ప్రస్తుతం జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రముఖంగా వినిపిస్తున్న మాట, ప్రచారాన్ని మొత్తం కబ్జా చేసేసిన మాట ‘సర్జికల్ స్ట్రైక్స్’! తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఆ మాటను వాడేసిన తర్వాత.. ఇప్పటిదాకా జరుగుతున్న పరిణామాలను గమనిస్తే.. ప్రధానంగా.. ఆ ‘సర్జికల్ స్ట్రైక్స్’ అనే మాట ప్రత్యర్థి శిబిరాలకే ఎక్కువ ఉపయోగపడుతున్నట్లుగా కనిపిస్తోంది. సదరు ‘సర్జికల్ స్ట్రైక్స్’ ఏవో బీజేపీ శిబిరంమీద బండి సంజయ్ స్వయంగా జరిపించినట్లుగా కనిపిస్తోంది. ఈ మాట బ్యాక్ ఫైర్ కావొచ్చునని కూడా అనిపిస్తోంది.
ఏదైనా ఒక మాటను మళ్లీ మళ్లీ వాడుకుంటూ ఎన్నికల్లో లబ్ది పొందడం అనేది చాలా పాతకాలంనుంచి అలవాటులో ఉన్న టెక్నిక్కే. దీన్ని నరేంద్రమోదీ మరింత సమర్థంగా వాడారు. తనను ‘చాయ్ వాలా’ అని ప్రత్యర్థులు విమర్శిస్తే.. ఆ పదాన్ని తన వ్యక్తిత్వానికి ఒక బ్రాండ్ గా ఆయన మార్చుకున్నారు. గత సార్వత్రిక ఎన్నికల సమయంలో.. మోదీ వచ్చి కాంగ్రెస్ పార్టీ మీటింగుల వద్ద చాయ్ అమ్ముకోవాల్సిందే అని మణిశంకర్ అయ్యర్ విమర్శిస్తే.. ఆ మాటను మోడీ ఎంత బాగా వాడుకున్నారో అందరికీ తెలుసు. ఆ మాటకు తర్వాత జరిగిన విడతల్లోని పోలింగ్ లో బీజేపీ బాగా ఎక్కువ సీట్లు సాధించిన సంగతి అందరికీ గుర్తుంటుంది. ప్రత్యర్థులు తనను ఎద్దేవా చేస్తే ఆ మాటలనే బలమైన అస్త్రాలుగా మార్చుకోవడం జరిగింది. ఇప్పుడు తెలంగాణ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో జరుగుతున్నది కూడా అదే.
Must Read: వైసీపీ, బీజేపీ నాయకుల మాటల యుద్ధం.. రగులుతున్న పార్వతీపురం
యథాలాపంగా అన్నారో.. లేదా కావాలని అన్నారో తెలియదు. మహా అయితే ‘సర్జికల్ స్ట్రైక్స్’ అనే పదం బీజేపీ క్రెడిట్ కింద క్లెయిం చేసుకుంటున్నది గనుక.. ఆ పదం వాడితే తమ పార్టీకి లాభం జరుగుతుందని కూడా ఆయన అనుకుని ఉండొచ్చు. జీహెచ్ఎంసీలో బీజేపీని గెలిపిస్తే- పాతబస్తీలో ‘సర్జికల్ స్ట్రైక్స్’ చేస్తాం అని ఆయన అన్నారు. పాత బస్తీలో పాకిస్తానీలు, రోహింగ్యాలు చాలా పెద్ద సంఖ్యలో ఉన్నారని, అలాంటి వారినందరినీ ఏరివేస్తామని ఆయన ప్రకటించారు. రోహింగ్యాలు, పాకిస్తానీలు ఉన్నారాలేదా అనేది చాలా పెద్ద మాట. ఆ సంగతి నిదానంగా తేలుతుంది. అయితే చాలా చాలా దొంగఓట్లు నమోదై ఉంటాయని మాత్రం చాలా మంది అంటుంటారు. ఎన్నికల సమయానికి రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలనుంచి అనేక మంది ముస్లిములు వచ్చి మజ్లిస్ అనుకూలంగా ఓట్లు వేసి తిరిగి వెళ్లిపోతుంటారని కూడా వినిపిస్తూ ఉంటుంది. దొంగ ఓట్లు ఉండడం నిజమే ఏమో గానీ.. వారంతా రోహింగ్యాలు, పాకిస్తానీలు అంటూ అంటగట్టడం జరుగుతోంది.
ఒక రకంగా చూసినప్పుడు బండి సంజయ్- ‘సర్జికల్ స్ట్రైక్స్’ అనే మాట ద్వారా గ్రేటర్ ప్రజలకు ఇచ్చిన హామీ.. ఒక మతిలేని మాటగా కనిపిస్తోంది. ప్రజలు అమాయకులు అనుకుని, వారిని బురిడీ కొట్టించడానికి ఆయన ఆ మాట వాడారే తప్ప.. వారు గెలిచినా కూడా చేసేదేమీ ఉండదు. ఇదంతా కేవలం ఆవేశకావేషాలను రెచ్చగొట్టడానికి, హిందూత్వ ఓటు బ్యాంకును సమీకృతం చేయడానికి మాత్రమే ఉపయోగపడుతుంది.
