సీఎం సీట్లో ఉన్న తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని లక్ష కోట్ల మేర అక్రమ సంపాదనను కూడబెట్టారన్న ఆరోపణలపై వైసీపీ అధినేత, ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గతంలో జైలుకు వెళ్లి వచ్చారు. తన తండ్రి వైఎస్సార్ తో పాటు తనకూ రాజకీయ ఓనమాలు నేర్పిన కాంగ్రెస్ పార్టీనే జగన్ ను జైలుకు పంపిన సంగతీ తెలిసిందే. తనపై కేసు పెట్టిన కాంగ్రెస్ తో తెగదెంపులు చేసుకున్న జగన్..చివరాఖరుకు తన బెయిల్ కోసం అదే పార్టీతో లోపాయికారీ ఒప్పందం చేసుకున్నారన్న విమర్శలూ లేకపోలేదు.య ఇదంతా గతం. అయితే ఇప్పుడు జగన్ ఓ క్రూరమైన రీతిలో ఆలోచన చేస్తున్న వైనం కలకలం రేపుతోంది. తాను జైలుకు వెళ్లినట్లే తన ప్రత్యర్థులు కూడా జైలుకు వెళ్లాల్సిందేనన్న రీతిలో.. తన ప్రత్యర్థులుగా ఉన్న వారిలో కీలక నేతలను జైలుకు పంపి.. వారందరినీ కొన్ని రోజుల పాటైనా జైల్లో ఉంచే దిశగా వ్యూహం రచిస్తున్నారట. ఈ మేరకు జగన్ కక్షసాధింపు చర్యల్లో భాగంగా బాధితుడై ఉండి కూడా అరెస్టై, ఓ నాలుగు రోజులు జైల్లో ఉండి వచ్చిన టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు సంచలన వ్యాఖ్యలు చేశారు.
లోకేశ్ కూ ఖైదీ నెంబర్ ఇప్పిస్తారట
అక్రమాస్తుల కేసులో జగన్ చంచల్ గూడ జైల్లో ఏకంగా 16 నెలల పాటు జైలు జీవితం గడిపిన సంగతి తెలిసిందే. ఆ సందర్భంగా ఆయనకు ఖైదీ నెంబర్ః 6093ని జైలు అధికారులు కేటాయించారు. సరే.. విచారణ ఖైదీగానే ఉన్న జగన్ కు ఖైదీ దుస్తులు లేకుండా సాధారణ దుస్తుల్లోనే జైల్లో కొనసాగారు. ఈ విషయాన్ని పదే పదే ప్రప్తావించిన రాజకీయ ప్రత్యర్థులు జగన్ ను ఖైదీ నెంబర్ః6093గా పలుమార్లు అభివర్ణించారు. ఈ విషయం జగన్ కు పదే పదే గుర్తుకు వస్తోందట. అత్త తిట్టినందుకు కాదు.. తోడి కోడలు నవ్వినందుకు అన్నట్లుగా తాను జైలుకు వెళ్లినందుకు కాకుండా జగన్ తనను తన రాజకీయ ప్రత్యర్థులు అవహేళన చేసిన వైనమే వేధిస్తోందట. అందుకే తాను అధికారంలోకి రాగానే గతంలో తనను చూసి నవ్వడమే కాకుండా తనను ఖైదీ నెంబర్ అంటూ సంబోధించిన వారినందరినీ వరుసగా జైలుకు పంపుతున్నారు. ఈ క్రమంలోనే ఇప్పటిదాకా మాజీ మంత్రులు అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్రలను జైలుకు పంపిన్.. తాజాగా దేవినేని ఉమాను కూడా జైలుకు పంపారు.
నెక్ట్స్ టార్గెట్ లోకేశేనట
తనపై వ్యంగ్యాస్త్రాలు సంధించి తనను ఖైదీ నెంబర్ 6093 అంటూ హేళన చేసిన వారిని జైలుకు పంపుతున్న జగన్.. తన తర్వాతి లక్ష్యంగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ను ఎంచుకున్నారట. తనను ఖైదీ నెంబర్ 6093 అని హేళన చేసినట్లుగానే లోకేశ్ ను కూడా ఖైదీ నెంబర్ అంటూ తాను, తన పరివారం పరిహాసం చేయాలని జగన్ ప్లాన్ వేస్తున్నారట. ఈ మేరకు లోకేశ్ ను జైలుకు పంపే దిశగా జగన్ పక్కాగానే ప్లాన్ వేస్తున్నారట. ఈ విషయాన్ని జైలు నుంచి విడుదలైన తర్వాత దేవినేని ఉమా వెల్లడించారు. తన మాదిరే లోకేశ్ నూ ఖైదీ నెంబర్ అని సంబోధించాలన్న దిశగా జగన్ ఆలోచిస్తున్నారని, అందులో భాగంగానే వచ్చే నెలలో లోకేశ్ ను జైలుకు పంపే దిశగా జగన్ సన్నాహాలు చేస్తోందని కూడా దేవినేని సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే టీడీపీ నేతలను వరుసగా అరెస్ట్ చేస్తున్న జగన్ సర్కారు కోర్టుల్లో చీవాట్లు తింటున్న సంగతి తెలిసిందే. మరి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్న లోకేశ్ ను అరెస్ట్ చేయడమంటే చిన్న విషయం కాదు. ఈ వ్యవహారంలో ఏమాత్రం బెడిసికొట్టినా.. జగన్ సర్కారు భారీ ప్రమాదంలో పడటం ఖాయమేనన్న వాదనలు వినిపిస్తున్నాయి.
Must Read ;- దేవినేనికి బెయిల్!.. జగన్ కు మరో షాకే కదా!











