మెగాస్టార్ చిరంజీవి సర్జరీ చేయించుకోవాల్సి వచ్చిందట. మళ్లీ ఎప్పట్నుంచి షూటింగ్ లో పాల్గొంటారన్నది తెలియాల్సి ఉంది. బ్లాక్ బస్టర్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్లో రూపొందుతోన్న ఆచార్య షూటింగ్ ను మాత్రం పూర్తిచేశారు. ఈ సినిమా విడుదలకు రెడీగా ఉంది. ఫిబ్రవరిలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. అయితే.. ఆచార్య సెట్స్ పై ఉండగానే.. చిరంజీవి గాడ్ ఫాదర్ మూవీ షూటింగ్ స్టార్ట్ చేశారు. ఇది మలయాళంలో విజయం సాధించిన లూసీఫర్ మూవీకి రీమేక్.
ఈ చిత్రానికి మోహన్ రాజా దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ ఆమధ్య హైదరాబాద్లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో ప్రారంభించారు. చిరంజీవి పై కీలక సన్నివేశాలు చిత్రీకరించారు. ఆ తర్వాత ఊటీలో యాక్షన్ సీన్స్ షూట్ చేశారు. ఊటీలో షూటింగ్ జరుగుతున్న టైమ్ లోనే చిరంజీవి చేతికి సర్జరీ చేయించుకోవాల్సి వచ్చింది. దీంతో కొన్ని రోజులు విశ్రాంతి అవసరమని డాక్టర్లు సూచించారు. గత కొన్ని రోజులుగా రెస్ట్ తీసుకున్న చిరు ఇప్పుడు షూటింగ్ కి ఓకే చెప్పారట.
పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందుతోన్న ఈ సినిమా కొత్త షెడ్యూల్ ను సోమవారం నుంచి ప్రారంభించనున్నారని తెలిసింది. ఈ షెడ్యూల్‌లో భాగంగా చిరంజీవితో పాటు ఇతర ముఖ్య తారాగణం పై కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నట్టుగా చిత్రయూనిట్ తెలియచేశారు. ఈ చిత్రానికి సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నారు. ఇదిలా ఉంటే.. చిరంజీవి మెహర్ రమేష్ డైరెక్షన్ లో భోళా శంకర్ మూవీ చేయనున్నారు.
అలాగే బాబీ డైరెక్షన్ లో వాల్తేరు వీరయ్య అనే సినిమా చేయనున్నారు. ఈ రెండు సినిమాల షూటింగ్స్ ను ఈ నెలలోనే స్టార్ట్ చేయడానికి ప్లాన్ చేశారు. దీంతో గాడ్ ఫాదర్ షూటింగ్ ఎప్పటికి పూర్తవుతుంది.? గాడ్ ఫాదర్ ఎప్పుడు ప్రేక్షకుల ముందుకు వస్తాడు అనేది ఆసక్తిగా మారింది. అయితే… ఆచార్య ఫిబ్రవరిలో వస్తుంది. ఆ తర్వాత ఆగష్టులో చిరు పుట్టినరోజు కానుకగా గాడ్ ఫాదర్ రిలీజ్ చేయాలి అనుకుంటున్నారని టాక్ వినిపిస్తోంది. ఏది ఏమైనా.. గాడ్ ఫాదర్ రిలీజ్ పై క్లారిటీ రావాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.
Must Read ;- ఓటీటీ భారీ అఫర్ తిరస్కరించిన చిరంజీవి?











