రాష్ట్రంలో సీపీస్ రద్దు పై పోరాటాలు ఉదృతం అవనున్నట్లుగానే కనిపిస్తోంది. 2019 ఎన్నికల సమయంలో తాను అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లోనే సీపీఎస్ రద్దు చేస్తానని చెప్పిన జగన్, నేటికీ మూడేళ్లు అవుతున్నా ఆ అంశం పై కనీసం ఆలోచన చేయడం లేదనే అభిప్రాయాలు సీపీఎస్ ఉద్యోగుల నుంచి వ్యక్తమవుతోంది. దీంతో తాడో పేడో తేల్చుకునేందుకు సీపీఎస్ ఉద్యోగులు సిద్ధమవుతున్నారు. ఏప్రిల్ 3న ఏలూరులో ఆత్మగౌరవ సభ ద్వారా ప్రభుత్వం పై ఒత్తిడి తెచ్చేందుకు సర్వం సిద్ధం చేసుకుంటున్నారు.
జగన్ ప్రతిపక్ష నాయకుడిగా తన పాదయాత్రలో తాను అధికారంలోకి వచ్చిన వారంలో సీపీఎస్ రద్దుచేస్తానని హామీ ఇచ్చారు.ఇప్పటికీ హామీ ఇచ్చి దాదాపు మూడేళ్లు అవుతున్న ప్రభుత్వం నుంచి స్పందన లేదు. మరోవైపు ఈ దశలో సీపీఎస్ రద్దు ‘అదంత ఈజీ కాదు’ అంటూ ప్రభుత్వం ప్రకటించడంపై సీపీఎస్ ఉద్యోగులు విస్మయపోయే పరిస్థితి నెలకొంది.అదే సమయంలో ఉద్యోగుల నుంచి వ్యతిరేకత వస్తుండడంతో సీపీఎస్ రద్దు పై కమిటీ వేసి చర్చిస్తాం అని సీఎం జగన్ చేసిన వ్యాఖ్యాలుపై రాష్ట్రంలోని సీపీఎస్ ఉద్యోగులు మండిపడుతున్నారు.
ఈ క్రమంలోనే వారు ప్రభుత్వం ఎదుట తమ డిమాండ్ లను పెడుతున్నారు. తమకు సీపీఎస్ ను రద్దు చేయడం తప్ప ఈ అంశంలో చర్చించడానికి ఏముందని ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. వారం అంటే అందరికీ ఏడు రోజులేనని.. జగన్ ప్రభుత్వానికి మాత్రం వారం అంటే ఎన్ని రోజులు.. ఎన్ని నెలలు.. ఎన్ని సంవత్సరాలో తెలియడంలేదని ఎద్దేవా చేస్తున్నారు.
ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా రెండు లక్షలమంది సీపీఎస్ ఉద్యోగులు ఉన్నారు. కాగా వీరికి జగన్ ప్రభుత్వం రోజుకో సినిమా చూపిస్తూ సీపీఎస్ రద్దుపై పిల్లి మొగ్గలు వేస్తూనే ఉంది. కేంద్ర ప్రభుత్వం 2004కి ముందు ఎంపికై సాంకేతిక కారణాలతో ఉద్యోగంలో జాయిన్ అవ్వని వారికి పాతపెన్షన్ విధానం అమలు చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రాలనూ ఈమేరకు ఆదేశించింది. మన రాష్ట్రంలో 2003 డీఎస్సీ ఉపాధ్యాయులు, పోలీసులు సాంకేతిక కారణాల వల్ల 2005లో ఎంపికై ఉద్యోగాల్లో చేరారు. కేంద్ర నిబంధనల ప్రకారం వీరందరికీ పాతపెన్షన్ విధానం అమలు చేయాలి. అది ఇప్పటికీ అమలులోకి రాలేదు.
ఇదిలా ఉంటే ఇటీవల శాసనమండలిలో సీపీఎస్ పై సభ్యులు అడిగిన ప్రశ్నకు 2003 డీఎస్సీ ఉపాధ్యాయులకు ఓపీఎస్ వర్తించదని, 2004 సెప్టెంబరుకి ముందు నియామకం అయిన వారికే వర్తిస్తుందని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ సమాధానమిచ్చారు.అదే సమయంలో సీపీఎస్ అంశంపై మండలి సభ్యులు ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డిని ప్రశ్నించగా.. సీపీఎస్ రద్దు అంశం అంత సులభతరం కాదని, దాని చుట్టూ బుగ్గన ఓ అందమైన డ్రామా అల్లారు.
