంది. ఎన్టీఆర్ హయాంలో 15 శాఖలకు మంత్రిగా ఉన్న జానారెడ్డి తన నియోజకవర్గంలో అన్ని విభాగాల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి పట్టును మరింత పెంచుకున్నారు.
Also Read ;- గ్రేటర్ ఉత్సాహం.. తెలంగాణలో విస్తరణకు బీజేపీ ప్లాన్
కుమారుడికి టిక్కెట్ కోరిన జానా
జానారెడ్డి గత అసెంబ్లీ ఎన్నికల్లో తన కుమారుడు రఘువీర్‌కు టిక్కెట్ అడిగారు. తాను ఎంపీగా పోటీ చేస్తానని, తన కుమారుడు రఘువీర్‌కి నాగార్జున సాగర్ ఎమ్మెల్యే టిక్కెట్ ఇవ్వాలని కోరినట్లు ప్రచారం జరిగింది. అయితే సొంత కుంపట్లు ఎక్కువగా ఉండే కాంగ్రెస్ పార్టీలో అంతర్గతంగా ఏం జరిగిందనేది బయటకు రాలేదు. కాని రఘువీర్‌కు టిక్కెట్ సాధ్యం కాదని కాంగ్రెస్ చెప్పింది. తనలాంటి సీనియర్ లీడర్ అడిగినా పార్టీ ఇలాంటి నిర్ణయం తీసుకోవడం పట్ల అప్పట్లోనే జానా కొంత అసహనం వ్యక్తం చేసినట్టు ప్రచారం జరిగింది. ఇక 2018 ఎన్నికల తరువాత పార్టీ కార్యక్రమాల్లో పెద్దగా కనిపించడం లేదు జానారెడ్డి .
తాజాగా ఉప ఎన్నిక జరగనున్న నేపథ్యంలో రఘువీర్‌కి బీజేపీ ఆహ్వానం పంపినట్లు ప్రచారం జరుగుతోంది. అదే సమయంలో జానారెడ్డికి అటు టీఆర్ఎస్‌లోనూ బంధువులు, ముఖ్యమైన స్నేహితులు ఉన్నారు. మరి టీఆర్ఎస్ ఏం చేస్తుందనేది కూడా తేలాలి. ఇప్పటికే బీజేపీ నేతలు, కొందరు టీఆర్ఎస్ నేతలు రఘువీర్‌తో ఫోన్ లో మాట్లాడినట్లు ప్రచారం జరుగుతోంది. రఘువీర్ నుంచి ఎలాంటి సమాధానం వచ్చిందనేది ఇంకా బయటకు రాలేదు. ఏ మాత్రం అవకాశం ఉన్నా..బీజేపీ అన్నిరకాల మార్గాలను వినియోగించి..కీలక నాయకులను తమవైపు తిప్పుకునే పరిస్థితి కనిపిస్తోంది. ఎందుకంటే… దుబ్బాక గెలుపును చూపెట్టి స్పీడ్ పెంచింది. బీజేపీకి ప్రతి ఎన్నికా ప్రతిష్టాత్మకంగానే తీసుకుంటోంది. దుబ్బాకలో అప్పటికే రఘునందన్ చాలా సార్లు ఓడిపోయి ఉండడం, సానుభూతి ఉండడం, ముందుగానే ప్రచారం ప్రారంభించడం, టీఆర్ఎస్ పై కొంత వ్యతిరేకత ఉండడం కలిసొచ్చాయి. కాని నాగార్జున సాగర్‌లో బీజేపీకి ఆ పరిస్థితి లేదు. వేరే పార్టీ నుంచి వచ్చినవారిని అభ్యర్థిగా నిలబెట్టడం లేదా.. ఆ పార్టీకి చెందిన లీడర్‌ని ఇక్కడికి దిగుమతి చేయడం తప్ప వేరే మార్గం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలోనే బీజేపీ నాగార్జున సాగర్ అసెంబ్లీ పరిధిలో గెలుపు గుర్రాలుగా భావించే వారికి గాలం వేయడం కచ్చితమని చెప్పవచ్చు.
must Read ;- రాష్ట్రంలో బీజేపీ ‘బండి’లాగే సమర్ధుడు సంజయుడే!