‘‘నాకు కులం అంటగడతారా..? నాకు మతం అంటగడతారా..? నేను విశ్వమానవుడిని- ఇలాంటివేవీ నాకు అంటవు..’’ ఇలాంటి మాటలు పవన్ కల్యాణ్ నోట చాలా తరచుగా వినవస్తూ ఉంటాయి. పవన్ కల్యాణ్ పార్టీ.. కాపుల పార్టీగా ఎదగడానికి ప్రయత్నిస్తున్నదనే విమర్శ ఎటువైపునుంచి వినిపించినా.. ఆయన చాలా గట్టిగా తన కుల వ్యతిరేక స్వరాన్ని వినిపిస్తూ ఉంటారు. అయితే పవన్ కల్యాణ్ కు ఎంత క్లారిటీ వచ్చిందో ఏమో తెలియదు గానీ.. తాజాగా.. కాపుస్వరం అందుకున్నారు.
కాపులు శాసించే స్థితికి రావాలని ఆయన అభిలషిస్తున్నారు, దశాబ్దాలుగా కాపు కులాన్ని విభజించి పాలిస్తున్నారంటూ.. పాపం, ఆ కులం వారిపై సానుభూతి కురిపిస్తున్నారు. కాపులు బలపడకూడదనే తూర్పు కాపు.. మున్నూరు కాపు అని విడదీశారంటూ, కాపుల మధ్య తగాదాలుపెట్టారంటూ
కులాల మధ్య వైషమ్యాలకు పవన్ కల్యాణ్ తనదైన కొత్త భాష్యం చెబుతున్నారు. కాపు కులాన్ని ఓటు బ్యాంకుగానే చూస్తున్నారని, ఈ కులం రాజకీయ సాధికారత సాధించడం అవసరం ఎంతైనా ఉన్నదని పవన్ నొక్కి వక్కాణిస్తున్నారు. అధికారం ఎవరూ పిలిచి ఇవ్వరని.. చేజిక్కించుకోవాలని ఆయన కాపు నాయకులకు మార్గనిర్దేశనం చేస్తున్నారు.
Must Read ;- ఢిల్లీ టవర్ టు పవన్ కల్యాణ్ : సిగ్నల్స్ చాలా స్ట్రాంగ్!
ఒకవైపు కాపుకుల రాజకీయ సాధికారత కోసం ఇన్ని మాటలు అంటూనే.. తనకు కులం అనేది అంటనే అంటదని పవన్ కల్యాణ్ తన సహజశైలి డైలాగులు కూడా వల్లించడం విశేషం. కాపు నాయకులతో పెట్టుకున్న సమావేశాన్ని ఆయన చక్కగా సమర్థించుకున్నారు. ‘ప్రతి కులంవారు తమ సమస్యలు నాకు తెలియచేస్తారు… అలాంటిది నేను పుట్టిన కులంవారు తమ సమస్యలు నాకు చెపితే తప్పేముంది?’ అంటూ పవన్ కల్యాణ్ చెప్పిన తాత్పర్యాన్ని ఎవ్వరూ కాదనలేరు. తనకు కులం అంటగట్టేస్తారనే భయం లేదని, కులానికి… మతానికీ అతీతంగా తాను అందరివాణ్నని మారో మారు రిపీట్ చేయడం విశేషం.
అయితే అలా చేయలేదేం పవన్
అన్ని కులాల వారు తనకు సమస్యలు చెప్పుకుంటారని పవన్ కల్యాణ్ వ్యక్తీకరించడం బాగుంది. కానీ.. ఇప్పటిదాకా జనసేన ప్రస్థానంలో గమనిస్తే అనేకానేక సందర్భాల్లో అంశాలవారీగా సమస్యలను బట్టి.. ఆయా ప్రాంతాల వారు రావడమూ, ఆయనకు విన్నవించుకోవడమూ జరుగుతూ ఉన్నదే తప్ప.. కులాల వారీగా పవన్ కల్యాణ్ పెట్టిన సమవేశాలు తక్కువ. కులానికి ఒక సమావేశం పెట్టి.. ప్రతి కుల సమావేశంలోనూ రాజకీయ అధికారం మీకు ఎవ్వరూ ఇవ్వరు.. మీరే లాక్కోవాలి అంటూ మార్గ నిర్దేశనం చేసిన సందర్భాలు కూడా చాలా చాలా తక్కువ. కానీ.. కాపు నాయకులతో మాత్రం ప్రత్యేకంగా ఈ మీటింగు పెట్టుకోవడం ఏంటనే చర్చ రాజకీయంగా నడుస్తోంది.
