అడుగు వేస్తే ఆరంభం మొదలు.. ఆలోచిస్తూ ఉంటే ఆటంకం ఎదురు.. అని ప్రతీ సినిమా ఆఫీస్ చుట్టూ అసిస్టెండ్ డైరెక్టర్‌గా జాయిన్ అవ్వడం కోసం తిరగడం మొదలుపెట్టిన రోజులవి.
ఏమీ తెలియకుండా, ఎక్కడకు వెళ్లాలో తెలియకుండా వెళ్తున్న ప్రయాణానికి పరిచయాలు ఒక్కటే మార్గం అని తెలిసేలా చేశాయి సినిమా ఆఫీస్ ముందు నుంచి గెంటేసినవాళ్లు. అవకాశం కోసం ఎదురు చూస్తున్నా, ఆ రోజు నన్ను గెంటేసింది నువ్వేనని, ఈ స్థాయికి వచ్చింది నీ వల్లేనని చెప్పడానికి. ఎప్పుడో చిన్నప్పుడు సినిమాలపై ప్రభావం ఎక్కడ మొదలైందో తెలీదు, ఎలా మొదలైందో తెలీదు, ఏం చేస్తామో, ఏం సాధిస్తామో తెలీదు. కానీ నాతో ఉన్నవాళ్లు నన్ను నమ్మినంతగా నన్ను నేను నమ్ముకోలేదోమో అనిపిస్తుంది ఇన్నాళ్లు. కళ్ల ముందు కాలం ప్రయాణం చాలా స్పీడ్‌గా వెళ్తుంటే, నా జీవితం కరిగిపోతుందనిపిస్తుందేగానీ నా గమ్యాన్ని చేరలేనేమో అనే భయం వేస్తుంది.
దారుల కోసం వెతకడం మొదలు పెట్టినా దూరం దారికి పెరిగిందే తప్ప, దరికి చేరే మార్గం మాత్రం దొరకలేదు. ఎప్పుడో 20ఏళ్ల వయస్సులో సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టి, ఆకలి, దప్పిక అంటే ఏంటో తెలియనంతగా కాలాన్ని వృధా చేశా. పార్టీలు చేసుకోవడం కోసం ఫ్రెండ్స్‌ను పెంచుకున్నానే తప్ప, పనులు పెంచుకోవడం కోసం ఫ్రెండ్స్‌ను కలుపుకోలేదు. పెరుగుతున్న వయస్సే ఒక్కొక్కటి సమాధానం చెప్తూ వచ్చింది. అప్పుడే సినిమా అవకాశాల కోసం గట్టిగా ప్రయత్నించమని గట్టిగా చెప్పింది. ఒక్కో అవకాశాన్ని అందిపుచ్చుకుంటూ ముందుకు వెళ్తూ ఒక్కో సినిమా చేస్తూ ఉన్నా, మనసులో ఏదో వెలితి. ఎక్కడికి వెళ్లినా సినిమా వాడు అంటే ఎప్పుడూ చులకనే.. ఎక్కడైనా పలచనే..
సినిమావాళ్ల గురించి తెలీక ఎదిగినవాడిని పొగుడుతారు.. చతికిలపడినవాడిని ఏం పీకావని అడుగుతారు.. ఈ రెండూ నేను సంపాదించుకున్నవి కాదు. కాలం నాకు ఇచ్చినవి. నిశ్చబ్ధం విలువ నీటి బుడగకు ఏం తెలుసు అనే విధంగా అనుకునేవాడిని ఒక్కొక్కరు ఒక్కొక్క మాట అంటుంటే. వయస్సు పెరిగే కొద్ది ఇంట్లో వాళ్లను డబ్బు పంపించమని అడగాలంటే మొహమాటం.. అడిగితే సిగ్గుండాలని అంటారు. అలా ఎన్నిసార్లు అన్నా.. మనసులో ఒక్కటే అనుకునేవాడిని ఒక్కఛాన్స్.. ఒకే ఒక్కఛాన్స్ అని ఖడ్గం సినిమాలో రవితేజ అనుకున్నట్లుగా. కానీ.. తర్వాత తర్వాత తెలిసింది ఏంటంటే.. కలలో ఫ్లైట్ టికెట్ లక్ష రూపాయలు పెట్టి కొని ఎక్కినా.. కళ్లు తెరిచి చూస్తే అది ఫ్రీగానే అనిపిస్తుంది.
Must Read ;- దర్శకేంద్రుడికే.. ఆ హీరోయిన్ నో చెప్పిందా.?
