హెటిరో ఫార్మా పేరు తెలియని తెలుగు వారు ఉండరేమో. ఫార్మా రంగంలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ఈ కంపెనీ.. రిట్రా వైరల్ డ్రగ్స్ ఉత్పత్తిలో ప్రపంచంలోనే అగ్రగామి సంస్థగా ఎదిగింది. ఈ కంపెనీ అధినేత బండి పార్థసారధి రెడ్డి.. ఏపీ సీఎం జగన్‌పై దాఖలైన ఆదాయానికి మించిన ఆస్తుల కేసుల్లో నిందితుడు కూడా. జగన్ తన తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని చేతివాటం ప్రదర్శిస్తే.. చాలా మంది పారిశ్రామికవేత్తల మాదిరే జగన్‌కు లంచాలు ముట్టజెప్పి తన కంపెనీకి అనుకూలంగా ప్రభుత్వం నుంచి ఆయాచిత లబ్ధి పొందారన్నది పార్థసారధి రెడ్డిపై ఉన్న ప్రధాన ఆరోపణ. జగన్‌తో ఈ తరహా సంబంధాలతో బుక్ అయిపోయిన పార్థసారధి రెడ్డికి.. వైసీపీ ప్రధాన కార్యదర్శి, ఆ పార్టీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డికి మరింత సన్నిహితుడని పేరుంది. ఈ క్రమంలోనే నాడు వైఎస్సార్ జమానాలో అయినా, ఇప్పుడు జగన్ జమానాలో అయినా పార్థసారధి రెడ్డి అడిగిందే తడవుగా అన్నీ ఆయనకు అనుకూలంగానే జరిగిపోతున్నాయి. ఇటీవలే విశాఖ పరిధిలోని హెటిరో ప్లాంట్‌కు జగన్ సర్కారు ఇటీవలే 83 ఎకరాలను క్రమబద్ధీకరించిందన్న ఆరోపణలు లేకపోలేదు.
తెల్లారగట్లే ఐటీ రెయిడ్స్
అయినా పార్థసారధి రెడ్డి గురించిన ప్రస్తావన ఇప్పుడు ఎందుకంటే.. ఆయన కంపెనీ అయిన హెటిరోపై బుధవారం తెల్లారగట్లే ఆదాయపన్ను శాఖ అధికారులు దాడులు మొదలెట్టేశారు. తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో ఉన్న హెటిరో ప్లాంట్లతో పాటుగా కంపెనీ డైరెక్టర్లు, సీఈఓ నివాసాలపైనా ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారట. కంపెనీ చైర్మన్ హోదాలో ఉన్న పార్ధసారధి రెడ్డి ఇంటిపైనా దాడులు జరుగుతున్నాయో, లేదో తెలియదు గానీ.. కంపెనీకి సంబంధించిన అన్ని విభాగాల్లో సోదాలు అయితే ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ దాడులు ఏ కారణం చేత జరుగుతున్నాయన్న అంశంపైనా క్లారిటీ లేదనే చెప్పాలి. సాధారణంగా ఐటీ దాడులు జరుగుతున్నాయంటే.. ప్రభుత్వానికి కట్టాల్సిన పన్నును ఎగ్గొట్టడమో, లేదంటే ఆదాయాన్ని అక్రమ మార్గాల్లో తరలిస్తున్నారన్న కోణంలో ఆదాయపన్ను శాఖకు సమాచారం అందినట్టే కదా. ఇటీవలే వైసీపీ రాజ్యసభ సభ్యుడు ఆళ్ల అయోధ్యరామిరెడ్డి నేతృత్వంలోని రాంకీ సంస్థలపైనా జరిగిన ఐటీ దాడుల్లో ఆ సంస్థ గుట్టు రట్టు అయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇప్పుడు హెటిరోపైనా దాడులు జరుగుతున్నాయంటే.. పార్ధసారధి రెడ్డి గుట్టు ఏ మేర రట్టు అవుతుందో చూడాలి.
టీటీడీ సభ్యుడిగా రెన్యూవల్
హెటిరో ఫార్మా వ్యవహారాల్లో ఫుల్ బిజీగా ఉండే పార్థసారధి రెడ్డి.. వైసీపీతో అత్యంత సన్నిహిత సంబంధాలు నెరపుతున్నారు. తన కంపెనీ తరఫున సీఎస్ఆర్ నిధులతో తనవంతుగా అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్న పార్థసారధి రెడ్డి పెద్దగా బయట కనిపించరు. అయితే అటు జగన్ తో పాటు ఇటు సాయిరెడ్డితోనూ ఆయన సన్నిహితంగానే మెలగుతారన్న వాదనలు ఉన్నాయి. ఈ క్రమంలోనే జగన్ ఏపీ సీఎం కాగానే.. జగన్ బాబాయి వైవీ సుబ్బారెడ్డి నేతృత్వంలో ఏర్పాటైన టీటీడీ పాలకమండలిలో సభ్యుడిగా పార్థసారధి రెడ్డి పదవిని దక్కించుకున్నారు. తాజాగా టీటీడీ పాలక మండలిని జగన్ రీషఫిల్ చేసినా.. బాబాయి వైవీ మాదిరిగానే.. పార్ధసారధి రెడ్డికి కూడా రెన్యూవల్ దక్కింది. ఇలా టీటీడీ సభ్యుడిగా రెన్యూవల్ దక్కించుకున్న అతి కొద్దిమందిలో హెటిరో చైర్మన్ ఒకరు. ఇన్ని ఈక్వేషన్ల నేపథ్యంలో హెటిరోపై ఐటీ దాడులు అనగానే.. ఆ వార్త వైరల్ గా మారిపోయింది.
Must Read ;- ఆ ఇద్దరి ఎంట్రీతో సాయిరెడ్డికి కత్తెర