ఎందుకంటే.. ఒక ప్రాంతంలో రోహింగ్యాలు, పాకిస్తానీలు, అంతకుమించి తీవ్రవాదులు ఉన్నాసరే.. వారిని ఏరివేయడంలో ఆ ప్రాంత మునిసిపల్ కార్పొరేషన్ అధికారాలేమీ ఉండవు. వంద డివిజన్లు గెలుచుకుని బీజేపీ జీహెచ్ఎంసీ పీఠం మీద కూర్చున్నా సరే.. శాంతి భద్రతల పరిస్థితి వారి చేతిల్లో ఉండదు. సర్జికల్ స్ట్రైక్స్ కాదు కదా.. కనీసం పాతబస్తీలో పోలీసులను ఖాతరు చేయకుండా.. హెల్మెట్ లేకుండా, త్రిబుల్స్ రైడింగ్ తో విచ్చలవిడిగా టూవీలర్స్ నడుపుకుంటూ వెళ్లే ఆకతాయి యువకుల్ని కూడా జీహెచ్ఎంసీ ఏమీ చేయడం సాధ్యం కాదు. అక్కడి రేషన్ కార్డుల్లో నకిలీ పేర్లు ఉన్నా కూడా అది జీహెచ్ఎంసీ పరిధిలోది కాదు. అక్కడ డ్రైనీజీ శుభ్రంగా ఉందా, నీళ్లు వస్తున్నాయా లేదా లాంటివి తప్ప.. మరేం చేయడమూ బీజేపీకి చేతకాదు. టెక్నికల్ గా అంతే.
Must Read: బీజేపీ జనసేన మధ్య పొత్తు కుదురుతోంది!
అయితే నిజంగానే పాతబస్తీలో అసాంఘిక శక్తులు ఉండి, నిజంగానే బీజేపీ వారి మీద కఠినంగా వ్యవహరించదలచుకుంటే గనుక.. అందుకు వారు జీహెచ్ఎంసీలో గెలవాల్సిన అవసరం లేదు. మోడీ సర్కారుకు చిత్తశుద్ధి, ధైర్యం ఉంటే ఇప్పుడే ఆ పని చేయవచ్చు. కానీ వారు ఆ పనిచేయరు. కేవలం ఇలా ఎన్నికలు వచ్చినప్పుడు.. పాతబస్తీ మీద కాసింత బురద చల్లి.. దానిద్వారా తాము రాజకీయ లబ్ధి పొందాలని మాత్రమే అనుకుంటూ ఉంటారు. ఈ కోణాలన్నీ ప్రజలు ఆలోచించలేరు అని బీజేపీ భావిస్తే పప్పులో కాలేసినట్టే.
ఇక బండి సంజయ్ ‘సర్జికల్ స్ట్రైక్స్’ను ప్రత్యర్థి పార్టీలు బాగా వాడుకుంటున్నాయి. కేటీఆర్, ఒవైసీ ప్రసంగాలు పూర్తిగా దానికి కౌంటర్ ఇవ్వడంతోనే సరిపోతున్నాయి. మామూలుగా అయితే.. వారు ప్రజల్ని మెప్పించడానికి చాలాచాలా హమీలు కురిపిస్తూ సాగాలి. కానీ.. ఇప్పుడు వారి పని ఈజీ అయిపోయింది. ‘సర్జికల్ స్ట్రైక్స్’ అనే మాట ద్వారా.. తాను ప్రజల్లో ఒక ధైర్యాన్ని కలిగించి లబ్ధి పొందాలని సంజయ్ అనుకుంటే, అదే మాటను వాడుతూ ఆ పదం పట్ల భయాన్ని ప్రజల్లో రేకెత్తించి.. తాము లబ్ది పొందడానికి కేటీఆర్, ఒవైసీ ప్రయత్నిస్తున్నారు. ఆ మాటకొస్తే.. బండి సంజయ్ కంటె ఎక్కువగా వీళ్లే ఆ విషయాల్ని ప్రస్తావిస్తున్నారు.
వాళ్లిద్దరూ ఎంతగా కౌంటర్ ఎటాక్ చేస్తున్నారంటే.. ‘సర్జికల్ స్ట్రైక్స్’ అనే పదం వాడడం ద్వారా.. తప్పు చేశామా అనే అంతర్మధనం బీజేపీ వర్గాల్లో మొదలైంది. చూడబోతే బండి సంజయ్ మాటలు.. బీజేపీ శిబిరం మీదనే ‘సర్జికల్ స్ట్రైక్స్’ గా మారినట్లు కనిపిస్తోంది.
Also Read: పాతబస్తీపై సర్జికల్ స్ట్రైక్: బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు











