జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలు ఉత్కంఠ భరితంగా మారాయి. టీఆర్ఎస్ అధికార పీఠం దిశగా పయనిస్తున్నప్పటికీ ఫలితాలు మాత్రం పంటికింద రాయిలా మారిన పరిస్థితి కనిపిస్తోంది. ప్రముఖులు, వీఐపీలు ఇన్‌ఛార్జిలుగా ఉన్న , ప్రముఖుల కుటుంబీకులు నిలబడిన పలు డివిజన్లలో ఓటమిని ఎదుర్కోవాల్సిన పరిస్థితి తలెత్తింది.
ప్రముఖులకు షాక్..
ఈ ఫలితాలను పరిశీలిస్తే..కేటీఆర్ ఇన్‌ఛార్జిగా ఉన్న శేరిలింగంపల్లి మినహా మిగతా చోట్ల మంత్రులు ఇన్‌ఛార్జిలుగా ఉన్న చాలా చోట్ల బీజేపీ షాక్ ఇచ్చింది. ఇక ఎల్బీనగర్‌లో బీజేపీ దాదాపు క్లీన్ స్వీప్ చేసింది. కేసీఆర్ కుమార్తె, నిజామాబాద్ మాజీ ఎంపీ, ప్రస్తుత ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఇన్‌ఛార్జిగా ఉన్న గాంధీనగర్లో టీఆరెస్ ఓటమి పాలైంది.
- ఇక మంత్రి సబిత ప్రాతినిధ్యం వహిస్తున్న మహేశ్వరం అసెంబ్లీ పరిధిలో ఉన్న జీహెచ్ఎంసీ డివిజన్లు రెండు ఉన్నాయి. ఆ రెండు చోట్లా బీజేపీ విజయం సాధించింది. సబిత ఇన్‌ఛార్జిగా ఉన్న ఆర్కేపురంలోనూ బీజేపీ జయకేతనం ఎగురవేసింది.
- మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఇన్‌ఛార్జిగా ఉన్న అడిక్‌మెట్‌లో టీఆర్ఎస్ ఓటమి చెందింది. ఉప్పల్ ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి సతీమణి స్వప్ప హబ్సిగూడ నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. బీజేపీ అభ్యర్థి చేతన గెలుపొందారు.
- మక్తల్ MLA రామ్మోహన్‌రెడ్డి ఇన్‌ఛార్జిగా ఉన్న రామ్‌నగర్‌లో టీఆరెస్ అభ్యర్థి నాయిని అల్లుడు శ్రీనివాస్ రెడ్డి ఓటమి పాలయ్యారు.
- మంత్రి తలసాని ఇన్‌ఛార్జిగా ఉన్న ముషీరాబాద్‌లోని 3 చోట్ల టీఆర్ఎస్ ఓటమి చెందింది. ముషీరాబాద్ అసెంబ్లీ పరిధిలో 6 డివిజన్లలో ఐదు బీజేపీ గెలవగా ఒకటి టీఆర్ఎస్ గెలిచింది. తలసాని ప్రాతినిధ్యం వహిస్తున్న సనత్‌నగర్ అసెంబ్లీ పరిధిలో ఆరు స్థానాలకు గాను టీఆర్ఎస్ 3 గెలిస్తే బీజేపీ 3 గెలిచాయి. ఇవి తలసానికి డేంజర్ బెల్స్ అని చెప్పాలి. తలసాని కంచుకోట మోండా మర్కెట్లో బీజేపీ అభ్యర్థి దీపిక గెలుపొందారు.
- మరో మంత్రి జగదీశ్వర్‌రెడ్డి ఇన్‌ఛార్జిగా ఉన్న సరూర్‌నగర్‌లో టీఆర్ఎస్ఓటమి
- మాగంటి గోపి ప్రాతినిథ్యం వహిస్తున్న జూబ్లీహిల్స్ అసెంబ్లీ పరిధిలో ఏడు స్థానాలు ఉండగా టీఆర్ఎస్ 4 ఎంఐఎం 2,బీజేపీ 1 సాధించింది.
- సికింద్రాబాద్‌లో ఉప సభాపతి పద్మారావు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఇక్కడ ఐదుచోట్ల టీఆర్ఎస్ గెలిచింది.
- గతంలో మంత్రి కిషన్‌రెడ్డి ఓడిపోయిన అంబర్‌పేట అసెంబ్లీ పరిధిలో మొత్తం 5 డివిజన్లకు టీఆర్ఎస్ 2, బీజేపీ 3 చోట్ల విజయం సాధించింది.
