మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికలకు ఇంకా నాలుగు రోజులే సమయం ఉంది. ఈ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారన్నది పెద్ద చర్చనీయాంశమైంది.
ఇరువర్గాలూ ఒకరి మీద ఒకరు బురద జల్లుకునే ప్రయత్నాలు జోరుగా సాగుతున్నాయి. ఈసారి ఎన్నికలు రెండు సామాజిక వర్గాల పోరుగా కనిపిస్తోంది. ముఖ్యంగా ఇది సినిమా పెద్దను నిర్ణయించే పోరుగా కూడా చెప్పవచ్చు. తెరమీద పాత్రధారులు మంచు విష్ణు, ప్రకాష్ రాజ్ కనిపిస్తున్నా తెరవెనుక పాత్రధారులు మాత్రం మెగాస్టార్ చిరంజీవి, మోహన్ బాబు అనేది అందరికీ తెలుసు. ఈ ఇద్దరూ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. సినిమా రంగంలో మెగాస్టార్ పెద్దరికానికి చెక్ చెప్పాలన్నది ప్రత్యర్థుల ఉద్దేశంగా కనిపిస్తోంది.
మెగా కుటుంబంలో దాదాపు 10 మంది హీరోలు ఉన్నారు. అందువల్ల ఇక్కడ మెగా ఆధిపత్యం ఉందన్నది జగమెరిగిన సత్యం. ఈ ఆధిపత్యానికి బ్రేక్ వేయాలనేది కూడా ప్రత్యర్థుల ఉద్దేశం కావచ్చు. ముఖ్యంగా సామాజిక సమీకరణలు ఈ ఎన్నికల్లో కీలక పాత్ర వహిస్తున్నాయి. నందమూరి ఫ్యామిలీకి దగ్గరయ్యేందుకు మంచు విష్ణు ప్రయత్నాలు చేశారు. అందులో భాగంగా నందమూరి బాలకృష్ణను కలిసి మద్దతు కోరారు. ఇక మిగిలింది జూనియర్ ఎన్టీఆర్. ఈ విషయంలో జూనియర్ ఎన్టీఆర్ నుంచి మాత్రం ఎలాంటి స్పందనా లేదు.
రెండు ప్యానల్స్ వారూ ఎన్టీఆర్ మద్దతు కోరేందుకు ప్రయత్నించారు. తాను మాత్రం ఎన్నికలకు దూరంగా ఉంటానని ఎన్టీఆర్ స్పష్టం చేసినట్టు తెలిసింది. ఎన్టీఆర్ మాత్రమే కాదు నందమూరి కళ్యాణ్ రామ్ కూడా అదే నిర్ణయంతో ఉన్నట్లు సమాచారం. మహేష్ బాబు మాత్రం ఎటూ చెప్పలేదు. అసలు పెద్ద హీరోలెవరూ ఈ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకోవడం లేదు. మెగా ఫ్యామిలీ సభ్యులు, అక్కినేని వారసులు మాత్రం ఓటు వేస్తున్నారు. సూపర్ స్టార్ కృష్ణ, కృష్ణంరాజుల మద్దతును మంచు విష్ణు కోరారు.
మా మాజీ అధ్యక్షుడు నరేష్ మాత్రం మంచు విష్ణు వైపే ఉండి ప్రచారం చేస్తున్నారు. సాధారణంగా ఈ ఎన్నికల్లో 900 మంది సభ్యులుంటే వారిలో 500 మంది మాత్రమే ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఈసారి దాదాపు 600 మంది సభ్యులు తమ ఓటు హక్కును వినియోగించుకోవచ్చన్నది అంచనా. నటుడు ప్రకాష్ రాజ్ మీద నాన్ లోకల్ అనే ముద్ర వేసి ప్రత్యర్థులు ప్రచారం సాగిస్తున్నారు. దర్శకరత్న దాసరి నారాయణ రావు తర్వాత సినిమా రంగానికి పెద్ద దిక్కు అంటూ ఎవరూ లేరు.
ప్రస్తుతం సినిమా రంగానికి ఎలాంటి సమస్య వచ్చినా మెగాస్టార్ చిరంజీవి స్పందిస్తూ వస్తున్నారు. దాంతో ఆయన మీద ఈ పెద్ద దిక్కు ముద్ర పడింది. ఆయన పెద్దరికాన్ని మరో వర్గం అంగీకరించడంలేదు. దానికి చెక్ చెప్పాలంటే ఆయన మద్దతు ఇస్తున్న ప్రకాష్ రాజ్ నూ, ఆయన ప్యానల్ నూ ఓడించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ విషయంలో మంచు విష్ణు చాలా వరకు ముందుకు వెళ్లినట్టుగానే స్పష్టమవుతోంది. ప్రకాష్ రాజ్ వర్గం కూడా దూకుడు పెంచకపోతే వెనకబడిపోయే ప్రమాదం పొంచి ఉంది.
ఇక్కడ మ్యానిఫెస్టోలు కీలకం కాదు. పెద్దరికం అనే అంశం మీద పంతాలు పట్టింపులు కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఈ రెండు మూడు రోజుల్లో మెగా కాంపౌండ్ కూడా దూకుడు పెంచకపోతే ప్రకాష్ రాజ్ వెనకబడిపోయే ప్రమాదం ఉంది. తెరవెనుక మంత్రాంగం నిర్వహించడంలో మోహన్ బాబు అండ్ కో సఫలీకృతమవుతున్నట్లు సమాచారం అందుతోంది. మిగతా ప్యానల్ సభ్యుల గెలుపు మాట ఎలా ఉన్నా ప్రకాష్ రాజ్ గెలుపు విషయంలో మాత్రం ఇంకాస్త ముందుకు వెళ్లాల్సిన అవసరం కనిపిస్తోంది.
Must Read ;- ప్రకాష్ రాజ్ వైపు బండ్ల.. సభ్యులపై ‘ఓటు’ ఒత్తిడి











