ఇటు బుల్లితెర ప్రేక్షకులకు .. అటు వెండితెర ప్రేక్షకులకు పరిచయం చేయవలసిన అవసరంలేని పేరు ‘ఉదయభాను’. కొత్తదనంతో బుల్లితెరపై ఆవిష్కారాలు .. ప్రయోగాలు మొదలైన తొలిరోజుల్లోనే ఉదయభాను ఎంట్రీ ఇచ్చింది.
ఉదయభాను మంచి హైట్ తో .. అందుకు తగిన పర్సనాలిటీతో ప్రేక్షకులను ఇట్టే ఆకట్టుకుంది. మత్తెక్కించే కళ్లు .. మాటకారితనం .. చెరగని చిరునవ్వు ఉదయభానుకి ఎంతో క్రేజ్ ను తెచ్చిపెట్టాయి. అప్పట్లోనే స్క్రిప్ట్ తో పనిలేకుండా పబ్లిక్ లో చేయవలసిన కార్యక్రమాలకు ఉదయభానునే ఎంచుకునేవారు. ఎంతో ఉత్సాహంతో .. మరెంతో సమయస్ఫూర్తితో వ్యవహరిస్తూ యాంకరింగులో తనకంటూ ఆమె ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకుంది. చాలాకాలం క్రితమే యాంకర్స్ గా ఎంట్రీ ఇచ్చినవారిలో చాలా స్పీడ్ గా మాట్లాడే యాంకర్ గా ఉదయభాను నిలిచింది.
గలగలమని మాట్లాడుతూ .. సందడిచేస్తూ సమయం తెలియకుండా కార్యక్రమాన్ని నడిపించడం ఆమె ప్రత్యేకత. అప్పట్లో యూత్ ఫుల్ ప్రోగ్రామ్స్ చేయడంలో ఉదయభాను ముందుండేది. పబ్లిక్ లోకి .. కాలేజ్ స్టూడెంట్స్ మధ్యలోకి దూసుకెళ్లడానికి ఆమె ఎంతమాత్రం సంశయించేది కాదు. ఎంతో ధైర్యంగా .. మరెంతో చొరవగా వాళ్ల మధ్యలోకి వెళ్లి, ఆ కార్యక్రమానికి అవసరమైన అవుట్ పుట్ ను రాబట్టుకొచ్చేది. కుర్రాళ్లు కూడా ఉదయభాను కార్యక్రమంలో కనిపించడానికి ఎగబడేవారు. ఉదయభాను గ్లామర్ కి .. ఆమెలోని జోష్ కి వాళ్లు అభిమానులైపోయేవారు.
బుల్లితెరపై ఒక్కో కాన్సెప్ట్ తో కూడిన కార్యక్రమాలను చేస్తూ, అందరి హృదయాలను ఉదయభాను ఆక్రమిస్తూ వెళ్లింది. ఇటు యూత్ తో పాటు అటు మహిళా ప్రేక్షకుల మనసులను కూడా ఆమె గెలుచుకుంది. టీనేజ్ అమ్మాయిల్లోను .. మహిళా ప్రేక్షకుల్లోను ఉదయభాను ఫాలోయింగ్ పెరిగిపోయింది. ఛానల్ ఏదైనా .. కాన్సెప్ట్ ఏదైనా ఉదయభాను కోసమే టీవీల ముందు కూర్చునేవారి సంఖ్య పెరిగిపోతూ వచ్చింది. ఉదయభానుని ఒక యాంకర్ గా కాకుండా తమ ఆరాధ్య దేవతగా మనసు మందిరంలో ప్రతిష్ఠించుకున్న కుర్రాళ్లు చాలామందే ఉన్నారు. ఉదయభానుని చూశామని చెప్పినవారిని కూడా గొప్పగా చూసేవారంటే అప్పట్లో ఆమెకి ఏ స్థాయిలో క్రేజ్ ఉండేదో అర్థం చేసుకోవచ్చు.
ఒక కథానాయికకి కావలసిన లక్షణాలన్నీ ఉదయభానులో పుష్కలంగా ఉండేవి. పాలపిండితో చేసిన పంచదార చిలకలా .. జక్కన చెక్కిన చక్కని శిల్పంలా కనిపించే ఉదయభానుని చూడగానే కుర్రమనసులన్నీ జర్రున జారిపోయేవి. నేరేడుపండ్ల వంటి కళ్లతో విరజాజుల వంటి చూపులను విసురుతూ, ఉడుకు గుండెల్లో చిక్కుకున్న ఊహలకు గండికొట్టేది. ఉదయభాను సంపాదించుకున్న ఈ క్రేజ్ కారణంగానే ఆమెకి సినిమాల్లోను అవకాశాలు వచ్చాయి. తన గ్లామర్ కి తగిన పాత్రలను .. తన బాడీ లాంగ్వేజ్ కి తగిన పాత్రలను చేస్తూ వెళ్లింది. అలా ఒక వైపున సినిమాలు చేస్తూనే, మరో వైపున టీవీ షోల్లోను కొనసాగింది. ఇక సినిమా ఈవెంట్స్ కి హోస్ట్ గాను తన ప్రత్యేకతను చాటుకుంది.
