తెలంగాణ రాజకీయాలకు సంబంధించి, మతానికి ముడిపెట్టి మాట్లాడే మాటలకు సంబంధించి.. ఇటీవలికాలంలో రెచ్చగొట్టే ప్రకటనలు చేసేది ఎవరు? అంటే.. సాధారణంగా మజ్లిస్ యువరాజు అక్బరుద్దీన్ పేరు మనకు ఎక్కువగా వినిపిస్తుంటుంది. అంతో ఇంతో ఎమ్మెల్యే రాజాసింగ్ కూడా అలాంటి రెచ్చగొట్టే మాటలకు పేరుపడ్డారు. కానీ రోజులు మారుతున్నాయి. మేమేం తక్కువ తినలేదు. రెచ్చగొట్టడం ద్వారా మాత్రమే.. ఉద్రిక్తతలను పెంచి పోషించడం ద్వారా మాత్రమే.. రాజకీయంగా స్థిరపడాలనుకుంటున్నాం అనే ధోరణిలోకి భారతీయ జనతా పార్టీ వస్తోంది. ప్రత్యేకించి బండి సంజయ్ రాష్ట్ర బీజేపీ సారథి అయిన తర్వాత.. ఈ పోకడలు మరింత పెరిగాయి. చిన్న సందు దొరికితే చాలు.. దాన్ని పెద్ద రాద్ధాంతంగా మార్చేయడానికి.. హిందూత్వానికి మతానికి ముడిపెట్టి లబ్ధ పొందడానికి వారికి బోలెడు అవకాశాలు కనిస్తుంటాయి. వాటిని చాలా చక్కగా సద్వినియోగం చేసుకుంటున్నారు. అలాంటి దృష్టాంతాలు మనకు అనేకం.
ఇప్పుడు మళ్లీ అదేపనిలో పడ్డట్టుగా కనిపిస్తోంది. జీహెచ్ఎంసీ ఎన్నికల సమయంలోనే హైదరాబాదు నగరంలో ఉద్రిక్తతల్ని రెచ్చగొట్టే తరహా ప్రకటనలు చేయడం ద్వారా రాజకీయ లబ్ధి ఉంటుందని భావించిన బండి సంజయ్ .. అందుకు చార్మినార్ ఏరియాలోని భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయాన్ని కూడా ఒక పావుగా వాడుకున్నారు. ఎన్నికలు పూర్తయిన తర్వాత కూడా అదే ఉద్వేగాలను ఆయన మళ్లీ వాడుకుంటున్నారు. గెలిచిన బీజేపీ కార్పొరేటర్లు అందరితో కలిసి భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం వద్దకు వెళ్లి అక్కడ పూజలు నిర్వహించే కార్యక్రమాన్ని శుక్రవారం నాటికి షెడ్యూలు చేసుకున్నారు.
బిజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తదితరులు చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి దేవాలయానికి శుక్రవారం ఉదయం వచ్చిన సందర్భంగా అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. జిహెచ్ఎంసి ఎన్నికల్లో గెలిచిన కార్పొరేటర్లతో కలిసి అమ్మవారి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించడానికి బండి సంజయ్ తో పాటు కార్పొరేటర్లు బీజేపీ కార్యకర్తలు అందరూ అక్కడకు చేరుకున్నారు.
శుక్రవారం మక్కా మసీదులో ప్రార్థనలు కావడంతో, ఆపక్కనే బీజేపీ వారు ఈ పూజల కార్యక్రమం పెట్టుకోవడంతో పోలీసులు గట్టి పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. మక్కా మసీద్ గుల్జార్ హౌస్ శాలిబండ మీర్ చౌక్ పరిసర ప్రాంతాల్లో పోలీసుల భద్రత చర్యలు చేపట్టారు.
కార్పొరేటర్ల ఎన్నిక పూర్తయి చాలా రోజులు అయింది. ఇన్ని రోజులుగా భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయంలో పూజలు నిర్వహించడానికి బండి సంజయ్ కు ఖాళీ దొరకలేదా? ముస్లింలు ప్రార్ధనలు చేసుకునే శుక్రవారం రోజునే ఆయనకు ముహూర్తం కుదిరిందా? తద్వారా.. ఉద్రిక్త వాతావరణం ఏర్పడడమే తన లక్ష్యమని బండి సంజయ్ చాటిచెప్పదలచుకున్నారు. ఉద్రక్తతలు, ఉద్వేగాల పునాదుల్లోంచి… ఆయన తెలంగాణ బీజేపీని బలోపేతం చేయదలచుకున్నారా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
Must Read ;- గ్రేటర్ ఉత్సాహం.. తెలంగాణలో విస్తరణకు బీజేపీ ప్లాన్