చాపకింద నీరులా కరోనా విస్తరిస్తోంది. రోజురోజుకూ పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో చాలామంది టీకా తీసుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు. అయితే వాక్సిన్ తీసుకునే ముందు, ఆ తర్వాత ఏం చేయాలనే విషయాలు కచ్చితంగా తెలుసుకోవాలి.
అలర్జీ ఉందా..
వ్యాక్సిన్ తీసుకునే వ్యక్తికి అలర్జీలు ఉంటే, వైద్య నిపుణుడిని సంప్రదించి, సలహా తీసుకోవడం ముఖ్యం. వైద్య సలహా ప్రకారం పూర్తి రక్త గణన, సి-రియాక్టివ్ ప్రోటీన్, ఇమ్యునోగ్లోబులిన్-ఇ (ఐజిఇ) స్థాయిలను టెస్టులు చేసిన తర్వాత, వైద్యులు ఓకే చెప్తే వ్యాక్సిన్ తీసుకోవచ్చు. టీకాలు వేయడానికి ముందు, వారి ఆరోగ్య పరిస్థితిని బట్టి కొందరికి బాగా తినాలి. మందులు తీసుకోవాలని సూచించినట్లు అయితే అలా చేయటం మంచిది.
ఆ సమస్యలు నియంత్రణలో ఉంటేనే…
వ్యాక్సిన్ తీసుకునేవాళ్లు వీలైనంత వరకు ప్రశాంతంగా ఉండాలి. ముఖ్యంగా డయాబెటిస్, రక్తపోటు అదుపులో ఉంటే వ్యాక్సిన్ తీసుకోవాలి. క్యాన్సర్ రోగులు, ముఖ్యంగా కెమోథెరపీ ఉన్నవారు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. బ్లడ్ ప్లాస్మా, మోనోక్లోనల్ యాంటీబాడీస్ పొందిన వ్యక్తులు ప్రస్తుతం వ్యాక్సిన్ తీసుకోకూడదని డాక్టర్లు అంటున్నారు.

వ్యాక్సిన్ తర్వాత
ఇంజెక్షన్ చేసిన ప్రాంతంలో నొప్పి, జ్వరం వంటి దుష్ప్రభావాలు సాధారణం. దీనికి భయపడాల్సిన అవసరం లేదని నిపుణులు అంటున్నారు. చలి, అలసట వంటి కొన్ని ఇతర దుష్ప్రభావాలు కూడా కలగవచ్చని, అయితే ఇవి కొద్ది రోజుల్లోనే పోతాయని చెప్తున్నారు. అయితే టీకా తీసుకున్న వెంటనే, కరోనా వైరస్ నుంచి ముప్పును నిరోధించలేవు. శరీరాన్ని రక్షించడానికి , రోగనిరోధక శక్తిని పెంపొందించడానికి తీసుకున్నవ్యాక్సిన్ పని చేయడానికి కొన్ని వారాలు పడుతుంది. కాబట్టి అప్పటి వరకు కరోనా జాగ్రత్తలు పాటించాల్సిందేనని వైద్యులు చెబుతున్నారు. టీకాలు వేసిన తర్వాత కూడా కరోనా వైరస్ సంక్రమించే అవకాశం ఉందని తెలుస్తుంది. కాబట్టి వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కూడా సామాజిక దూరాన్ని పాటించడం, మాస్కులు ధరించడం, చేతులు పరిశుభ్రంగా ఉంచుకోవడం వంటి రక్షణ చర్యలను మానుకోకూడదని డాక్టర్లు సూచిస్తున్నారు. కరోనా టీకాలు 8 నుంచి 10 నెలల పాటు వైరస్ నుంచి రక్షణ కల్పిస్తాయి. టీకా తీసుకున్నం కదా.. అని నిర్లక్ష్యంగా ఉండకూడదు. కొంతకాలం అత్యవసరం కానీ ప్రయాణాలను తగ్గించుకోవాలి.
Must Read ;- కరోనా వస్తే ఏం తినాలి?











