(విజయనగరం నుండి లియో న్యూస్ ప్రతినిధి)
పౌరుషాలకు ప్రతీకగా, చారిత్రక ప్రసిద్ధి గాంచిన బొబ్బిలి రాజులు వైసీపీ గూటిలో అడుగుపెట్టేందుకు మరోమారు సిద్ధం అవుతున్నట్లు ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. విజయనగరం జిల్లా బొబ్బిలికి చెందిన మాజీమంత్రి సుజయ్ కృష్ణ రంగారావు, ఆయన తమ్ముడు బేబీనాయన వైసీపీలో చేరేందుకు ముహూర్తం నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
ఎప్పుడు ఏదైనా ..
రాజకీయాల్లో ఎప్పుడైనా, ఏదైనా జరగొచ్చు. ఏ క్షణాన అనుకుంటే ఆ క్షణాన కండువా మార్చుకోవచ్చు. ప్రస్తుత రాష్ట్ర రాజకీయాల్లో అదే జరుగుతోంది. అందులో భాగంగా తెలుగుదేశం పార్టీలో మంత్రిగా భోగభాగ్యాలు అనుభవించిన సుజయ్ ఇప్పుడు వైసీపీ గూటికి చేరేందుకు సిద్ధమయ్యారని గుసగుసలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్‌లో రాజకీయాలు ప్రారంభించిన సుజయ ఆ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా వరుస విజయాలు సాధించారు. తర్వాత వైఎస్‌పై ఉన్న అభిమానంతో ఆయన జగన్‌కు మద్దతు దారుగా మారారు. ఈ క్రమంలోనే వైసీపీ నుండి 2014లో ఎమ్మెల్యే గా విజయం సాధించారు. అప్పట్లో వైసీపీ అధికారంలోకి రాకపోవడంతో ఆయన టీడీపీలో చేరారు.
వైసీపీని వీడడం వెనుక ..
బొబ్బిలి రాజులు గతంలో వైసీపీని వీడడం వెనుక చాలా కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా తమకు చిరకాల రాజకీయ శత్రువుగా ఉన్న బొత్స సత్యనారాయణను తమకు ఇష్టం లేకపోయినా జగన్ పార్టీలో చేర్చుకోవడం వల్ల వారు వైసీపీని వీడుతున్నట్లు అప్పట్లో ప్రచారం జరిగింది. టీడీపీ అధినేత.. అప్పటి సీఎం చంద్రబాబు సుజయ్‌కు మంత్రి పదవి ఇస్తానని హామీ ఇవ్వడంతో పార్టీ మారినట్లు తెలిసింది. అనుకున్న విధంగానే చంద్రబాబు ఆయనకు మంత్రి పదవి ఇచ్చారు.
Also Read ;- ఫిబ్రవరి ఎన్నికలకు జగన్ దళానికి భయమెందుకు?
మంత్రి పదవి పొందినా ..
సుజయ్ మంత్రి పదవి పొందినా ప్రజలు ఆయనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకోలేక పోయారనే విమర్శలు వినిపిస్తున్నాయి. పార్టీ మారి, మంత్రి పదవి పొందిన సుజయ్ ప్రజలు ఆశించిన విధంగా వ్యవహరించలేదనే ఆరోపణలు వెల్లువెత్తాయి. అందువల్ల 2019 ఎన్నికల్లో మరోమారు టీడీపీ తరపున పోటీ చేసినా ఆయన విజయం సాధించలేక పోయారు. ఆ తర్వాత పార్టీలోనూ ఆశించిన స్థాయిలో గుర్తింపు పొందలేక పోయారు. టీడీపీ అధిష్టానం కూడా సుజయ్ కంటే ఆయన తమ్ముడు బేబీనాయనకు ప్రాధాన్యత ఇస్తూ బొబ్బిలి అసెంబ్లీ నియోజకవర్గం ఇన్‌ఛార్జిగా నియమించింది. దాంతో టీడీపీలోనూ ఆయనకు ప్రాధాన్యం తగ్గిపోయింది. అప్పటి నుంచి సుజయ్ పార్టీ కార్యక్రమాల్లోనూ, నియోజకవర్గంలోనూ కనపడటం లేదు. టీడీపీలో ఇటీవల చేపట్టిన సంస్థాగత నియామకాల్లో సుజయ్‌ను రాష్ట్ర ఉపాధ్యక్షునిగా నియమించినప్పటికీ పెద్దగా స్పందించలేదు. ఈ క్రమంలోనే సుజయ కృష్ణ రంగారావు పార్టీ మారేందుకు రెడీ అయ్యారన్న టాక్ జిల్లాలో బలంగా వినిపిస్తోంది. అయితే వైసీపీ ముఖ్యంగా జగన్ దృష్టంతా సుజయ కంటే బేబీ నాయన వైపే ఉందని విశ్వసనీయ సమాచారం.
ఈ నేపథ్యంలో బొబ్బిలి రాజులు ఇద్దరూ పార్టీ మారేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలుస్తోంది. భవిష్యత్ రాజకీయాలు ఎలా ఉంటాయో వేచి చూడాలి.
Must Read ;- జగన్ అక్రమాస్తుల కేసులో కూడా అడిగిందే జరిగింది..











