దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు తీసిన అనేక క్లాసిక్స్ లో ‘పెళ్లి సందడి’ ఒకటి. 1996లో రిలీజ్ అయిన ఈ సినిమా అప్పట్లో బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసింది. కీరవాణి అందించిన పాటలు కూడా మంచి క్రేజ్ ను సంపాదించుకున్నాయి. శ్రీకాంత్, దీప్తి భట్నాగర్, రవళి నాయికా నాయకులుగా నటించారు. ఇంతకాలం తర్వాత టాలీవుడ్ లో మళ్ళీ ‘పెళ్లి సందడి’ మొదలవబోతోంది. అయితే టైటిల్ పేరు కొంచెం మార్చి రాఘవేంద్రరావు ‘పెళ్లి సందD’ అనే టైటిల్ తో సినిమా చేయనున్నారు. ఇందులో శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా ఫైనల్ అయ్యాడు. హీరోయిన్ గా మొదట శ్రీదేవి కూతురు జహాన్వి కపూర్ ను తీసుకుందామని రాఘవేంద్రరావు భావించారు. కానీ ఫైనల్ గా ఈ సినిమాకు హీరోయిన్ గా ‘కళ్యాణ వైభోగమే’ ఫెమ్ మాళవిక నాయర్ ను ఖాయం చేశారట.
అయితే ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే రాఘవేంద్రరావు ఈ సినిమాకు దర్శకత్వం వహించడం లేదు. దర్శకత్వ పర్యవేక్షణ మాత్రమే చేస్తారు. అందుకే ఈ సినిమాకు సరైన దర్శకుడి కోసం ఆయన కొంతమంది పేర్లను పరిశీలిస్తున్నారు. అందులో ముఖ్యంగా 2012లో రిలీజ్ అయిన ‘మిథునం లాంటి గొప్ప సినిమాకు దర్శకత్వం వహించిన తనికెళ్ళ భరణికి దర్శకత్వ బాధ్యతలు అప్పగించే ఆలోచనలో రాఘవేంద్రరావు ఉన్నారని సమాచారం. తనికెళ్ళ భరణి నటుడిగానే కాకుండా ఎంత గొప్ప రచయితో మనకు తెలుసు. ఇప్పటికే ఆయన అనేక సినిమాలకు రచయితగా పని చేసారు.
ఇప్పటికే రాఘవేంద్రావు, తనికెళ్ళ భరణికి దర్శకత్వం బాధ్యతలు ఇచ్చే విషయంలో ఒక అభిప్రాయానికి వచ్చేశారని టాలీవుడ్ టాక్. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. అతిత్వరలోనే దర్శకుడిగా భరణి విషయంపై ఒక క్లారిటీ రానున్నదని తెలుస్తోంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే వచ్చే ఏడాది సంక్రాంతి తర్వాత ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనున్నదని టాక్. మరి ఈ వార్తలో నిజమెంత ఉందో తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.
Must Read ;- సంక్రాంతి కంటే ముందుగానే రిలీజ్ కానున్న ;రంగ్ దే;?