ఊరి నుంచి సినిమా ఇండస్ట్రీకి వచ్చి 8 ఏళ్లు అయినా ఏం సాధించకపోవడంతో ఇంట్లో వాళ్లకు సమాధానం చెప్పలేక, ఫ్రెండ్‌కు మొహాన్ని చూపలేక, అడిగినవాళ్లకు అద్దె మొహంలా చాటేయలేక దొంగలా దొరతనంతో తిరుగుతూ ఉన్నా. నాన్న ఫోన్ చేసి కాస్త డబ్బుంటే పంపరా.. ఇంట్లో పరిస్థితి బాలేదు.. అని అడుగుతాడేమోననే భయం.. ఫోన్ ఎత్తాలంటే. అమ్మ ఫోన్ చేసి ఆరోగ్యం బాలేదు ఆస్పత్రిలో చూపించుకోవాలని అంటుందేమోననే భయం ఫోన్ చూడాలంటే. భయాన్ని భ్రమగా భావించలేదు. ప్రేమను భయంగా మార్చుకున్నా ఇన్నాళ్లు. ఫోన్ ఎత్తిన ప్రతిసారీ నాన్న డబ్బులు లేకుంటే అడుగు పంపిస్తానని అనేవాడు.
అమ్మ ఫోన్ చేసి ఆరోగ్యం జాగ్రత్త అని చెబుతుండేది. ఇంతకన్నా ఏం చెప్పగలం అమ్మానాన్న అంటే. 28 ఏళ్లు వచ్చేసరికి పెళ్లి అనేది పిడుగులాంటి వార్తలా అనిపిస్తుంది డైరెక్టర్ అవ్వనివాడికి. అడిగినవాళ్లకు అమ్మానాన్న ఊళ్లో సమాధానం చెప్పలేక బాధపడతారు. డైరెక్టర్ అవ్వనివాడు ఏం సమాధానం చెబుతాడు. పెళ్లైతే చేసుకున్నా కానీ.. ప్రయాణం మాత్రం రెండు పడవలపైనే చేస్తున్నాననే అభిప్రాయం మనసులో తొలచివేస్తుండేది. పెళ్లయ్యాకే డైరెక్టర్ అవ్వాలనే తలంపు బలంగా నాటుకుంది. భయం ఇంతకింతకూ పెరిగింది. అదే ఏడాది భార్యను బరువుగా భావించా.. ఏ ఏటికాయేడు గడిచేలోగా బాధ్యతను గుర్తించా. నాకు పాప పుట్టాక. నా లక్ష్యాన్ని అలక్ష్యం చేయకూడదనే ఒంటరిగా సిటీకి ప్రయాణం కట్టా. పాప పుట్టాకే నా ఆశయాలు బాధ్యతలుగా మారిపోయాయి.
అప్పుడే భార్య – బిడ్డను ఒంటరిగా ఊళ్లోనే వదిలేసి ఏదో సాధించాలని అడుగుపెట్టా. కానీ అవకాశాల కోసం అడుగులు వేస్తున్నా.. అడ్డంకులు మాత్రం అవకాశాల కంటే ముందుగా ప్రత్యక్షమయ్యాయి. డైరెక్టర్ అయ్యే వరకు ఊరికి వెళ్లకూడదని నిర్ణయించుకుని ఇక్కడే ఉండిపోయా. ఇంట్లో వాళ్లతో సరిగా మాట్లాడలేక, చెప్పినమాటలే పదే పదే చెప్పలేక మదనపడిపోయా. పూట గడవడానికి డబ్బు సంపాదించానేగానీ.. ఇళ్లు గడవడానికి డబ్బు సంపాదించలేకపోయా. పెళ్లయ్యాక నాకన్నా ఎక్కువగా నన్ను నమ్మింది నా భార్యే. నాకు ధైర్యాన్ని ఇచ్చి నన్ను పోషించింది కూడా తానే. ఇంకా ఎన్నేళ్లని సినిమాని నమ్ముకుంటావని ఏనాడూ అడగలేదు.
సహనాన్ని కోల్పోలేదు. ఏళ్లు గడుస్తున్నాయి. అయినా ప్రయత్నాలు మానలేదు. పెళ్లై పదేళ్లు గడిచినా ఇంటికి వెళ్లి మొహం చూపించలేకపోయాను. ఏదైనా సాధించే ఇంటికి వెళ్లాలనే ఉన్నాను. కానీ.. అప్పుడే నాకు మరో పిడుగులాంటి వార్త వచ్చింది. అమ్మ రోగంతో కన్నుమూసింది. అమ్మ ఎప్పుడూ ఫోన్ చేసి నా ఆరోగ్యం ఎలా ఉందని అడిగేది కానీ.. తన ఆరోగ్యం ఎలా ఉందో మాత్రం తెలుసుకోలేకపోయా. ఆకాశమంత ఎత్తులో నన్ను చూడాలనుకున్న అమ్మకి.. ఆకలి కూడా తీర్చలేనంతగా దిగజారిపోయానని అప్పుడే అర్థమయ్యింది. అమ్మ పాదాలు పట్టుకుని క్షమించమని అడిగే అర్హత కూడా నాకు లేదు. పదేళ్ల తర్వాత ఊరికెళ్లి అమ్మని చూసి ఒక్కసారిగా కుప్పకూలిపోయా. అది దూరంగా ఉండి చూస్తున్న నా కూతురు నా భార్యతో ‘ఎవరమ్మా ఆ అంకుల్ అలా ఏడుస్తున్నాడు’ అని అడిగింది.
