గ్రేటర్ ఎన్నికల పోరు రసవత్తరంగా సాగుతోంది. అధికార, విపక్ష పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఆరోపణలు, ప్రత్యారోపణల మధ్య ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. హైదరాబాద్ అభివృద్ధిపై ప్రధాన పార్టీలన్నీ అధికార పార్టీపై విరుచుకుపడుతున్నాయి. ఎన్నికల ప్రక్రియలో మొదటి ఘట్టం నామినేషన్ల ప్రక్రియ. నామినేషన్ల స్వీకరణకు గడువు ఇప్పటికే ముగిసింది. అలాగే నామినేషన్ల ఉపసంవహరణకు ఆదివారం చివరి రోజు కావడంతో రెబల్ క్యాండెట్లను బుజ్జగించి నామినేషన్లను ఉపసంహరించుకునేలా ఆయా పార్టీలు విశ్వ ప్రయత్నాలు చేశాయి.
నామినేషన్ల ఉపసంహరణ అనంతరం గ్రేటర్ హైదరాబాద్‌లోని 150 డివిజన్లలో 1121 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. మొత్తం 1893 మంది అభ్యర్థులు వివిధ రాజకీయ పార్టీల నేతలు 2575కు పైగా నామినేషన్ల దాఖలు చేశారు. నామినేషన్ల తిరస్కరణ, ఉపసంహరణ అనంతరం మొత్తంగా ఎంతమంది అభ్యర్థులు బరిలో నిలిచారనే వివరాలు ఆదివారం అర్ధరాత్రి దాటాక వెల్లడయ్యాయి.
జీహెచ్ఎంసీ పరిధిలోని 150 డివిజన్లు ఉన్నాయి. టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ పార్టీలు అన్ని డివిజన్లలో తమ అభ్యర్థులను పోటీలో ఉంచారు. ఎంఐఎం పాతబస్తీలో మాత్రమే పోటీ చేస్తుంది. అలాగే టీడీపీ, టీజెఎస్, సిపిఐ, సిపిఐ(ఎం), ఇతర పొలిటికల్ పార్టీలు తమ పార్టీకి పట్టున్న డివిజన్లలో మాత్రమే అభ్యర్థులను బరిలోకి దింపారు. చిన్నాచితక పార్టీలు, ఇండిపెండెంట్‌లు 500 మంది వరకు జీహెచ్ఎంసీ ఎన్నికల పోటీలో ఉన్నారు.
ఇదిలా ఉంటే ఓట్ల కోసం బస్తీ బాట పడుతున్న టీఆర్ఎస్ పార్టీ నేతలకు అక్కడి స్థానిక ప్రజల నుంచి చేదు అనుభవం ఎదురవుతోంది. మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లాలో టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావును జవహర్‌నగర్ ప్రజలు రోడ్ల నిర్మాణం విషయంలో నిలదీశారు. రోడ్డు వేస్తేనే ఓటు అడగాలని తెలిపారు. నో రోడ్.. నో ఓట్ అంటూ ఫ్లకార్డులు పట్టుకుని నిరసన ర్యాలీ చేపట్టారు. దీంతో దిగొచ్చిన ఎమ్మెల్యే తన లెటర్ ప్యాడ్‌పై సంతకం చేసి హామీ ఇవ్వడంతో ప్రజలు వెనక్కు తగ్గిన పరిస్థితి నెలకొంది. ఇలాంటి చేదు అనుభవాలు చాలానే అధికార పార్టీ నేతలకు ప్రజల నుంచి ఎదురవుతున్నాయి.
Must Read ;- గ్రేటర్ ఎన్నికల ప్రచారానికి బాలయ్య, లోకేష్!