(విశాఖపట్నం నుంచి లియో న్యూస్ ప్రతినిధి)
విశాఖ హెచ్‌పీసీఎల్‌లో మంగళవారం మధ్యాహ్నం మూడు గంటల సమయంలో సంభవించిన అగ్ని ప్రమాదం పూర్తిగా అదుపులోకి వచ్చింది.సిడిసి విభాగంలో ఓవర్ హెడ్ పైప్ లైన్ లీక్ అవడంతో అందులోని క్రూడ్ ఆయిల్ నుంచి భారీగా మంటలు ఎగసి పడ్డాయి.సుమారు 70 అడుగుల ఎత్తు వరకు ఈ మంటలు ఎగసి పడడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.ప్రమాదం సంభవించిన సమయంలో కేవలం నలుగురు ఉద్యోగులు మాత్రమే అక్కడ ఉన్నారు.నిర్వహణ పనులు చేస్తున్న సమయంలో ఈ ప్రమాదం సంభవించినట్టు యాజమాన్యం తెలిపింది.హెచ్‌పీసీఎల్ లో అగ్నిప్రమాద నియంత్రణకు అంతర్జాతీయ స్థాయి నూతన టెక్నాలజీతో కూడిన యంత్ర సామగ్రి ఉంది.దీంతో నలభై ఐదు నిమిషాల్లోనే మంటలను అదుపులోకి తెచ్చారు.చమురు నుంచి మంటలు రావడం వల్ల నల్లని,దట్టమైన పొగ చుట్టూ అలముకుంది.దీంతో అప్రమత్తమైన పోలీసులు అవసరమైతే స్థానికులను తరలించేందుకు సిద్ధపడ్డారు.అయితే వెంటనే మంటలు అదుపులోకి రావడంతో ఊపిరి పీల్చుకున్నారు.హెచ్‌పీసీఎల్‌కు చెందిన 4 ఫైర్ ఫైటర్‌లతోపాటు కోరమండల్ ఇతర పరిశ్రమల నుంచి వచ్చిన 13 అగ్నిమాపక శకటాలు మంటలు అదుపులోకి తీసుకు వచ్చాయి.ఈ ప్రమాదం సంభవించిన వెంటనే పరిశ్రమ సేఫ్టీ విభాగం మూడు సార్లు అలారం మోగించడంతో,ఇతర విభాగాల్లో ఉన్న మొత్తం 500 మంది ఉద్యోగులు దూరంగా పరుగులు తీశారు.పైప్ లైన్‌లో ఉన్న చమురు మొత్తం దహనం అయ్యాక మంటలు పూర్తిగా తగ్గుతాయని జిల్లా కలెక్టర్ వినయ్ చంద్ తెలిపారు.ఈ ప్రమాదంలో ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదు.గంట తర్వాత ఇతర విభాగాల్లో ఆపరేషన్స్ యథావిధిగా ప్రారంభం అయ్యాయి.టూరిజం శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు,సిటీ పోలీస్ కమిషనర్ మనీష్‌కుమార్ సిన్హా,రెవిన్యూ,పోలీస్ యంత్రాంగం మొత్తం సంఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని పర్యవేక్షించారు.
Must Read ;- తిరుమలలో అగ్ని ప్రమాదం.. ఒకరు సజీవ దహనం