మరోవైపు సీపీఎస్ పై సీఎం జగన్ సచివాలయంలో మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, ఆర్థికశాఖాధికారులతో సీపీఎస్ పై నిర్వహించిన సమావేశంలో మంత్రుల బృందం, అధికారులు కలిసి సీపీఎస్ ఉద్యోగ సంఘాలకు ప్రజెంటేషన్ ఇవ్వాలని.. ఆ తర్వాత చర్చలు జరపాలని,ఏప్రిల్ 4 నుంచి ఈ ప్రక్రియ ప్రారంభం కావాలని ఆదేశించారు. అయితే ముఖ్యమంత్రి, మంత్రులు చేసిన ప్రకటనలను దాటవేతగానే ఉన్నాయని సీపీఎస్ ఉద్యోగులు ధ్వజమెత్తుతున్నారు.
సీపీఎస్ పై ఇవేవీ తెలియకుండానే జగన్ హామీ ఇచ్చారా అని ప్రశ్నించారు? ఎన్నికల ముందు ఓట్ల కోసమే ఇలా చెప్పారా అంటూ నిలదీస్తున్నారు ?తమకు సీపీఎస్ రద్దు చేసి.. ఓల్డ్‌పెన్షన్ స్కీం(ఓపీఎస్)ని అమలు చేయాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు.
అదేసమయంలో తమ మ్యానిఫెస్టోలో పెట్టిన హామీని అమలు చేయడానికి జగన్ ప్రభుత్వం ఉద్యోగ సంఘాలతో చర్చించాల్సిన అవసరం ఏముందని..తాము సీపీఎస్ రద్దు తప్ప ఏ ప్రత్యామ్నాయానికీ అంగీకరించేదిలేదని తేల్చి చెబుతున్నారు.ఈ నేపధ్యంలోనే రాజస్థాన్‌లో హామీ ఇవ్వకుండానే అక్కడి ప్రభుత్వం సీపీఎస్ రద్దు చేసిందనే అంశాన్ని ప్రభుత్వం ఎదుట పెట్టారు సీపీఎస్ ఉద్యోగులు.ఆ రాష్ట్రంలో ఏప్రిల్ ఒకటి నుంచి కాంట్రిబ్యూషన్ తీసేసి పీఎఫ్ ఖాతాలను తీయనున్నా సంగతిని ప్రభుత్వానికి తెలియజేస్తున్నారు.అసలు హామీనే ఇవ్వని చోటే ప్రభుత్వాలు అమలు చేస్తుంటే హామీ ఇచ్చిన జగన్ ప్రభుత్వం ఏపీలో సీపీఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని ఎందుకు అమలు చేయదని ప్రశ్నిస్తున్నారు?
ఇప్పటికే సీపీఎస్ ఉద్యోగ సంఘాలను ప్రభుత్వం చర్చలకు ఆహ్వానించింది. అయితే ప్రభుత్వం తో చర్చ అనే మాట వినబడితేనే ఉద్యోగులు బెంబేలెత్తిపోతున్నారు. ముఖ్యంగా పీఆర్సీ అంశంలో ప్రభుత్వం చేసిన డ్రామా గుర్తుకు వస్తోందని వారంతా వాపోతున్నారు. ఇలాగే చర్చలు.. కమిటీలు సమావేశాలు అంటూ సాగదీసి చివరికి ఐఆర్ కన్నా ఫిట్‌మెంట్ తక్కువ ఇచ్చిన విషయాన్ని సీపీఎస్ ఉద్యోగులు గుర్తు చేసుకుంటున్నారు. ఇప్పుడు తమ విషయంలో కూడా చర్చల పేరుతో అదేవిధంగా అర్ధరాత్రులు దాకా కాలక్షేపంచేసి… ఏదో ఒక రోజు సీపీఎస్ రద్దు చేయడం కుదరదు అని తేల్చేస్తారేమోనని అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలో సీపీఎస్ ఉద్యోగులు మరో ఉద్యమానికి సిద్ధమవుతున్నారు. ఏప్రిల్ 3వ తేదీన ఏలూరులో ఆంధ్రప్రదేశ్ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం ఉద్యోగుల సంఘం(ఏపీసీపీఎ్‌సయూఎస్) ఆధ్వర్యంలో ఆత్మగౌరవ సభ, ర్యాలీ నిర్వహించనున్నారు. జగన్ ప్రభుత్వం ఇచ్చిన హామీ అమలు చేసేందుకు ముందుకు రాకుంటే తమ పోరాటాన్ని ఉదృతం చేస్తామని హెచ్చరికలు జారీ చేస్తున్నారు.
Must Read:-జగన్‌ను గద్దెదింపి తీరుతాం..! – స్వామి పరిపూర్ణానంద