తమిళ ‘తల’ అనగానే గుర్తొచ్చే హీరో అజిత్. ఆయన పేరుకు తగ్గట్టు ఆయన తల నెరిసినా అలాగే నటిస్తూ తమిళ చిత్ర పరిశ్రమలో మెరుపులు మెరిపిస్తున్నాడు. తమిళనాట కమల్, రజినీల జనరేషన్ తర్వాత ఆ స్థాయిలో పోటీపడుతున్న హీరోలుగా అజిత్, విజయ్ లను చెప్పాలి. వీరి మధ్య సినిమా రంగంలో అంతపోటీ ఉంటుంది. ఇద్దరు హీరోల అభిమానులూ కొట్టుకునే దాకా పరిస్థితి వెళుతుంది. అలాంటి అజిత్ పుట్టిన రోజు మేడే రోజు కావడం కాకతాళీయమే. అజిత్ కు ఇది 50వ పుట్టినరోజు.
చిన్న చిన్న పాత్రలు వేస్తూ అంచెలంచెలుగా సూపర్ స్టార్ గా ఎదిగాడు. తమిళం కన్నా ముందు అతను తెలుగు సినిమా ద్వారానే హీరోగా గుర్తిపు పొందాడు. అప్పట్లో అతని పేరు శ్రీకర్. నటుడు గొల్లపూడి మారుతీరావు కుమారుడు గొల్లపూడి శ్రీనివాస్ దర్శకత్వం వహించిన ‘ప్రేమపుస్తకం’ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమయ్యాడు. చివరికి హీరోగా ఆదరించింది మాత్రం తమిళ చిత్ర పరిశ్రమే.
సికింద్రాబాద్ లో పుట్టి..
అజిత్ పుట్టిపెరిగింది మాత్రం సికింద్రాబాద్ గానే చెపాలి. ఆయన తండ్రి సుబ్రహ్మణ్యం కేరళకు చెందినవాడు. తల్లిది కోల్ కతా. అజిత్ కు చదువు పెద్దగా ముందుకు సాగలేదు. పదోతరగతితోనే ఫుల్ స్టాప్ పెట్టేశారు. మోటార్ సైకిల్ మెకానిక్ గా మంచి గుర్తింపు ఉంది. బైక్ రేసింగ్ అన్నా ఇష్టం. రాయల్ ఎన్ ఫీల్డ్ సంస్థలో కొంతకాలం మెకానిక్ గా చేశారు. మరో పక్క మోడల్ గానూ కెరీర్ ప్రారంభించారు. అజిత్ ను నటుడిగా ప్రోత్సహించింది మాత్రం సినిమాటోగ్రాఫర్ పి.సి. శ్రీరామ్ అంటారు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సిఫార్సుతో ‘ఎన్ వీడు ఎన్ కనవర్’ అనే సినిమాలో చిన్న అవకాశం దక్కింది.
ఆ తర్వాత హీరోగా ‘ప్రేమపుస్తకం’. అమరావతి అనే మరో సినిమాలోనూ నటించారు. దాదాపు పాతికేళ్ల నట జీవితం అజిత్ ది. మొదట్లో పెద్దగా అవకాశాలు వచ్చేవి కాదు. అయినా పట్టువదలకుండా ప్రయత్నాలు చేస్తూనే ఉండేవాడు. ఈ పాతికేళ్లలో దాదాపు 60 చిత్రాల్లో అజిత్ నటించాడు. సినిమాల సంఖ్య పరంగా చూస్తే అజిత్ కన్నా విజయ్ ముందున్నాడు. ఈ ఇద్దరూ మాస్ హీరోలుగా పేరు తెచ్చుకున్నారు. 1995లో ‘ఆసాయ్’ అనే తమిళ సినిమా విజయం సాధించడంతో అజిత్ కు వరుస అవకాశాలు వచ్చాయి. ‘కాదల్ కొట్టాయ్’తో అజిత్ జాతీయ అవార్డు కూడా లభించింది. ఈ సినిమా తెలుగులో ప్రేమలేఖ పేరుతో విడుదలైంది. అజిత్ డ్యూయల్ రోల్ లో నటించిన ‘వాలి’ అప్పట్లో పెద్ద హిట్.
రేసింగ్ లో అజిత్ దూకుడే వేరు
ఫార్ములా 2 రేసింగ్ లో అజిత్ దూకుడు మామూలుగా ఉండదు. ఫార్ములా కార్ రేసింగ్‌లో పాల్గొన్న అతి తక్కువ మంది భారతీయుల్లో అజిత్ స్థానం సంపాదించుకున్నారు. ముంబై, ఢిల్లీలో జరిగిన రేసుల్లో పాల్గొన్నాడు. అతనికి బైక్ తోలడం అంటే భలే సరదా. అలా బైక్ పై ఎన్నోసార్లు లాంగ్ డ్రైవ్ కు కూడా వెళ్లాడు. ఇప్పటికే వెళుతుంటాడు. ఇటీవలే హైదరాబాద్ రోడ్లపైనా తళుక్కుమన్నారు. సినిమాల పరంగా అవార్డులూ, రివార్డులూ అజిత్ సొంతం. ‘అమర్కలం’ చిత్రంలో తన సహనటి శాలినిని వివాహం చేసుకున్నారు. జుట్టు నెరిసినా అలాంటి వెంట్రుకలతోనే నటించడం అజిత్ ప్రత్యేకత. కుర్రాడిలా కనిపించాలన్న తాపత్రయం ఆయనలో తక్కువగా ఉంటుంది.
తమిళనాడు రాజకీయాల్లో అజిత్ కీలకపాత్ర పోషించవచ్చన్న వదంతులు ఎప్పట్నుంచో ఉన్నాయి. అయినా అజిత్ రాజకీయాల వైపు చూడలేదు. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలితతోనూ అజిత్ కు ఎంతో సాన్నిహిత్యం ఉంది. భవిష్యత్తులో తమిళనాడు రాజకీయాల వైపు అజిత్ చూస్తాడేమో ఇప్పుడే చెప్పలేం. తన సమవుజ్జీ విజయ్ మాత్రం ఎప్పుడో ఒకప్పుడు రాజకీయాల్లోకి రావడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ ఇద్దరి మధ్య సినిమాల పరమైన పోటీయే తప్ప వ్యక్తిగతంగా మాత్రం మంచి మిత్రులు. తాజా ఆయన ‘వాలిమై’ సినిమా చేస్తున్నారు. ఈ సినిమాతో ఎలాంటి హిట్ కొట్టబోతున్నారో చూడాలి.
-హేమసుందర్
Must Read ;- థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ సామాన్యుడు అజిత్