Also Read ;- ‘ఆచార్య’ లో చరణ్ హీరోయిన్ ఖాయమైందా?
నాన్నను అంకుల్ అనే స్థితికి తెచ్చుకున్నానంటే, ఇంతకంటే దౌర్భాగ్యం ఇంకేం ఉంటుంది. ఇంతకాలం కష్టపడ్డాం.. సినిమా ప్రపంచం ఇంకేదో చేస్తుంది అనే ఆశతో మళ్లీ ప్రయత్నాలు మొదలుపెట్టా. ఇంత జరిగినా సిగ్గులేదా అని అంటుంటే నా దగ్గర ఉన్న సమాధానం ఒక్కటే ఉండేది ‘తాగుడికి బానిసైనవాడు మానేయడానికి మందుంది.. సినిమాకు బానిసైనవాడికి మరణం ఉంది’ అని.. నేను సినిమాను విడిచిపెట్టడమంటూ జరిగితే అది మరణంతోనే అని చెప్పి సిటీకి బయల్దేరా. ఈసారి గట్టిగా కొట్టాలనే ఆలోచనతో ప్రయత్నాలు మొదలెట్టా. అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేయకూడదని, చేస్తే డైరెక్టర్‌గానే చేయాలని. అలా అందరికీ చెప్పుకుంటూ తిరిగా. పూట గడవడం కష్టమైంది.
కనీసం అసిస్టెంట్ డైరెక్టర్గానైనా అవకాశం అడుగుదాంటే, నీకేంటి రేపో మాపో డైరెక్టర్‌వి అయిపోతావు అని అవకాశం ఇచ్చేవాడు కరువయ్యాడు. వాళ్లు ఆ మాటన్నది నా టాలెంట్ చూసి కాదు.. నా వయస్సు చూసి. సినిమా ఆఫీస్‌ల చుట్టూ తిరిగి తిరిగి అలిసిపోయా. అవకాశాల కోసం వెళితే రికమండేషన్ కావాలి.. ష్యూరిటీ కావాలి.. ఏదైనా బ్యాక్‌గ్రౌండ్ ఉండాలి.. ఇవన్నీ అడుగుతారే తప్ప కథ ఎలా ఉండాలి అని చెప్పవాడే లేడు. సినిమా కథ రాస్తే వినేవాడు ఒకడు.. చేసేవాడు మరొకడు.. జడ్జిమెంట్ చేసేవాడు ఇంకొకడు.. ఎవడికి ఏ కథ ఎందుకు నచ్చుతుందో చెప్పలేం. ఏ కథ ఎందుకు హిట్టవుతుందో ఎవడూ చెప్పలేడు.
కానీ ప్రతీ ఒక్కరినీ జడ్జ్ చేస్తారు. అయినా ప్రయత్నం మాత్రం మానుకోలేదు. స్టోరీ పట్టుకుని ఒక్కో ఆఫీస్ చుట్టూ తిరుగుతుంటే నెట్టేసిన అనుభవాలే ఇప్పుడూ ఎదురవుతున్నాయి. ఆనాడు నా కన్నీళ్లు చెరువులను తలపిస్తే.. ఈనాడు సముద్రాలను తలపిస్తున్నాయి. హీరోకు నచ్చితే, నిర్మాతకు నచ్చదు. నిర్మాతకు నచ్చితే హీరోకు నచ్చదు. ఇద్దరికీ నచ్చితే వాళ్ల ఫ్యామిలీకి నచ్చదు. 48 ఏళ్లు వచ్చే సరికి నా జీవితం నాకు నచ్చలేదు. దాంతో ఆత్మహత్య చేసుకుందామని ప్రయత్నించా.. కానీ ఆగిపోయా. నేను ఊరి నుంచి వస్తుంటే నా కూతురు “నాన్నా థియేటర్లో మన సినిమా ఎప్పుడు చూపిస్తావ్” అనడిగింది. అప్పుడే గట్టిగా డిసైడ్ అయ్యా.. ఎలాగైనా సినిమా చేయాలని. నేను రాసుకున్న కథపై మరోసారి కలం సవరించా. ప్రయత్నాలు పోగేశా.
