(విజయనగరం నుండి లియో న్యూస్ ప్రతినిధి)
ఆంధ్రప్రదేశ్‌లో చిట్ట చివర ఒరిస్సా సరిహద్దుల్లో ఒక సాధారణ రైతు కుటుంబంలో జన్మించాడు ఆ యువకుడు. వారికి ఉన్న కొద్దిపాటి పొలంలో ఆరుగాలం శ్రమించి వ్యవసాయం చేసిన తల్లిదండ్రులు ఆ కుర్రోడును చదివించారు. తన కోసం తండ్రి పడుతున్న తపన.. వారి కష్టాలను చిన్నప్పటి నుంచి కళ్లారా చూశాడు ఆ యువకుడు.. కుటుంబ పరిస్థితులు అతడిలో కసిని పెంచాయి. బాగా చదివి పది మందికి సాయం చేసే ఉద్యోగం పొందాలని, తల్లిదండ్రుల కళ్లల్లో ఆనందం చూడాలని చిన్నతనంలోనే అనుకున్నాడు. క్రమశిక్షణ.. అంతకు మించి నిబద్ధతతో చదివాడు. అవసరమైన వేళలో తండ్రికి సాయంగా నాగలి పట్టి దుక్కి దున్నాడు. సివిల్స్ పై దృష్టి సారించి గ్రూప్స్‌లో విజేతగా నిలిచారు.. ప్రొద్దుటూరు డీఎస్పీగా బాధ్యతలు చేపట్టారు.. ఏగిరెడ్డి ప్రసాదరావు. ఒకనాటి కర్షకుడు .. నేడు పోలీస్‌గా మారడం పట్ల స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
రైతు కుటుంబం నుంచి..
విజయనగరం జిల్లా పార్వతీపురం సమీపంలోని గుణానుపురం ప్రసాదరావు స్వగ్రామం. ఆయన తల్లిదండ్రులు మహాలక్ష్మి, సత్యంనాయుడు. వారికి ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు శంకరరావు ఎంబీబీఎస్ పూర్తి చేశారు. ప్రస్తుతం సివిల్స్‌కు ప్రిపేర్ అవుతున్నారు. రెండో కుమారుడు ప్రసాదరావు. వీరికి వారి స్వగ్రామంలో ఆరు ఎకరాల పొలం ఉంది. వ్యవసాయమే జీవనాధారం. కొద్దిపాటి పొలంలో వ్యవసాయం చేస్తూ తల్లిదండ్రులు వీరిద్దరినీ చదివించారు. నాన్నతో పాటు వీరు పొలం పనులు చేసేవారు.
Must Read ;- చంద్రబాబును బూతులు తిడితే జగన్‌కు కోపం వచ్చింది!
ప్రభుత్వ పాఠశాలలోనే ..
ప్రసాదరావు పదో తరగతి వరకు తన స్వగ్రామమైన గుణానుపురంలోని ప్రభుత్వ పాఠశాలలోనే చదివారు. అనంతరం విజయవాడలోని గౌతమ్ కాలేజీలో ఇంటర్ పూర్తి చేశారు. గౌహతిలోని ఐఐటీలో డిగ్రీ చదివారు. తర్వాత హైదరాబాద్‌లో సివిల్స్ కోచింగ్ తీసుకున్నారు. గ్రూప్స్‌లో మంచి ర్యాంక్ రావడంతో తనకు ఇష్టమైన పోలీసు శాఖలో చేరారు. 2018 బ్యాచ్‌లో డీఎస్పీగా ఎంపికై అనంతపురంలోని పీటీసీలో శిక్షణ పొందారు. ప్రాక్టికల్ ట్రైనింగ్ పూర్తికాగా వైఎస్సార్ కడప జిల్లాలోనే చేశారు. రాయచోటి, రైల్వేకోడూరు, పోరుమామిళ్ల, పులివెందులలో ట్రైనీ డీఎస్పీగా విధులు నిర్వర్తించారు. ప్రస్తుతం ప్రొద్దుటూరు డీఎస్పీగా బాధ్యతలు చేపట్టారు.
చట్టపరిధికి లోబడి ..
తాను చట్టపరిధికి లోబడే పనిచేస్తానని ప్రసాదరావు చెప్పారు. పోలీసులు దురుసుగా ప్రవర్తిస్తారనే భావన చాలా మందిలో ఉందని, అలాంటి ఆలోచనలు పక్కన పెట్టాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు. ఎలాంటి సమస్య వచ్చినా నేరుగా పోలీస్ స్టేషన్‌కు వచ్చి చెప్పుకోవచ్చన్నారు. నిష్పక్షపాతంగా విచారణ చేసి న్యాయం చేస్తామని తెలిపారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ తమ విధానమని, ప్రజల కోసమే పోలీసులున్నారని అన్నారు. సబ్ డివిజన్‌లోని అన్ని గ్రామాలు తిరిగి స్వయంగా సమస్యలు తెలుసుకుంటానని, వాటి పరిష్కారానికి కృషి చేస్తానని మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రసాదరావు పేర్కొన్నారు.
ఇటువంటి వ్యక్తుల ద్వారానైనా పోలీసు వ్యవస్థపై ప్రజలకు మంచి అభిప్రాయం కలగాలని.. బాధితులకు న్యాయం జరగాలని ఆశిద్దాం.