Must Read ;- యాంకర్ శ్రీముఖి డేటింగు పుకార్లా.. నిజమా?
తెలుగు తెరపై ఐటమ్ సాంగ్స్ ఉపందుకుంటున్న సమయంలో, తను కూడా ఆ దిశగా అడుగులు వేసింది. ‘లీడర్’ సినిమాలో చేసిన ‘రాజశేఖరా .. ‘ .. ‘జులాయి’ సినిమాలో చేసిన టైటిల్ సాంగులోను హాట్ హాట్ గా మెరిసింది .. కుర్రాళ్ల హార్ట్ బీట్ ను పెంచింది. ముఖ్యంగా ‘లీడర్’ ఐటమ్ సాంగులో భారీ అందాలను ఆరబోస్తూ మత్తుకళ్లతో మాయాజాలమే చేసింది. ఈ నేపథ్యంలోనే కథానాయిక ప్రాధాన్యత కలిగిన ‘మధుమతి’ సినిమాలోను ఆమె నటించింది. గ్లామర్ పరంగాను .. నటన పరంగాను ‘మధుమతి’ పాత్రలో ఉదయభాను తన హావభావ విన్యాసంతో ఆకట్టుకుంది.
కరీంనగర్ జిల్లాలోని ఒక మారుమూల గ్రామంలో పుట్టిపెరిగిన ఉదయభాను, యాంకర్ గా .. హోస్ట్ గా .. నటిగా అంచెలంచెలుగా ఎదగడం వెనుక అహర్నిశలు ఆమె చేసిన కృషి కనిపిస్తుంది. ఉదయం నుంచి రాత్రి వరకూ పనిచేసినా అలసట కనిపించనీయని అంకితభావం కనిపిస్తుంది. గడియారంలో ముల్లుతో పాటు పరిగెత్తిన ఉదయభాను జీవితం .. నవ్వుల నదిలో పువ్వుల పడవ అనుకుంటే పొరపాటే. ఎన్నో సమస్యలు సుడిగుండాల్లా ఆమెను చుట్టుముట్టాయి. మరెన్నో కష్టాలు ఆమెను ఉక్కిరిబిక్కిరి చేశాయి. అయినా ఎంతో నిబ్బరంగా ఆమె ఆ గండాలను దాటుకుంటూ వెళ్లింది. ఉదయభాను అంటే అందం .. ఆకర్షణ మాత్రమే కాదు, ఆత్మస్థైర్యాన్ని ఆనవాలు అనిపించుకుంది.
ఉదయభాను మంచి పొడగరి .. అందువలన మోడ్రన్ డ్రెస్సుల్లో ఆమె ఎంతో అందంగా కనిపిస్తుంది. చీరకట్టులో మరెంతో నిండుగా అనిపిస్తుంది. వెన్నెల పువ్వుల్లాంటి కళ్లు ఆమెకి ప్రత్యేకమైన ఆకర్షణ. అలాంటి ఆమె మోడలింగ్ వైపు .. సినిమాల వైపు పూర్తిస్థాయిలో దృష్టి పెట్టలేదనే విషయం స్పష్టమవుతోంది. లేదంటే ఆమె క్రేజ్ మరోస్థాయికి వెళ్లి ఉండేదనిపిస్తోంది. మధుమతి’ సినిమా తరువాత కథానాయిక ప్రాధాన్యత కలిగిన మరిన్ని సినిమాలు ఆమె నుంచి వస్తాయని అభిమానులు భావించారు .. కానీ అలా జరగలేదు.
మంచి కథ కోసం ఎదురుచూస్తున్న కారణంగా ఆలస్యం అవుతుందేమోనని అనుకున్నారు. అది నిజం కాదనే విషయం నిదానంగా తెలిసింది. వివాహం తరువాత ఆమె తన దూకుడును తగ్గిస్తూ వెళ్లింది. కవల పిల్లలకి తల్లిగా మారిన తరువాత వాళ్ల ఆలనా పాలన పైనే పూర్తి దృష్టి పెట్టింది. ఉదయభాను అభిమానులు మాత్రం ఆమె రీ ఎంట్రీ ఇస్తే బాగుంటుందనే ఆశతో ఉన్నారు. వాళ్ల కోరిక త్వరలో నెరవేరుతుందేమో చూడాలిమరి.
– పెద్దింటి గోపీకృష్ణ
Also Read ;- మంత్రించే మాటల జలపాతం సుమ