చిన్నప్పుడు అఖిల్ ‘సిసింద్రీ’యేగాని హీరోగా మాత్రం ఇంకా వెనకబడే ఉన్నాడు. అందుకే అక్కినేని నాగార్జున బరిలోకి దిగక తప్పడం లేదు. నాగార్జున, అఖిల్ హీరోగా ఓ సినిమాకి తెరలేస్తోంది. అఖిల్ కు స్టార్ డమ్ తీసుకురావాలన్నది నాగ్ యోచన. అందుకే ఈ మల్టీస్టారర్ ప్రాజెక్టుకు డైరెక్టర్ గా మోహన్ రాజాను ఎంపిక చేసుకున్నట్టు సమాచారం. ప్రముఖ నిర్మాత ఎడిటర్ మోహన్ తనయుడైన మోహన్ రాజా తమిళంలో మంచి హిట్లు ఇచ్చారు. తాజాగా తెలుగులో మెగాస్టార్ చిరంజీవి హీరోగా మలయాళ చిత్రం ‘లూసిఫర్’ రీమేక్ కు దర్శకత్వం వహించబోతున్నారు.
ఈ సినిమా పూర్తికాగానే నాగ్ సినిమా సెట్స్ పైకి వెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మోహన్ రాజా కూడా తెలుగు చిత్రాలపైనే ఎక్కువగా దృష్టిపెట్టారు. అసలు మోహన్ రాజా దర్శకుడైంది తెలుగు సినిమాతోనే. ‘హనుమాన్ జంక్షన్’ సినిమాతో ఆయన దర్శకుడిగా పరిచయమయ్యారు. ఆ తర్వాత తమిళంలో మంచి హిట్లు ఇచ్చారు. అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపైనే నాగ్ ఈ సినిమాని రూపొందించనున్నారు. ఈ సినిమాకు ముందు పెద్ద కుమారుడు నాగ చైతన్య కోసం ‘బంగార్రాజు’ తీస్తున్నారు. ఇందులో నాగచైతన్యతోపాటు నాగార్జున కూడా నటిస్తున్నారు. దాని తర్వాత అఖిల్ సినిమా ఉంటుంది.
ఇంకా చెప్పాలంటే ఈ సమయంలో నాగ్ కు కూడా హిట్ అవసరం. ప్రస్తుతం హిట్ల విషయంలో ఆయన వెనకబడి పోతున్నారు. అఖిల్ హీరోగా నటించిన ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్’ ఎంతో కాలంగా ఊరిస్తోంది. ఈ సినిమా విడుదలకు కాలం కలిసి రావడం లేదు. అందుకే అఖిల్ కెరీర్ మీద దృష్టిపెట్టారు నాగార్జున. కొరటాలను కూడా కథ సిద్ధం చేయమని చెప్పినట్టు సమాచారం. అఖిల్ ఖాతాలో హిట్ పడే వరకూ నాగ్ నిద్ర పోయేలా లేరు. కొరటాల సినిమా ప్రారంభానికి ముందే సురేందర్ రెడ్డి దర్శకత్వంలోనూ అఖిల్ ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా టైటిల్ ‘ఏజెంట్’గా ప్రచారంలో ఉంది.
Must Read ;- అఖిల్ ‘ఏజెంట్’ కథపై ఇంకా కసరత్తులు?











