ధన త్రయోదశి రోజున లక్ష్మీదేవి .. కుబేరుడు .. ధన్వంతరి ఆరాధన ఎందుకు చేయాలి? ఆ విషయాలను తెలుసుకుందాం. కెరటాలు లేని సముద్రం .. సమస్యలు లేని జీవితం ఉండదు. ప్రతి ఒక్కరూ ఎవరి స్థాయిలో వాళ్లు అనేక రకాల సమస్యలను .. ఇబ్బందులను ఎదుర్కొంటూనే వుంటారు. ఆర్థికపరమైన ఇబ్బంది లేకపోతే ఇతర సమస్యలను ఎదుర్కోవడానికి అవకాశం ఉంటుంది. ఆర్థికపరమైన ఇబ్బంది తలెత్తినప్పుడు మాత్రం అంతకంటే పెద్ద సమస్య ఉండదని అనిపిస్తుంది. అందువల్లనే ప్రతి ఒక్కరూ సంపద విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ వుంటారు. తమ ఇంట ధనానికి ఎలాంటి లోటు లేకుండా చూడమని లక్ష్మీదేవిని ప్రార్ధిస్తుంటారు.
లక్ష్మీదేవి అనుగ్రహం వల్లనే దారిద్య్రం తొలగిపోతుంది .. దారిద్ర్యంతో ముడిపడిన దుఃఖం దూరమవుతుంది. ఆదాయం విషయంలో అప్పటివరకూ ఇబ్బందులు పెడుతున్న అడ్డంకులు తొలగిపోతాయి .. సంపద వృద్ధి చెందడానికి అవసరమైన కొత్త మార్గాలు ఏర్పడతాయి. సంపదలే సంతోషానికి కారణమవుతాయి .. అలాంటి ఆనందాలనిచ్చే లక్ష్మీదేవిని పూజించే విశేషమైన రోజుగా ‘ధన త్రయోదశి’ కనిపిస్తుంది. ఆశ్వీయుజ బహుళ త్రయోదశికి ‘ధన త్రయోదశి’ అని పేరు. లక్ష్మీదేవికిగల మరో పేరే ‘త్రయోదశి’ .. దీనిని బట్టి ఈ రోజున ఆ తల్లి ఆరాధన ఎంతటి విశిష్టమైనదో అర్థం చేసుకోవచ్చు.
పరిశుభ్రత కలిగిన ఇళ్లలోను .. పవిత్రమైన జీవితాన్ని గడుపుతున్నవారి ఇళ్లలోను లక్ష్మీదేవి ఉంటుంది. పాలు .. పూలు .. పసుపు .. కుంకుమలను పవిత్రమైన భావనతో చూసేవారి ఇళ్లలో లక్ష్మీదేవి తన ‘కళ’ను ఉంచుతుంది. తల్లిదండ్రులను ప్రేమించేవారి ఇంట .. గురువులను గౌరవించేవారి ఇంట .. మూగజీవాలపట్ల సానుభూతి కలిగినవారి ఇంట ఉండటానికి లక్ష్మీదేవి ఇష్టపడుతుంది. అందువలన లక్ష్మీదేవిని ఆరాధించేవారు .. ఆ తల్లి అనుగ్రహాన్ని ఆశించేవారు .. ఆమెకి ప్రీతిని కలిగించే విధంగా నడుచుకోవాలి.
‘ధన త్రయోదశి’ రోజున పూజా మందిరంలోను .. వాకిట్లోను దీపాలను వెలిగించడం వలన, లక్ష్మీదేవితో పాటు శ్రీమన్నారాయణుడిని పూజించడం వలన ఆశించిన ఫలితం దక్కుతుందని ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి. ఈ రోజున కుబేరుడిని పూజించడం కూడా మంచి ఫలితాలను ఇస్తుందని అంటారు. కుబేరుడికి ‘నిధిపతి’ అనే పేరు వుంది .. నవనిధులకు ఆయన అధిపతి. నరుడిని వాహనంగా చేసుకున్న ఆ స్వామి, తనని ఆరాధించినవారి ఇంట సంపదలకు కొదవలేకుండా చేస్తుంటాడు. అందువలన ఈ రోజున పూజా మందిరంలో కుబేరుడి చిత్రపటాన్ని ఉంచి అంకితభావంతో ఆరాధించాలి.
ఇక క్షీరసాగర మథనం జరిగినప్పుడు అమృతానికి ముందుగా కామధేనువు .. కల్పవృక్షము .. ఐరావతంతో పాటు, లక్ష్మీదేవి .. చంద్రుడు .. అప్సరసలు .. ధన్వంతరి పుట్టుకొచ్చారు. క్షీరసాగరం నుంచి ఆశ్వీయుజ బహుళ త్రయోదశి రోజునే ‘ధన్వంతరి’ వెలుగు చూశాడు. అందువల్లనే ఈ రోజుని ‘ధన త్రయోదశి’గా పేర్కొంటారని చెబుతారు.
‘ధన్వంతరి’ దేవ వైద్యుడు .. ఆయన ఈ ప్రపంచానికి ఆయుర్వేదాన్ని అందించాడు. ‘ఆరోగ్యమే మహాభాగ్యం’ అనేది మహర్షుల మాట. ఆరోగ్యానికి మించిన సంపద లేదు. అలాంటి ఆరోగ్యాన్ని రక్షించుకోవడంలో ఆయుర్వేదం ప్రధానమైన పాత్రను పోషిస్తోంది. అలాంటి ఆయుర్వేదాన్ని అందించిన ధన్వంతరిస్వామిని ఈ రోజున పూజించి, ఆవుపాలతో చేసిన బెల్లం పాయసాన్ని నైవేద్యంగా సమర్పించాలి. ఈ విధంగా చేయడం వలన ఆయురారోగ్యాలు కలుగుతాయి. ఇలా ‘ధన త్రయోదశి’ రోజున లక్ష్మీనారాయణులను .. కుబేరుడిని .. ధన్వంతరిని ఆరాధించడం వలన దారిద్ర్య దుఃఖాలు నశిస్తాయి. ఆరోగ్యంతో సంపదలను అనుభవించే ఆనందకరమైన జీవితం లభిస్తుంది.
– పెద్దింటి గోపీకృష్ణ











