తెలంగాణలో ఏదో జరుగుతోంది. చాపకింద నీరులా టీఆర్‌ఎస్‌లో ఆధిపత్య పోరు సాగుతోంది. ముఖ్యంగా రంగారెడ్డి జిల్లాలో ఈ వ్యవహారం ముదిరి పాకాన పడింది. మున్సిపల్ ఛైర్మన్‌లకు,ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎమ్మెల్సీల మధ్య చిచ్చు చిలికి చిలికి గాలివానలా మారుతోంది. నివురుగప్పిన నిప్పులా వ్యవహారం నడుస్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా టీఆర్ఎస్ ప్రజాప్రతినిధుల మధ్య గ్యాప్ పెరుగుతున్నట్టే కనిపిస్తోంది. ఏ రోజు ఏ మున్సిపాలిటీలో నిరసన గళం వినిపిస్తుందో తెలియక టీఆర్ఎస్ అధిష్టానం ఆందోళనలో ఉంది.
జవహర్‌నగర్‌లో మేయర్ VS మంత్రి..
తెలంగాణలో జవహర్‌నగర్ మున్సిపల్ కార్పొరేషన్‌కు ఎంతో ప్రత్యేకత ఉంది. మేడ్చల్ జిల్లాల్లో ఉన్న ఈ కార్పొరేషన్‌లో భూముల ధరలు భారీగా పెరిగాయి. దీంతో ప్రజాప్రతినిధుల మధ్య చిచ్చురేగుతోంది. భూ కబ్జాలకు పాల్పడుతున్న వారికి మంత్రి అండగా ఉంటున్నారని మేయర్ ఆరోపిస్తున్నారు. దీంతో అక్కడ మేయర్ వర్సస్ మంత్రిగా పరిస్థితి తయారైంది అంటున్నారు. కబ్జాలు చేస్తున్న వారి పక్షాన పోరాటం చేయాలంటూ మంత్రి ఒత్తిడి తెచ్చారని .. వారి పట్ల ఎలా పోరాటం చేస్తామంటూ మంత్రి ఆదేశాలను ఆయన దిక్కరిస్తున్నారు. దీంతో వీరి ఇద్దరి మధ్య గ్యాప్ పెరిగింది. ఈ విషయం ఇప్పుడు నివురుగప్పిన నిప్పులా ఉండి ఎప్పుడు ఏం జరుగుతుందో అన్న ఆందోళన కార్పోరేషన్‌లో ఉంది. మంత్రి ఒత్తిళ్ళు ఇలానే సాగితే రాబోయే రోజుల్లో కార్పోరేషన్ పాలక మండలిలో చీలికలు రావడం ఖాయం అంటున్నారు జవహర్ నగర్ టీఆర్ఎస్ నేతలు.
ఒక్కరోజే రెండు మున్సిపాలిటీల్లో తిరుగుబాట్లు..
ఇక రంగారెడ్డి జిల్లాలో రెండు మున్సిపాలిటీల్లో నేతలు.. కార్పోరేటర్లు తిరుగుబాటు చేశారు. నగర శివార్లలోని ఆదిభట్ల మున్సిపాలిటీలో ఏకంగా ఛైర్ పర్సనే పార్టీ కండువా మార్చుకున్నారు. మున్సిపాలిటీ అభివృద్ధి కార్యక్రమాల్లో అధికారులు, కార్పోరేటర్లు సహకరించడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. టీఆర్ఎస్ పార్టీ కూడా స్థానిక నేతలను కంట్రోల్ చేయడం లేదని ఆరోపిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ నుండి కౌన్సిలర్‌గా గెలిచిన కొత్తా హర్థిక టీఆర్ఎస్‌లో చేరి ఛైర్ పర్సన్ అయ్యారు. అప్పటి నుండి స్థానికంగా తనకు ఎవరూ సహకరించడం లేదని …. టీఆర్ఎస్ అధిష్టానం కూడా చూసీచూడనట్టు వ్యవహరించడం ఎంతవరకు సమంజసం అంటూ ఆమె ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సమక్షంలో ఆమె తిరిగి కాంగ్రెస్ గూటికి చేరుకున్నారు. దీంతో ఇక్కడ పాలక మండలి సంక్షోభంలో పడింది. ఛైర్ పర్సన్‌గా ఆమే కొనసాగుతారా… లేక అవిశ్వాసం పెట్టి కొత్తవారిని ఎన్నుకుంటారా అన్నది చూడాలి.

తాండూరులోనూ తప్పని సంక్షోభం..
రంగారెడ్డి జిల్లాలోని మరో మున్సిపాలిటీ తాండూరులో కూడా కార్పోరేటర్లు తిరుగు బాటు చేశారు. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ వర్గాల మధ్య గ్యాప్ పెరిగింది. కాంగ్రెస్ పార్టీ నుండి టీఆర్ఎస్‌లో చేరిన పైలెట్ రోహిత్ రెడ్డి వర్గం వారు ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి వర్గీయులు పరస్పరం భౌతిక దాడులకు దిగారు. దీంతో మహేందర్‌రెడ్డి, రోహిత్‌రెడ్డి వర్గాలుగా పాలక మండలి చీలిపోయింది. ఈ మున్సిపాలిటీ పాలక మండలిలో ఎప్పుడు ఏం జరుగుతుందో అన్న ఆందోళన టీఆర్ఎస్ పార్టీ అధిష్టానంలో మొదలైనట్టు చెబుతున్నారు. మొత్తానికి మున్సిపాలిటీల్లో జరుగుతున్న ఆధిపత్య పోరు ఎటువైపు దారితీస్తుంది… పాలక మండల్లు కూలిపోయే పరిస్థితి వస్తుందా.. ఈ చీలికలను ఎలా ఆపాలన్న దానిపై అధిష్టానం మల్లగుల్లాలు పడుతున్నట్టు తెలుస్తోంది.
Must Read ;- సీక్రేట్లన్నీ బయటకు వస్తున్నాయ్.. పార్టీలకు కోవర్టుల తలనొప్పి