అలా ఒక సినిమా నిర్మాతకు కథ చెప్పా. ఆయనకు బాగా నచ్చింది కానీ, క్లైమాక్స్ మార్చమని చెప్పాడు. అప్పుడే ఊరి నుంచి నా భార్య ఫోన్. మళ్లీ ఏ వార్త వినాల్సి వస్తుందోనన్న భయం. అదే భయంతో ఫోన్ ఎత్తాక నా భార్య శుభవార్త చెప్పింది నా కూతురుకు పెళ్లి సంబంధం కుదిరిందని. అప్పుడే అనిపించింది నా జీవితానికి మంచి రోజులు వచ్చాయని. నా భార్యే తల్లిగా, తండ్రిగా నా కూతుర్ని పెంచి పెద్ద చేసింది. నా కూతురుకు నా సినిమానే గిఫ్ట్‌గా ఇవ్వాలని అనుకున్నాను. క్లైమాక్స్‌ను వందకు రెండొందల సార్లు రాసినా.. కుదరడం లేదు. ప్రొడ్యూసర్‌కు చెబితే క్లైమాక్స్ ఆపేసి, సినిమా పూర్తి చేయమని చెప్పాడు. అప్పుడే నా సినిమా డైరెక్షన్ మొదలుపెట్టాను. స్టార్ట్.. కెమెరా.. యాక్షన్ అనే పదం నా నోటి వెంట వచ్చింది. సినిమా పూర్తయ్యింది.
Also Read ;- రానా విరాటపర్వంలో.. మరో హీరోయిన్
క్లైమాక్స్ మిగిలింది. కూతురి పెళ్లి తేదీ దగ్గర పడింది. ప్రొడ్యూసర్‌కు చెప్పి ఊరెళ్లి పెళ్లి అయ్యాక క్లైమాక్స్ చేద్దామని అనుకున్నాను. అందుకోసం ఆఫీస్‌కు వెళ్లి కలిస్తే ఆయనే నా చేతిలో డబ్బు పెట్టి నీ కూతురి పెళ్లి చేసి వచ్చాక క్లైమాక్స్ చేద్దాంలే అని చెప్పగానే, ఏం మాట్లాడాలో తెలీక, ఆయన పాదాలపై పడిపోయాను. అక్కడ నుంచి రూమ్‌కు వెళ్లి షాపింగ్ చేసి ఊరికి బయల్దేరుదామని ప్రొడ్యూసర్ ఇంటి నుంచి బైకు మీద వెళ్తుంటే, మనసులో సినిమా క్లైమాక్స్ ఆలోచనలే తప్ప, కూతురి పెళ్లి ఆలోచనలు లేవు. ఊరు వెళ్లి వచ్చేలోగా ప్రొడ్యూసర్‌కు క్లైమాక్స్ చెప్పాలి అని అనుకుంటూ, క్లైమాక్స్ గురించి ఆలోచిస్తూ వెళ్తుంటే, ఒక్కసారిగా లారీ వచ్చి ఢీకొట్టింది. అలా గాల్లో ఎగురుతూ రోడ్డుపై పడ్డా.. అంతే నా ప్రాణాలు కొనఊపిరితో కొట్టుమిట్టాడుతున్నాయి.
నేను రాసుకున్న కథ పేపర్లు గాల్లో ఎగురుతున్నాయి. ఆ ఎగురుతున్న పేపర్లను చూస్తుంటే చరిత్రలో నిలిచిపోయే క్లైమాక్స్ థాట్ అప్పుడే వచ్చింది. ఒక్కో పేపర్ ఎగురుతూ ఉండగా ఒక పేపర్ వచ్చి రక్తపు మడుగులో ఉన్న నా ముందు వచ్చి పడింది. పేపర్‌పై క్లైమాక్స్‌ను రాయడానికి ప్రయత్నిస్తున్నానేగానీ, నా ప్రాణాలు పోతున్నాయనే ఆలోచన మాత్రం నాకు రాలేదు. ప్రాణం పోతుందన్న బాధ కంటే, నా సినిమాకు క్లైమాక్స్ వచ్చిందన్న ఆనందమే ఎక్కువుంది. ఆ సమయంలో భార్య, కూతురు కూడా గుర్తుకు రాలేదు. అలా పేపర్‌పై రాస్తూ.. రాస్తూ.. నా సినిమా క్లైమాక్స్ రాశా.. నా జీవితమనే క్లైమాక్స్‌ను ముగించా. ఇది కథ కాదు.. ఒక సినిమావాడి వ్యథ..
“సినిమా అనే వ్యసనం మానివేయాలంటే.. అది మరణం తర్వాతే అన్నది వాస్తవం..
“అందుకే సినిమా వాళ్లను చులకనగా చూడకండి.. సినిమా చూస్తూ పలచన చేయకండి..”
– అజ్ఞాతవాసి
Also Read ;- బాలీవుడ్ లో రీమేక్ కాబోతున్న టాలీవుడ్ ‘జులాయి’











