ఏలూరులో కలకలం రేపిన వింతవ్యాధి బాధితుల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతూనే ఉంది. తాజాగా నర్సులు, డాక్టర్లు కూడా దీని బారిన పడ్డారు. ఇప్పటి వరకు 563 మంది ఈ వింతవ్యాధి బారినపడి చికిత్స పొందుతున్నారు. వీరిలో దాదాపు 260 మందికి అత్యవసర చికిత్స అందించి డిశ్ఛార్జి చేశారు. 20 మంది బాధితులకు సీరియస్ గా మారడంతో విజయవాడ, గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రులకు తరలించారు. అంతుచిక్కని వ్యాధి అంతు తేల్చేందుకు అనేక నిపుణుల బృందాలు రంగంలోకి దిగాయి. అనేక శాంపిల్స్ సేకరించారు. వాటిని పరీక్షల కోసం పంపారు. నివేదికలు వస్తే వ్యాధి మూలం బయటపడే అవకాశం దొరుకుతుందని డాక్టర్లు చెబుతున్నారు.
లెడ్, నికెల్ రక్తంలో ఎలా చేరాయి?
వింతరోగం బాధితుల రక్తంలో అధిక మోతాదులో లెడ్, నికెల్ గుర్తించారు. అయితే అవి బాధితుల శరీరంలోకి ఎలా చేరాయనే దానిపై అధ్యయనం సాగుతోంది. నీరు, ఆహారం ద్వారా మాత్రమే రక్తంలో లెడ్, నికెల్ చేరే అవకాశం ఉందని ఢిల్లీ ఎయిమ్స్ వైద్యుల బృందం తేల్చి చెప్పింది. అందుకే బాధితుల నివాసాల నుంచి 40 రకాల ఆహార శాంపిల్స్ సేకరించి ఢిల్లీ పంపించారు. ఆ నివేదిక వస్తే ఏ ఆహార పదార్దంలో లెడ్, నికెల్ ఉందో తెలిసే అవకాశం ఉంది. బాధితులు ఉపయోగించిన ఆహారంతోపాటు తాగిన నీటి శాంపిల్స్, పాలను కూడా పరీక్షల కోసం పంపించారు. నివేదికలు వస్తే వింతరోగం అంతుచిక్కే అవకాశం దొరుకుతుందని నిపుణులు చెబుతున్నారు.
ఆ సంస్థ నివేదికే చాలా కీలకం
నీరు, ఆహార పదార్ధాల్లో భార లోహాల శాతం పరిశీలించేందుకు ఏలూరులో సేకరించిన 40 శాంపిల్స్ ను ఏషియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీకి పంపించారు. ఏలూరులో బాధితుల ఇళ్ల నుంచి బియ్యం, కందిపప్పు, ఉప్పు, నూనె, పాలు,నీరు వంటి 40 రకాల శాంపిల్స్ సేకరించారు. వీటిని వారం రోజుల పాటు అత్యాధునిక ల్యాబుల్లో పరీక్షించి నివేదికలు సిద్దం చేయనున్నారు. ఏ ఆహారంలో లెడ్, నికెల్ ఎక్కువ ఉందో తేలితే క్లూ దొరికే అవకావం చిక్కుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ఢిల్లీ నుంచి వచ్చిన 9 మంది ఎయిమ్స్ నిపుణులు ప్రపంచ ఆరోగ్యసంస్థ పార్మెట్ ప్రకారం వివరాలు సేకరించారు. బాధితుల రక్తంలోకి భార లోహాలు చేరడానికి కారణమైన ఆహార పదార్థాలను గుర్తిస్తే తదుపరి జాగ్రత్తలు తీసుకోవడానికి వీలవుతుందని నిపుణులు సూచిస్తున్నారు.
ఏలూరులో కాలుష్య కాసారంగా మారిన కృష్ణా కాలువ
ఏలూరు చుట్టుపక్కల ఆక్వాసాగు విపరీతంగా సాగుతోంది. దీంతో ఏలూరులో ప్రవహించే కృష్ణా కాలువ జలాలు కూడా కాలుష్యంతో నిండిపోయాయి. ఇప్పటికే ఈ కాలువ నీటిలో ఫాస్పేట్ అధికంగా ఉన్నట్టు తేల్చారు. మరికొన్ని నివేదికలు వస్తే ఈ కాలువ నీటి వల్ల భూగర్బ జలాలు, తాగునీటి వనరులు కలుషితం అయ్యాయా లేదా అనే విషయం తేలనుంది. ఇలా ఏలూరులో వింతరోగం అంతుచూసేందుకు విజయవాడ సిద్ధార్థ మెడికల్ కాలేజీకి చెందిన టీం కూడా రంగంలోకి దిగింది. శాంపిల్స్ సేకరించారు. నివేదికలు రావాల్సి ఉంది.
బాధితుల్లో నర్సులు, డాక్టర్లు
ఏలూరు వింతరోగం బాధితుల్లో నర్సులు, డాక్టర్లు, పోలీసులు కూడా చేరుతున్నారు. నిన్న వైద్యం అందిస్తూ ఓ నర్సు, డాక్టరు కుప్పకూలిపడిపోయారు. వింతరోగం లక్షణాలు ఉండటంతో వారికి వెంటనే చికిత్స అందించారు. ఇక డ్యూటీలో ఉన్న ఓ పోలీస్ కూడా వింతరోగం బారినపడ్డారు. దీంతో ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. కొత్తగా ఏలూరు సమీపంలోని దెందులూరులో కూడా ఆరు కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం బాధితుల సంఖ్య 563కు చేరింది. సమగ్ర నివేదికలు అందితే వింతరోగం మూలం దొరికే అవకాశం చిక్కుతుంది. దాన్ని బట్టి ఎలాంటి జాగ్రత్తలు పాటించాలనే దానిపై నిపుణులు సూచనలు చేయనున్నారని తెలుస్తోంది.
Must Read ;- బతికిబట్టకట్టాలంటే ఢిల్లీ విడిచి వెళ్లాల్సిందేనా?