నంద్యాల, ఆళ్లగడ్డతో రాజకీయ ఆధిపత్యపోరు తారస్థాయికి చేరిన నేపథ్యంలో అధికార వైసీపీ భూమా కుటుంబానికి మరో షాక్ ఇచ్చింది. 28ఏళ్లుగా ఆ కుటుంబ ఆధిపత్యంలో ఉన్న నంద్యాల విజయడెయిరీ ఛైర్మన్ పదవిని వైసీపీ మద్దతుదారులు దక్కించుకున్నారు. ఈ ఎన్నిక డెయిరీ పాలకవర్గానికి సంబంధించి మాత్రమే అయినా.. రాజకీయంగా కూడా ప్రాధాన్యం సంతరించుకుంది. తాజాగా డెయిరీ ఛైర్మన్ ఎన్నిక, 3 డైరక్టర్ల పదవులకు సంబంధించి జరిగిన ఎన్నికల్లో వైసీపీ మద్దతుదారులు గెలిచారు. మొత్తం 15మంది డైరక్టర్లకు గాను ఇప్పటికే నలుగురు వైసీపీ మద్దతుదారులు ఉండగా మొత్తం వైసీపీ మద్దతు ఉన్న డైరక్టర్ల సంఖ్య 7కి చేరింది. టీడీపీకి ఐదుగురు డైరక్టర్లు ఉన్నారు. మెజార్టీ డైరక్టర్ల మద్దతుతో వైసీపీ నేత, అఖిల ప్రియ మేనమామ ఎస్వీ జగన్మోహన్ రెడ్డి ఛైర్మన్ గా ఎన్నికయ్యారు. కాగా 28ఏళ్లుగా భూమా నాగిరెడ్డి బాబాయి భూమా నారాయణ రెడ్డి ఛైర్మన్ గా కొనసాగుతున్నారు.
హైదరాబాద్ లోని హఫీజ్ పేట భూ వివాదం నేపథ్యంలో బోయిన్ పల్లిలో ప్రవీణ్ రావుతోపాటు ఆయన సోదరులు కిడ్నాప్ అయిన కేసులో భూమా అఖిలప్రియ ఇప్పటికే జైలుకి వెళ్లి బెయిల్ విడుదలయ్యారు. భూమా అఖిల ప్రియ భర్త భార్గవ్ తో పాటు మరికొందరు నిందితులు పరారీలో ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. ఇక ఇదే కేసులో ఆరోపణలు ఎందుర్కొంటున్న, ప్రస్తుతం పరారీలో ఉన్న అఖిల ప్రియసోదరుడు జగత్ విఖ్యాత్ రెడ్డి, భూమా అఖిల ప్రియ భర్త భార్గవ్ రామ్ గతంలో భూమా నారాయణరెడ్డిపై దౌర్జన్యం చేశారని కూడా ఆరోపణ ఉంది.
విజయ డెయిరీ ఛైర్మన్ పదవినుంచి తప్పుకోవాలని నారాయణ రెడ్డిపై జగత్ విఖ్యాత్ రెడ్డి ఒత్తిడి చేసినట్లు గతంలో ఆరోపణ వచ్చింది. విజయడెయిరీలో డైరక్టర్ గా ఉన్న నేపథ్యంలో ఛైర్మన్ పదవిని జగత్ విఖ్యాత్ రెడ్డి ఆశించినట్లు ప్రచారం జరుగుతోంది. తాజాగా జరిగిన డెయిరీ ఎన్నికల్లో జగత్ విఖ్యాత్ రెడ్డి తన ఓటుహక్కును వినియోగించుకోలేదు. మొత్తంమీద భూమా నాగిరెడ్డి చనిపోయాక రాజకీయంగా, ఆర్థికంగా ఆ కుటుంబానికి పలు ఇబ్బందులు ఎదురవుతున్నాయన్న అభిప్రాయం ఉన్న నేపథ్యంలో నంద్యాల విజయడెయిరీ ఛైర్మన్ పదవి కూడా 28ఏళ్ల తరువాత చేజార్చుకోవాల్సి వచ్చిందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
పావులు కదిపిన వైసీపీ..
ఓవైపు అఖిల ప్రియ కుటుంబం కిడ్నాప్ కేసులో ఇరుక్కోవడంతో విజయడెయిరీ విషయంలో వైసీపీ నేతలు వేగంగా పావులు కదిపారు. ఈ డెయిరీ డైరక్టర్‌గా పోటీ చేసే అర్హత ఎస్వీ జగన్మోహన్ రెడ్డికి లేదంటూ మల్లిఖార్జున్ అనే సభ్యుడు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. 20వ తేదీన హైకోర్టు స్టే చ్చింది. అనూహ్యంగా మల్లికార్జున్ అనే సభ్యుడు జనవరి 24న పిటిషన్ ను ఉపసంహరించుకున్నాడు. దీంతో ఎన్నికలు జరిగాయి. మొత్తం ఆరుగురు పోటీపడగా ఎస్వీ జగన్మోహన్ రెడ్డి, గంగుల విజయసింహారెడ్డి, రవికాంత్‌రెడ్డి లను గెలిచారు. మొత్తం 81ఓట్లకు గాను జగత్ విఖ్యాత్ రెడ్డి మినహా మిగతావారంతా ఓటు హక్కను వినియోగించుకున్నారు.
మేనమామకు దక్కిన పదవి..
తాజాగా నంద్యాల విజయడెయిరీ ఛైర్మన్ గా గెలిచిన ఎస్వీ జగన్మోహన్ రెడ్డి భూమా అఖిలప్రియలకు మేనమామ అవుతారు. భూమా అఖిల తల్లి దివంగత శోభానాగిరెడ్డికి స్వయానా తమ్ముడు. 2019 ఎన్నికలకు ముందు ఆయన టీడీపీని వదిలి వైసీపీలో చేరారు.
Must Read ;- అఖిల ప్రియ ఏమి చెబుతారు.. అందులో ఎవరెవరున్నారు..?