గతంలో వచ్చిన `హ్యాపీడేస్’ చిత్రం పలువురు నూతన తారల కెరీర్ ను ఒక్కసారిగా మలుపు తిప్పింది. అందులో టైసన్ పాత్రలో నటించిన రాహుల్ కు ఆ క్రేజ్ కారణంగానే అనేక అవకాశాలు వచ్చాయి. ఈ క్రమంలోనే `రైన్ బో, ముగ్గురు, వెంకటాపురం’ తదితర చిత్రాలలో ఆయన నటించారు. అయితే ఆ చిత్రాలేవీ తగినంతగా ప్రేక్షకులను మెప్పించలేకపోవడంతో రాహుల్ కెరీర్ వేగం తగ్గింది. మళ్లీ తన కెరీర్ ను మలుపు తిప్పే చిత్రం కోసం ఎదురు చూస్తున్న సమయంలోనే ఓ అవకాశం ఆయనను వెతుక్కుంటూ వచ్చింది.
రాహుల్, చేతన్ హీరోలుగా, సాక్షిచౌదరి, ఐశ్వర్య, యమీ హీరోయిన్లుగా ఎస్.ఎస్.ఎస్. స్టూడియోస్, విజన్ సినిమాస్ పతాకాలపై విరాట్ చక్రవర్తిని దర్శకుడిగా పరిచయం చేస్తూ, సాయికార్తీక్ నాగం తిరుపతి రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్న ప్రొడక్షన్ నెం.1 చిత్రం ప్రారంభోత్సవం బుధవారం హైదరాబాద్ లో జరిగింది. స్థానిక రామానాయుడు స్టూడియోలో తీసిన తొలి సన్నివేశానికి చిత్ర నిర్మాత సాయికార్తీక్ క్లాప్ నివ్వగా, మరో నిర్మాత నాగం తిరుపతిరెడ్డి కెమెరా స్విచ్ ఆన్ చేశారు. సహ నిర్మాత శ్రీకాంత్ దీపాల గౌరవ దర్శకత్వం వహించారు.
అనంతరం జరిగిన ప్రెస్ మీట్లో హీరోలలో ఒకరైన రాహుల్ మాట్లాడుతూ, `ఈ చిత్ర కథ విన్నప్పుడే చాలా థ్రిల్ ఫీలయ్యాను. సినిమాను చూసేటప్పుడు ప్రేక్షకులు కూడా అదే ఫీలవుతారు. మంచి యూనిట్ తో కలసి ఈ చిత్రం చేస్తున్నందుకు ఆనందంగా ఉంది’ అని అన్నారు. మరో హీరో చేతన్ మాట్లాడుతూ, `కన్నడంలో పది సినిమాలు చేశాను. తెలుగులో ఇలాంటి విభిన్న కథా చిత్రంలో నటించే అవకాశం రావడాన్ని అదృష్టం భావిస్తున్నా అని చెప్పారు.
దర్శకుడు విరాట్ చక్రవర్తి మాట్లాడుతూ, ఇది థ్రిల్లర్ కామెడీ కథా చిత్రం. పాత్రలకు తగ్గట్టు మంచి హీరో, హీరోయిన్లు కుదిరారు. జనవరి కల్లా సినిమాను పూర్తి చేస్తాం అని పేర్కొనగా, `ఇప్పటివరకు ఓ సంగీత దర్శకుడిగా నేను అందరికీ సుపరిచితమే. మొదటిసారిగా చిత్ర నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టి ఈ సినిమా చేస్తున్నా. ఓ సంగీత దర్శకుడిగా నన్నెంతో ఆదరించిన ప్రేక్షకులు ఇప్పుడు నిర్మాతగా కూడా ఆదరిస్తారన్న నమ్మకం ఉంది’ అనినిర్మాత సాయికార్తీక్ అన్నారు.
మరో నిర్మాత నాగం తిరుపతి రెడ్డి మాట్లాడుతూ, ఇప్పటివరకు మూడు సినిమాలు తీశాను. ఇకపై ప్రతీ ఏడాది రెండు సినిమాలు మా బేనర్లో నిర్మిస్తాం అని చెప్పారు. సహ నిర్మాత శ్రీకాంత్ దీపాల మాట్లాడుతూ, తెలుగు, కన్నడ భాషలలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నామని అన్నారు. ఈ చిత్రంలోని ఇతర పాత్రలలో శరత్లోహీతీశ్వర్, భద్రం, ఇంటూరి, వాసు, షకలక శేషు, అన్నపూర్ణమ్మ తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి ఛాయాగ్రహణాన్నిమార్గాల్, సంగీతాన్ని సాయికార్తీక్, ఎడిటింగ్ ను నాగేశ్వర్ రెడ్డి అందిస్తున్నారు.
Must Read ;- హైదరాబాద్ లో ఖరీదైన ఫ్లాట్ తీసుకున్న కన్నడ స్టార్ హీరో