First Real Hero In India NTR :
మన దేశంలో ఎంతో మంది నటులు ఉన్నారు. వారంతా అగ్రస్థాయికి ఎదిగారు. కానీ ఎవరికీరాని ఆలోచన ఓ మహానటుడికి వచ్చింది. అదీ తెలుగునాట అంటే ఆశ్చర్యంగానే ఉంటుంది. ఆయనే మన నందమూరి తారక రామారావు.
ఇంతకీ ఆయనకు వచ్చిన ఆ అపూర్వమైన ఆలోచన ఏమిటంటారా?.. కరవుతో అల్లాడుతున్న రాయల సీమ వాసులను ఏదో ఒక విధంగా ఆదుకోవాలి.. అందుకు కళను సాధనంగా వాడుకోవాలి. ఆయనకు ఈ ఆలోచన వచ్చింది1952లో. అప్పటికి ఆయన సినిమా వయసు పట్టుమని మూడేళ్లు కూడా లేదు. ఆయన కన్నా సీనియర్ నటులు చాలామంది ఉన్నారు. హిందీలోగానీ వేరే ప్రాంతీయ భాషల్లోగాని ఎవరూ చేయలేని పనిని ఆరోజు ఎన్టీఆర్ చేయగలిగారు.
రాయలసీమ వాసులను ఆదుకోడానికి నిధులను సేకరించాలంటే ఏదో ఒక నాటకాన్ని ప్రదర్శించాలన్న ఆలోచన వచ్చిందాయనకు. జోలెపట్టి విరాళాలు అడగడంతో పాటు అలా విరాళాలు ఇచ్చిన వారికి వినోదాన్ని పంచాలన్న ఆలోచనతో నాటక ప్రదర్శనను ఎంచుకున్నారు. అందుకు ఆయన ఎంచుకున్న నాటకం పేరు కూడా ‘కరువురోజులు’. త్రిపురనేని గోపీచంద్ రాసిన నాటకం అది. ఎన్టీఆర్ సినిమాల్లోకి రాకముందు రంగస్థల నటుడు అనే సంగతి తెలిసిందే. నాటకాల జోరు ఉన్న రోజుల్లోనే ఆయన నేషనల్ ఆర్ట్ థియేటర్స్ అనే నాటక సంస్థను కూడా ఏర్పాటుచేశారు.
సహనటుల సహకారం
ఈ సంస్థ ఆధ్వర్యంలోనే నాటకాన్ని ప్రదర్శించాలనుకున్నారు. తనకు సహకరించాల్సిందిగా మరో సహనటుడు గుమ్మడి వెంకటేశ్వరావునూ, పేకేటి శివరామ్ నూ కోరారు. ఎన్టీఆర్ సినిమా వయసు ఎంతో గుమ్మడి కూడా ఆ రంగంలో అడుగుపెట్టింది కూడా అప్పుడే. పేకేటి శివరామ్ మాత్రం కొంత సీనియర్. వారంతా సహకరిస్తామని మాట ఇచ్చారు. అన్నట్లుగానే ఆ నాటకంలో తలా ఓ పాత్ర వేశారు. మే 14వ తేదీ నేషనల్ థియేటర్ ఆర్ట్స్ బృందం మద్రాసు చేరుకుంది. విరాళాల సేకరణ మొదలైంది. మద్రాసులో కొంతమంది నిర్మాతలు అందుకు బాగా సహకరించారు. అప్పటికి ఎన్టీఆర్ చేసిన సినిమాలు ఎనిమిది మాత్రమే.
First Real Hero In India NTR :
మే 25న మద్రాసు వాణీ మహల్ లో ఈ నాటకాన్ని ప్రదర్శించారు. విరాళాల మొత్తం లక్షరూపాయల దాకా వసూలైంది. అది ఇప్పటి రోజులతో లెక్కిస్తే కోట్ల రూపాయలు అవుతుంది. ఆ మొత్తాన్ని వేదిక మీదనే ‘ఆంధ్రప్రభ’ సంపాదకులు నార్ల వెంకటేశ్వరరావుకు అందజేశారు. రాయల సీమ కరువు నివారణకు ఆ లక్షరూపాయల విరాళాన్ని రామకృష్ణ మిషన్ ద్వారా ఖర్చు చేయాల్సిందిగా నార్ల వారిని కోరారు. ఓ సినీ నటుడు జోలె పట్టి, నాటకం వేసి నిధులు వసూలు చేయడం భారతీయ సినీ చరిత్రలో ప్రథమం అనడం అతిశయోక్తి కాదు.
ఎన్టీఆర్ రాయలసీమ వాసులకు దేవుడు అవడానికి కారణం కూడా ఇదే కావచ్చు. అలాగే దివిసీమ ఉప్పెన వచ్చినప్పుడు కూడా ఇదే విధానాన్ని ఎన్టీఆర్ అనుసరించారు. అందుకు ఏయన్నార్ కూడా సహకరించారు. ఇలాంటి ప్రయత్నాలను చేసినప్పుడే అసలైన హీరోయిజం బయటపడుతుంది. రియల్ హీరోలంటే ఇలాంటి వారే. నేషనల్ ఆర్ట్ థియేటర్ 1953లో తొలిచిత్రంగా ‘పిచ్చి పుల్లయ్య’ సినిమాని నిర్మించి పెద్ద చిత్ర చిత్ర నిర్మాణ సంస్థగానూ మారింది. మంచి ప్రయత్నం చేస్తే ఎంతలా ఎదుగుదల ఉంటుందనడానికి నిదర్శనం ఇదే.
– హేమసుందర్
Must Read ;- కళాతపస్వి విశ్వనాథ్ గురించి మీకు తెలియని నిజాలు











