ధనుష్ మరో సంచలనాన్ని సృష్టించడానికి సిద్ధమవుతున్నాడు. కథాకథనాల పరంగా .. పాత్ర పరంగా తను చేసిన మరో ప్రయోగాన్ని పరిచయం చేయడానికి సమాయత్తమవుతున్నాడు. ఆయన తాజా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రావడానికి ‘జగమే తందిరం‘ ముస్తాబవుతోంది. సంతోష్ నారాయణ్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమాలో, ధనుశ్ జోడిగా ఐశ్వర్య లక్ష్మి అలరించనుంది. ఈ సినిమాలో ధనుష్ డిఫరెంట్ హెయిర్ స్టైల్ .. మెలి తిరిగిన మీసకట్టుతో న్యూ లుక్ తో కనిపించనున్నాడు. ఆయన లుక్ ఈ సినిమాకి స్పెషల్ అట్రాక్షన్ కానుంది.
మొదటి నుంచి కూడా ధనుష్ కథాకథనాలతో పాటు తన పాత్ర ప్రత్యేకత పట్ల కూడా దృష్టిపెడుతూ వస్తున్నాడు. ఈ కారణంగానే ఆయన సినిమాలు విభిన్నమైనవిగా నిలుస్తూ విజయాలను అందుకుంటున్నాయి. ఇంతకుముందు ఆయన చేసిన ‘పట్టాస్’ సినిమా కూడా వైవిధ్యభరితమైనదే. ఆ సినిమాలో ఆయన ద్విపాత్రాభినయం చేశాడు. ఈ రెండు పాత్రల రూపకల్పన విషయంలో ఆయన తీసుకున్న శ్రద్ధ, ఆ సినిమా విజయానికి ప్రధాన కారణంగా నిలిచింది. అదే శ్రద్ధ త్వరలో రానున్న ‘జగమే తందిరం’ సినిమాలోను కనిపించనుంది.
యాక్షన్ థ్రిల్లర్ గా నిర్మితమైన ఈ సినిమాకి, కార్తిక్ సుబ్బరాజ్ దర్శకుడిగా వ్యవహరించాడు. తమిళనాట విభిన్నమైన చిత్రాల దర్శకుడిగా కార్తిక్ సుబ్బరాజ్ కి మంచి క్రేజ్ వుంది. గతంలో తమిళంలో ఆయన తెరకెక్కించిన ‘పిజ్జా’ అదే టైటిల్ తో తెలుగు ప్రేక్షకులను కూడా ఆకట్టుకుంది. ఆ తరువాత తమిళంలో ఆయన చేసిన ‘జిగర్తాండ’ .. ‘గద్దలకొండ గణేశ్‘ పేరుతో తెలుగులో రీమేక్ గా విజయాన్ని అందుకుంది. ఇక రజనీతో చేసిన ‘పేట్టా’ ప్రపంచవ్యాప్తంగా రికార్డుస్థాయి వసూళ్లను రాబట్టింది. తెలుగులో ‘పేట’ పేరుతో అనువదించబడిన ఈ సినిమా, ఇక్కడ కూడా మంచి వసూళ్లనే రాబట్టింది.
రజనీకాంత్ హీరోగా చేసిన ‘పేట’ ఈ ఏడాది సంక్రాంతి బరిలో నిలిచి, ఆయన అభిమానులను ఖుషీ చేసింది. ఆ తరువాత సినిమానే ఆయన రజనీ అల్లుడైన ధనుశ్ తో చేయడం విశేషం. కథలో కొత్తదనం .. కథనాన్ని ఆవిష్కరించే తీరులో వైవిధ్యం చూపడంలో కార్తిక్ సుబ్బరాజ్ సిద్ధహస్తుడు. మామ తరువాత అల్లుడితో ఆయన చేసిన ఈ సినిమాపై భారీ అంచనాలే వున్నాయి. ఆ అంచనాలను ఈ సినిమా అందుకుంటుందనే అభిప్రాయాలు వున్నాయి. సింగర్ గాను ప్రయోగాలు చేసే ధనుశ్ ఈ సినిమాలోను ఓ పాట పాడటం మరో అదనపు ఆకర్షణ అవుతుందని చెప్పొచ్చు.
Must Read ;- సంక్రాంతి బరిలోకి పెద్ద పుంజులు దిగుతాయా లేదా?