- ఖైరతాబాద్‌లో దానం నాగేందర్ ఎమ్మెల్యేగా ఉన్నారు. గతంలో బీజేపీ నుంచి చింతల రామచంద్రారెడ్డి గెలిచారు. ఇక్కడ మొత్తం 5 డివిజన్లకు గాను 4 చోట్ల టీఆర్ఎస్ , ఒకచోట బీజేపీ గెలిచింది.
- నాంపల్లిలో ఎంఐఎం ఎమ్మెల్యే ఉన్నారు. ఇక్కడ ఆరు డివిజన్లలో ఎంఐఎం క్లీన్ స్వీప్ చేసింది.
- ఇక మల్కాజ్‌గిరి పార్లమెంట్ చూస్తే..రేవంత్‌రెడ్డికి ఎదురుదెబ్బ అని చెప్పవచ్చు.ఇది దేశంలోనే అతి పెద్ద నియోజకవర్గం. మొత్తం 46 డివిజన్లు ఉన్నాయి. మొత్తం మీద టీఆర్ఎస్ 26 చోట్ల, బీజేపీ 18చోట్ల కాంగ్రెస్ రెండు చోట్ల గెలిచింది. గతంలో మల్కాజ్2గిరిలో బీజేపీకి ప్రాతినిథ్యం లేకపోయినా..ఇప్పుడు భారీగా గెలిచింది.
- కుత్బుల్లాపూర్ అసెంబ్లీ పరిధిలో 8 స్థానాలు ఉండగా ఏడు చోట్ల టీఆర్ఎస్, ఒకటి బీజేపీ గెలిచింది. ఇక్కడ కాంగ్రెస్ నేత కూనశ్రీశైలం గౌడ్ తమ్ముడు ఓడిపోయాడు.
- కూకట్‌పల్లి అసెంబ్లీ పరిధిలో 8 కిగాను 7 టీఆర్ఎస్ గెలిచింది. ఒక్కచోట బీజేపీ గెలిచింది. ఎమ్మెల్యే మాధవరం పట్టు నిలుపుకున్నారని చెప్పవచ్చు.
- ఎల్సీనగర్ అసెంబ్లీ పరిధిలో 11 డివిజన్లకు గాను 11 బీజేపీ గెలిచింది. ఇది టీఆర్ఎస్ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డికి భారీ దెబ్బ అని చెప్పవచ్చు.
- శేరిలింగంపల్లి నియోజకవర్గంలో అరికెపూడి గాంధీ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇక్కడ కేటీఆర్ ఇన్‌ఛార్జిగా ఉన్నారు. మొత్తం పది స్థానాలకు గాను 9చోట్ల టీఆర్ఎస్, 1 బీజేపీ గెలిచాయి.
- రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్ ఇలాఖాలో జీహెచ్ఎంసీ పరిధిలో 5 డివిజన్లు ఉండగా బీజేపీ 3, ఎంఐఎం 2 గెలిచాయి. మైలార్ దేవరపల్లిలో ప్రకాశ్‌గౌడ్ తమ్ముడు ప్రేమ్‌దాస్‌గౌడ్ కూడా ఓడిపోయారు.
- హైదరాబాద్ పరిధిలో ఎంఐఎం కీలక భూమిక ఉంది. ఈ పార్లమెంటు పరిధిలో 44 డివిజన్లకు ఎన్నికలు జరిగాయి. ఎంఐఎం 31చోట్ల విజయం సాధించింది. బీజేపీ 11, టీఆర్ఎస్ 1 గెలిచింది. గతంలో బీజేపీ 3 చోట్ల గెలిచింది.
- అక్బరుద్దీన్ ప్రాతినిథ్యం వహిస్తున్న చాంద్రాయణ్‌గుట్టలో 7 స్థానాల్లో ఎంఐఎం గెలిచి క్లీన్ స్వీప్ చేసింది.
- చార్మినార్‌లో 5 స్థానాలకు నాలుగు ఎంఐఎం గెలిస్తే 1 బీజేపీకి వచ్చింది.
- గోషామహల్ అసెంబ్లీ పరిధిలో బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ పట్టు నిలుపుకున్నారు. ఇక్కడ6 డివిజన్లకు గాను ఐదు బీజేపీ , 1 ఎంఐఎం గెలిచాయి.
- కార్వాన్ అసెంబ్లీ పరిధిలో 7 స్థానాలకు గాను 5 ఎంఐఎం, 2బీజేపీ గెలిచాయి.
- Must Read ;- ఆలె నరేంద్ర..బద్దం బాల్ రెడ్డి హైదరాబాద్ బీజేపీ టైగర్స్