ఉమ్మడి రాష్ట్రంలో తన తండ్రి హయాంలో కుదిరిన ఓ ఇప్పందం.. ఇప్పుడు ఏపీ సీఎం జగన్‌ను బాగా ఇబ్బంది పెట్టేస్తోంది. ఆ ఇబ్బందిని పరిష్కరించే నిమిత్తం ఏడాది క్రితమే ఓ కమిటీని ఏర్పాటు చేసిన జగన్.. అధికారులతో కూడిన ఆ కమిటీలో మధ్యప్రాశ్చంలో ఏపీ ప్రభుత్వ ప్రతినిధిగా ఉన్న జుల్ఫీ రావ్జీని అదనంగా చేర్చింది. అయితే జుల్ఫీతో కూడా పని కావట్లేదని భావించిన జగన్.. తాజాగా జుల్ఫీకి సహకరించే బాధ్యతలను కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్‌కు అప్పగించారు. అంటే.. నేరుగా ఈ కమిటీలో సభ్యుడిగా చేర్చకున్నా.. జుల్ఫీకి సహాయకుడి హోదాలో హఫీజ్ కు ఆ కమిటీలో పదవి దక్కినట్టేనని చెప్పాలి. ఇది జరిగి కూడా ఆరు నెలలు కావస్తోంది. అయినా వివాదం ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్టుగా ఉంది. మరోవైపు రాకియా తన పరిహారం కోసం ఏపి సర్కారును ఏకంగా ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్‌కు లాగేస్తోంది.
రూ.600 కోట్లు కక్కాలట
బాక్సైట్ తవ్వకాలకు సంబంధించి రస్ ఆల్ ఖైమాతో ప్రముఖ పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ ప్రసాద్ కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం ఆ సంస్థ నిమ్మగడ్డ కంపెనీల్లో భారీగానే పెట్టుబడులు పెట్టింది. అయితే ఆ సంస్థతో కుదిరిన ఒప్పందం మేరకు పనులు జరగకపోగా.. నిమ్మగడ్డ మాత్రం ఆ సంస్థకు చెందిన నిధులను జగన్ కంపెనీల్లో పెట్టేశారు. లాభాలు కూడా ఆర్జించుకున్నారు. ఈ తంతు మొత్తం పూర్తయ్యేదాకా రస్ ఆల్ ఖైమాకు ఈ విషయమే తెలియలేదు. అయినా పరాయి దేశంలో ఏం జరిగితే తనకు ఎందుకు? తాను పెట్టిన పెట్టుబడి, ఒప్పందం మేరకు పనులు జరగాలి. అంతో ఇంతో ఆదాయం రావాలి. తన పేరు మరింతగా మారు మోగాలి, ఇదీ రస్ ఆల్ ఖైమా భావన. అయితే తన కల నెరవేరకపోగా.. తన నిధులు పక్కదారి పట్టిన వైనంపై ఆ సంస్థ లండన్ లోని ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ ను ఆశ్రయించింది. ఏపీ ప్రభుత్వం, నిమ్మగడ్డ తనను ఎలా మోసగించింది పూసగుచ్చినట్టు వివరించింది. ఆర్బిట్రేషన్ కేంద్రం కూడా ఈ వివాదాన్ని త్వరితగతిన పరిష్కరించేందుకే పూనుకుంది. రస్ ఆల్ ఖైమా వాదన కరెక్టేనని దాదాపుగా తేలిపోయిన నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం ఆ సంస్థకు ఏకంగా రూ.600 కోట్ల మేర పరిహారం చెల్లించాల్సి ఉంది. ఈ వివాదాన్ని సామరస్యంగా పరిష్కరించుకునే నిమిత్తం జగన్ సర్కారు ఏర్పాటు చేసిన కమిటీ త్వరలో లండన్ వెళ్లనుంది. ఆ కమిటీతో పాటు జుల్ఫీ సహాయకుడి హోదాలో హఫీజ్ ఖాన్ కూడా లండన్ ఫ్లైట్ ఎక్కనున్నారు.
సంధి కుదిరిస్తే..
ఇప్పుడు అధికారులతో కూడిన కమిటీ అయినా. దానిలో కొత్తగా సభ్యుడిగా చేరిన జుల్ఫీ రావ్జీ అయినా, ఆయనకు సహాయకుడిగా కొత్త బాధ్యతలు చేపట్టిన ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ అయినా.. అందరి బాధ్యత రస్ ఆల్ ఖైమాతో సంధి కుదర్చడమే. ప్రభుత్వం నుంచి రూ.600 కోట్ల పరిహారం కట్టకుండా చూడటమే. ఈ పరిహారం నిధుల విలువ అంత పెద్దదేమీ కాకున్నా.. పరిహారం కడితే ప్రభుత్వం పరువు పోతుంది. ఇదే జగన్ బాగా ఇబ్బంది పెడుతోంది. అందుకే.. మొదట కమిటీ అన్నారు, ఆ తర్వాత జుల్ఫీ రావ్జీ అన్నారు, ఆ తర్వాత ఇప్పుడు హఫీజ్ ఖాన్ కూడా అంటున్నారు. కమిటీ, జుల్ఫీలతో పని కాలేదు కాబట్టే.. కొత్తగా హఫీజ్ ఖాన్ కు ఈ బాధ్యతలు దఖలు పడ్డాయి. ఎవరితో కాని పనిని హఫీజ్ గనుక చేసుకుని వస్తే.. ఆయనకు మంత్రి పదవి మాత్రం గ్యారెంటీ. రాజకీయాల్లోకి రాక ముందు విదేశాల్లో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా, సాఫ్ట్ వేర్ కంపెనీల ఓనర్‌గా, గల్ఫ్ కంట్రీస్ లో పెద్ద ఎత్తున పెట్టుబడులు, కంపెనీలు కలిగిన వాడిగా హఫీజ్ కు మంచి పేరే ఉంది. ఆ పరపతిని వాడుకుని పరిహారం కట్టకుండా రస్ ఆల్ ఖైమాను ఒప్పిస్తే గనుక హఫీజ్ ఖాన్ కు వద్దన్నా కూడా జగన్ కేబినెట్ పోస్టు ఇచ్చేస్తారన్న వాదనలు వైసీపీ సర్కిల్స్ లో జోరుగా వినిపిస్తున్నాయి.
Must Read ;- జగన్‌కు ఇంకో అడ్వైజర్ రెడీ











