పంచాయతీల్లో సిసలు గెలుపు టీడీపీదే అని అధినేత చంద్రబాబునాయుడు వెల్లడించారు. ఏపీలో అత్యంత ఉత్కంఠభరితంగా సాగిన పంచాయతీ ఎన్నికలు ఎట్టకేలకు ముగిశాయి.
నాలుగు విడతలుగా జరిగిన ఎన్నికల్లో అధికార పార్టీ వైసీపీ తనదైన శైలి దౌర్జన్యాలకు పాల్పడి మెజారిటీ స్థానాలను చేజిక్కించుకుంది. అధికార పార్టీ ఎన్నెన్ని అడ్డంకులు సృష్టించినా… విపక్ష టీడీపీకి చెందిన మద్దతుదారులు ఎదురొడ్డి మరీ తమ ప్రతాపమేంటో చూపించారనే వాదనలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. అధికార పార్టీ దౌర్జన్య కాండలోనూ టీడీపీ మెరుగైన పలితాలనే సాధించిందని చెప్పక తప్పదు. ఎన్నికల్లో భాగంగా పలు ప్రాంతాల్లో వైసీపీ బెదిరింపు రాజకీయాలకు పాల్పడి చాలా స్థానాలను ఏకగ్రీవం చేసుకున్న సంగతి తెలిసిందే. అదే సమయంలో ఎన్నికలు జరిగిన ప్రాంతాల్లోనూ వైసీపీ తనదైన శైలి దౌర్జన్యాలకు పాల్పడిన వైనం కూడా చాలా స్పష్టంగానే కనిపించింది. ఇన్ని దౌర్జన్యాలను తట్టుకుని కూడా టీడీపీ మద్దతుదారులు ఏకంగా 4,230 గ్రామాల్లో విజయకేతనం ఎగురవేశారు. తొలి మూడు దశల్లో కాస్తంత తక్కువ స్థానాలతోనే సరిపెట్టుకున్న టీడీపీ… చివరి విడత అయిన నాలుగో విడతలో మాత్రం తనదైన శైలి సత్తా చాటి ఏకంగా 41.7 శాతం సర్పంచ్ స్థానాలను కైవసం చేసుకుంది.
సక్రమంగా జరిగితే మరో 10 శాతం
వైసీపీ దౌర్జన్యాలు లేకపోయినా… రాష్ట్ర ఎన్నికల సంఘం ఎన్నికలను సక్రమంగా నిర్వహించినా… మరో 10 శాతం సర్పంచ్ స్థానాలను తమ పార్టీ మద్దతుదారులు గెలిచి ఉండేవారని టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు తెలిపారు. ఈ మేరకు పంచాయతీ ఫలితాలపై చంద్రబాబు ఫుల్ క్లారిటీ ఇచ్చారు. ఎన్నికలు జరిగిన తీరుతెన్నులను ప్రస్తావించడంతో పాటుగా ఎన్నికల్లో టీడీపీ మద్దతుదారులకు ఎదురైన అనుభవాలను వివరించిన చంద్రబాబు… పంచాయతీ ఎన్నికల్లో అసలు సిసలు విజేత టీడీపీనేనని ప్రకటించేశారు. ఇదిలా ఉంటే… ఎన్నికల్లో తమ పార్టీ మద్దతుదారులు 80 శాతానికి పైగా గెలుచుకున్నామని వైసీపీ ప్రచారం చేసుకుంటున్న సంగతి తెలిసిందే. టీడీపీ మాత్రం తాము 35 శాతం సీట్లు గెలిచామని చెబుతోంది. పారదర్శకంగా ఎన్నికలు జరిగితే అధికార పార్టీ అడ్రస్ గల్లంతయ్యేదని టీడీపీ నేతలు బల్లగుద్ది మరీ చెబుతుండటం గమనార్హం.
Must Read ;- నారావారిపల్లెలో వైసీపీ ఆగడాలు!
వైసీపీ పతనం ప్రారంభం..