పవన్‌కు క్లారిటీ వచ్చిందా?
నేను విశ్వమానవుడిని అని చెప్పుకుంటూనే పవన్ కల్యాణ్ ఇన్నాళ్లూ రాజకీయం చేశారు. ఇండైరక్టుగా ఆయన కాపు ఓటు బ్యాంకు మీదనే కాన్సంట్రేట్ చేశారు గానీ.. పైకి మాత్రం తనకు అన్ని కులాలు సమనం అని ప్రకటించారు. కాపులు తనను ఎటూ సొంతంగా భావిస్తారని, మిగిలిన కులాల ఓట్లు కొల్లగొట్టాలని పథకరచన చేశారు. ఇలాంటి వ్యూహాలు 2019 ఎన్నికల్లో చాలా దారుణంగా బెడిసికొట్టాయి.
పవన్ కల్యాణ్ స్వయంగా తాను పోటీచేయడానికి రెండు నియోజకవర్గాలను ఎంచుకున్నారు. ఈ రోజుల్లో ఏ నాయకుడు కూడా విజయం మీది అపనమ్మకంతో రెండు ప్రాంతాల్లో పోటీకి దిగడం అనేది జరగడం లేదు. ఆయన ఎంచుకున్న రెండూ.. సంఖ్యాపరంగా కాపుల ప్రాబల్యం బీభత్సంగా ఉన్న నియోజకవర్గాలు కావడం విశేషం. అలా రెండు చోట్ల పోటీకి దిగుతూ.. పవన్ చెప్పిన మాటలు కూడా ఓసారి గుర్తు చేసుకోవాలి. ఆ రెండు చోట్ల విజయావకాశాలు బాగున్నాయని.. పార్టీ సర్వేల్లో తేలిందని.. అందువల్ల ఆ రెండుచోట్లా బరిలోకి దిగుతున్నానని అన్నారు. నిజానికి ఆ మాటలు పవన్ కల్యాణ్ దౌర్బల్యానికి నిదర్శనం. చాలా సీట్లు వెతుకులాడి గెలవగలం అని తేల్చిన రెండు సీట్లలో అధినేత బరిలోకి దిగడం అంటే.. మిగిలిన చోట్ల పరాజయ భయం ఎంత ఉందో అర్థమవుతుంది. అలా కాపు ఓటు బ్యాంకున్న సీట్లు వెతుక్కుని కూడా రెండు చోట్లా ఆయన ఓడిపోయారు.!
ఆ దెబ్బకు పవన్ కల్యాణ్ కు తాను విశ్వమానవుడినని, కులాలు తనకు లేవని చెప్పడం వల్ల ఉపయోగం లేదనే క్లారిటీ వచ్చిందని విశ్లేషకులు భావిస్తున్నారు. అందుకే ఇప్పుడు.. కాపుకుల సమావేశాలు పెట్టుకుని.. అధికారం దిశగా కాపులు పయనించాలని ప్రేరణ అందిస్తున్నారనే వాదన కూడా వస్తోంది. పవన్ కల్యాణ్ ఇలా బహిరంగంగా తన పార్టీకి, తన రాజకీయ ప్రస్థానానికి కాపు ముద్ర వేసుకుంటే గనుక.. ఇక రాష్ట్రంలో మూడు ప్రధాన కులాల పోరాటంగా ప్రతి రాజకీయ సమరమూ రూపుదాల్చే అవకాశం ఉంది. పరిణామాలు ఎలా ఉంటాయోచూడాలి.
Also Read ;- పవన్ సూచన మేరకే ‘చిరు’ సీక్రెట్ బయటపెట్టిన నాదెండ్ల