గ్రేటర్ ఎన్నికల హీట్.. అసెంబ్లీ ఎన్నికలకు మించిపోయింది. సాధారణంగానే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో రాజకీయ పార్టీల మధ్య పోటీ తీవ్రంగానే ఉంటుంది. కానీ దుబ్బాక జోష్‌తో ఈ సారి ఈ ఎన్నికలపై బీజేపీ జాతీయ నాయకత్వం స్పెషల్ ఫోకస్ పెట్టడంతో దేశంలోని ఇతర రాజకీయ పార్టీల దృష్టిని ఈ ఎన్నికలు ఆకర్షిస్తున్నాయి. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ ఎప్పటి నుంచో పోటీ చేస్తూ వస్తోంది. గత ఎలక్షన్లకు, అంతకుముందు జరిగిన ఎన్నికలను ఒకసారి పరిశీలిస్తే దాదాపుగా స్థానికంగా ఉండే నేతలతోనే ప్రచారం నిర్వహించేవారు. కానీ ఇప్పుడు జరుగుతున్న ఎన్నికలు దానికి పూర్తి భిన్నంగా జరుగుతున్నాయనే చెప్పాలి.
గతంలో ఎన్నడూ లేని విధంగా జాతీయ నాయకత్వం మొత్తం హైదరాబాద్‌పైనే దృష్టి పెట్టారు. ఇందులో భాగంగానే భూపేంద్ర యాదవ్‌తోపాటు మరికొంత మంది జాతీయ నాయకులతో జీహెచ్ఎంసీ ఎన్నికల కమిటీని ఏర్పాటు చేశారు. అంతేకాకుండా కేంద్ర మంత్రులు ప్రకాశ్ జవదేకర్, స్మృతి ఇరానీ, మహారాష్ట్ర మాజీ సీఎం ఫడ్నవీస్, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, జేపీ నడ్డా, అమిత్‌షా, ప్రధాని నరేంద్రమోడీలను బీజేపీ రంగంలోకి దింపింది. ఇప్పటికే ప్రకాష్ జవదేకర్, స్మృతి ఇరానీ, ఫడ్నవీస్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఎన్నికల ప్రచారం సెకండ్ లిస్ట్‌లో జెపీ నడ్డా, అమిత్‌షా, యోగి ఆదిత్యనాథ్, ప్రధాని నరేంద్ర మోడి పేర్లు ఉన్నాయి. ఈ రోజు జెపీ నడ్డా హైదరబాద్‌కు రానున్నారు. పలు ప్రాంతాల్లో రోడ్ షోలో ఆయన పాల్గొననున్నారు.
Must Read ;- బీజేపీని గెలిపిస్తే ఎల్ఆర్ఎస్ రద్దు.. ఉచితంగా కరోనా వ్యాక్సిన్ పంపిణీ!
అలాగే రేపు పీఎం నరేంద్రమోడీ అధికారిక పర్యటనలో భాగంగా హైదరాబాద్‌కు వస్తున్నారు. ఆయన రాకకు కారణం వేరేదైనా జీహెచ్ఎంసీ ఎన్నికల్లో హీట్ పెంచేందుకే వ్యాక్సిన్ పేరుతో హైదరాబాద్‌కు వస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అలాగే ఆయన పర్యటన కూడా ఎన్నికలపై ఎంతో కొంత ప్రభావం చూపించే అవకాశం ఉంది. భారత్ బయోటెక్ సంస్థ తయారు చేస్తున్న కోవాగ్జిన్ వ్యాక్సిన్ పురోగతిని పరిశీలించేందుకు ప్రధాని స్వయంగా హైదరాబాద్‌కు రాబోతున్నారు. రేపు 3.40 గంటలకు ఆయన ప్రత్యేక విమానంలో హకీంపేటకు చేరుకుని భారత్ బయోటెక్ కార్యాలయానికి వెళ్లి అక్కడ వ్యాక్సిన్ అభివృద్ధి గురించి సైంటిస్టులను అడిగి తెలుసుకుంటారు. తిరిగి 5.40కి పూణెకు తిరిగి వెళ్తారు. అయితే హైదరాబాద్ ఎన్నికలకు పీఎంకు నేరుగా సంబంధం లేదు. కానీ ఆయన హైదరాబాద్ పర్యటనకు రాజకీయ ప్రాధానం ఏర్పడింది. నేపథ్యంలో పీఎం మాట్లాడే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది.
ఇక గ్రేటర్ ఎన్నిలక ప్రచార కార్యక్రమంలో భాగంగా రేపు ఎల్బీ స్టేడియంలో సీఎం కేసీఆర్ బహిరంగ సభలో పాల్గొంటున్నారు. మరోపక్క నరేంద్ర మోడీ సైతం అదే రోజు హైదరాబాద్‌కు వ్యాక్సిన్ పురోగతిని పరిశీలించడానికి వస్తున్నారు. దీంతో హైదరాబాద్‌లో పొలిటికల్ హీట్ కచ్చితంగా పెరగుతుందని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఒక పక్క సీఎం మరోపక్క పీఎం హైదరాబాద్ కేంద్రంగా వివిధ కార్యక్రమాల్లో పాల్గొనడం చర్చకు దారితీస్తోంది. ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని గ్రేటర్ ఓటర్లను ఉద్దేశించి పీఎం మోడీ మాట్లాడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
Alo Read ;- ఎన్టీఆర్, పీవీ సమాధులపై సంచలన వ్యాఖ్యలు చేసిన అక్బరుద్ధీన్ ఓవైసీ