పంచాయతీ ఎన్నికలపై మాట్లాడిన చంద్రబాబు ఏమన్నారంటే… ప్రజలను వేధించే ప్రభుత్వాన్నిఇదివరకెప్పుడూ చూడలేదు. పంచాయతీ ఎన్నికల ఫలితాలతో వైసీపీ పతనం ప్రారంభమైనట్లు తెలుస్తోంది. దీనిని ఎవరూ కాపాడలేరు. వైసీపీ నాయకులు అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు. అరాచకాలు సృష్టించారు. ప్రజాస్వామ్య పరిరక్షణకు టీడీపీ వీరోచితంగా పోరాడింది. 4వ విడతలో 41.7 శాతం సర్పంచ్ స్థానాలు గెలుచుకున్నాం. మొత్తం నాలుగు విడతల్లో కలిపి 4,230 సర్పంచ్ స్థానాలను గెలిచాం. సక్రమంగా జరిగి ఉంటే మరో 10 శాతం స్థానాల్లో విజయం సాధ్యమయ్యేది.అధికార దుర్వినియోగం, ఫలితాల తారుమారుపై వైసీపీ ఆధారపడింది. అధికారాన్ని సక్రమంగా వినియోగించుకోవడంలో ఎస్‌ఈసీ విఫలమైంది. సక్రమంగా నిర్వహించామని ఎన్నికల సంఘం ఎలా చెప్పగలదు అని చంద్రబాబు ప్రశ్నించారు. మొత్తంగా పంచాయతీ ఎన్నికల్లో గెలుపు తమదేనని వైసీపీ ప్రకటించుకున్నా… ఆ పార్టీ అనుసరించిన వైఖరి, సాగించిన దౌర్జన్య కాండలను ప్రస్తావించడంతో పాటుగా టీడీపీకి దక్కిన స్థానాలు, అందుకు దారి తీసిన పరిస్థితులు, టీడీపీ గెలుచుకున్న స్థానాలను చూపిన చంద్రబాబు… అసలు సిసలు గెలుపు టీడీపీదేనని ప్రకటించారు.
డెమోక్రసీకి జగన్ మోనోక్రసీకి మధ్య ఎన్నికలు
ఇక పంచాయతీ ఎన్నికలపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేశ్ కూడా ట్విట్టర్ వేదికగా తనదైన సెటైర్లతో విరుచుకుపడ్డారు. ఈ సందర్భంగా లోకేశ్ ఏమన్నారంటే… ఈ ఎన్నికలు డెమోక్రసీకి జగన్ మోనోక్రసీకి మధ్య జరిగినవి. ఎన్నికల్లో కొంత తేడాతో సంఖ్యాపరంగా విజయం వైసీపీదైనా అసలు సిసలు గెలుపు టీడీపీదే. అంబేద్కర్ రాజ్యాంగం ప్రకారం జరగాల్సిన ఎన్నికలను వైఎస్ జగన్ తన రాజారెడ్డి రాజ్యాంగంతో అడ్డుకున్నారు. మనదేశానికి అర్ధరాత్రి స్వాతంత్య్రం వస్తే, నాలుగు విడతల పంచాయతీ ఎన్నికల్లో అర్థరాత్రి జగన్‌రెడ్డి ఫ్యాక్షన్ పాలిటిక్స్‌కి స్వాతంత్య్రం వచ్చింది. టీడీపీ మద్దతుతో పోటీ చేసే అభ్యర్థుల్ని చంపేశారు, నామినేషన్ వేయకుండా కిడ్నాప్ చేశారు. బెదిరించారు, భయపెట్టారు. కట్టేసి కొట్టారు. అయినా వెనక్కితగ్గని టీడీపీ అభ్యర్థులు లెక్కింపులో ముందంజలో వుంటే.. కరెంట్ నిలిపేశారు. కౌంటింగ్ కేంద్రాలకు తాళాలేసారు. పోలీసులతో బెదిరించారు. దాడులు చేశారు. టీడీపీ మద్దతుదారులు గెలిచిన చోట్ల రీకౌంటింగ్ పేరుతో వైసీపీ గెలుపు ప్రకటించుకున్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలోనే ఎన్నడూ లేని విధంగా జగన్‌రెడ్డి అరాచకాలకు పాల్పడినా ధైర్యంగా ఎదురొడ్డి నిలిచి గెలిచిన టిడిపి కార్యకర్తలు, నేతలు, అభిమానులందరికీ శిరసు వంచి నమస్కరిస్తున్నాను. ప్రజాస్వామ్యాన్ని రక్షించిన ప్రజలందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు’’ అంటూ లోకేశ్ ట్వీట్ చేశారు.
Also Read ;- పల్నాడులో వైసీపీ నేతల అరాచకం, కిడ్నాపులు, బెదిరింపులు