చిరంజీవి మరలా రాజకీయాల్లోకి రాబోతున్నారా? అంటే అవుననే సంకేతాలు వస్తున్నాయి. జనసేన పొలిటికల్ అఫైర్స్ కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ఈ విషయాన్నే ధృవీకరించారు. రాబోయే రోజుల్లో జనసేనకు మెగాస్టార్ చిరంజీవి నుంచి పూర్తి మద్దతు ఉంటుందని తెలిపారు. ఈ విషయాన్ని చిరంజీవి, తమ్ముడు పవన్ కళ్యాణ్ కు స్వయంగా చెప్పడం నేను విన్నానని వెల్లడించారు. అంటే రాబోయే ఎన్నికల్లో జనసేన తరపున చిరంజీవి విస్తృతంగా ప్రచారం నిర్వహించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
పవన్ అందుకే సినిమాలు చేస్తున్నారు
చిరంజీవి స్వయంగా పవన్ కళ్యాణ్ ఇంటికి వచ్చి కనీసం రెండు సంవత్సరాలు సినిమాలు చేసుకోవాలని తమ్ముడికి సూచించారని అందుకే కొన్ని సినిమాలు చేస్తున్నారని ప్రకటించారు. రాబోయే రోజుల్లో జనసేనకు తాను కూడా పూర్తిగా పనిచేయడానికి సిద్దంగా ఉన్నానని ఆయన హామీ ఇచ్చిన విషయాలను నాదెండ్ల మనోహర్ గుర్తుచేశారు. జనసేన రాజకీయ ప్రస్థానంలో తాను తప్పకుండా ఉంటానని చిరంజీవి భరోసా ఇచ్చారని తెలిపారు. నాదెండ్ల మనోహర్ మంగళగిరి జనసేన కార్యాలయంలో ఈ విషయం చెప్పడంతో అభిమానులు ఆనందానికి అవదుల్లేకుండా పోయాయి.
Must Read ;- కమలదళంపై పవన్ అసహనం.. అందుకే..
తిరుపతి ఉపఎన్నికల్లోనూ ప్రచారం నిర్వహిస్తారా?
తిరుపతి ఉప ఎన్నికల్లో జనసేన అభ్యర్థి పోటీ చేస్తే చిరంజీవి కూడా ప్రచారం నిర్వహించే అవకాశం ఉందని రాజకీయవర్గాలు అంచనా వేస్తున్నాయి. ప్రజారాజ్యం పార్టీని తిరుపతి నుంచి ప్రారంభించిన చిరంజీవి, తిరుపతిలో 2009 ఎన్నికల్లో విజయం సాధించిన సంగతి తెలిసిందే. అందుకే తిరుపతి ఉప ఎన్నికల ప్రచారంలో ఒకటి రెండు సభల్లో చిరంజీవి పాల్గొనే అవకాశాలు లేకపోలేదని తెలుస్తోంది.
నాదెండ్ల మాటల్లో మతలబు ఏంటి?
పవన్ కల్యాణ్ కు అత్యంత విధేయుడైన పార్టీ నిర్వహణ చూస్తున్న నాయకుడిగా నాదెండ్ల మనోహర్ కీలకంగా వ్యవహరిస్తున్నారు. అలాంటి నాదెండ్ల ఏదో నోరుజారిగానీ, యథాలాపంగా గానీ.. ఒక మాట అంటారని అనుకోలేం. పార్టీకి సంబంధించి రాజకీయాలకు సంబంధించి ఎంతో కీలకమైన చిరంజీవి ఎంట్రీ గురించి ఆయన ప్రకటించారంటే.. అలాంటి ప్రకటన చేయడానికి పవన్ కల్యాణ్ ఆమోదం కూడా ఉండే ఉంటుందని పలువురు అంచనా వేస్తున్నారు. పవన్ కల్యాణ్ తన నోటితో సంగతి చెప్పకుండా, వ్యూహాత్మకంగా నాదెండ్ల ద్వారా సంగతి బయటపెట్టి ఉంటారనే ప్రచారం రాజకీయ వర్గాల్లో జరుగుతోంది.
Also Read ;- ఢిల్లీ టవర్ టు పవన్ కల్యాణ్ : సిగ్నల్స్ చాలా స్ట్రాంగ్!