తిరుపతి ఉప ఎన్నికలో అండర్ డాగ్స్‌గా ఉండటానికి కమలనాథులు ఒప్పుకోలేకపోతున్నారు. అందుకే స్ట్రాటజీలో పెద్ద టర్నింగే ఇచ్చుకున్నారు. ఒకవైపు స్టీల్ ప్లాంట్ వ్యవహారం, పోలవరం నిధులు, ప్రత్యేక హోదా అన్నిటిలోనూ ఆంధ్రులు తిట్టుకునేలా తయారైన బీజేపీ పాలసీలు.. తిరుపతి ఉప ఎన్నికల్లో ఎఫెక్ట్ చూపించకుండా ఉండటానికి స్పెషల్ ఎఫెక్ట్ ఒకటి ముందుకు తీసుకొచ్చారు. అదే పవన్ కల్యాణ్. మొన్నటి వరకు పవన్ కల్యాణ్‌ను పట్టించుకోని ఏపీ బీజేపీ నేతలు.. ఇప్పుడు మాత్రం ఆయనను పువ్వుల్లో పెట్టి చూసుకోమని మోడీ, అమిత్ షాలు చెప్పారని నాటకీయంగా చెబుతున్నారు. బీజేపీ జనసేన కూటమి సీఎం అభ్యర్ధి ఎవరనేది అధిష్టానం నిర్ణయిస్తుందని గతంలో దాటవేసిన సోము వీర్రాజు… ఇప్పుడు ఏకంగా పవన్ కల్యాణ్ ఏపీ సీఎం అభ్యర్ధి అని అధికారికంగా ప్రకటించేశారు. ఇవన్నీ వారి పాలసీలకు ఎదురొస్తున్న వ్యతిరేకతను పక్కనపెట్టడానికేనని అర్ధమవుతూనే ఉంది.
పవన్‌ను కన్విన్స్ చేసి..
తిరుపతిలో అసలు జనసేన పోటీ చేయాలనుకుంది. కాని అటు చేసి..ఇటు చేసి..వాయిదాలు వేసి బీజేపీయే పోటీ చేయాలని నిర్ణయం తీసుకుని.. పవన్‌ను కన్విన్స్ చేసేసింది. ఆయన కూడా ఒప్పేసుకున్నాడు. కాని ప్రచారానికి రావడానికి ఇష్టపడలేదు. స్టీల్ ప్లాంట్ వ్యవహారం, పోలవరం ఇవన్నీ ప్రశ్నలొస్తే తానేం సమాధానం చెప్పాలనే ఉద్దేశమో లేక.. తనకు ప్రయారిటీ ఇవ్వటం లేదనే కోపమో.. గాని.. ప్రచారానికి తాను రాను.. నాదెండ్ల మనోహర్ వస్తారని బీజేపీ నేతలకు చెప్పేశారు. దీంతో మీడియాలో ఈ విషయం హైలెట్ అయింది. ఇక బీజేపీ పోటీలో లేనట్లే.. కేవలం టీడీపీ వైసీపీల మధ్యే పోటీ అని అనుకుంటుండగా.. ఇప్పుడు రత్నప్రభను అభ్యర్ధిగా ప్రకటించి.. పవన్ కల్యాణ్‌ను కూడా ప్రచారానికి రప్పిస్తున్నారు… పైగా ఇప్పుడు పవన్ సీఎం అభ్యర్ధి అన్నారు.. ఇంకేముంది జనసైనికులకు ఇంతకన్నా ఏం కావాలి.. ఫుల్లు ఖుష్.
స్థానిక ఎన్నికలు కూడా ఒక కారణం..
ఈ ప్రకటనలు ఇలా రావడానికి ఈ మధ్య జరిగిన స్థానిక ఎన్నికలు కూడా ఒక కారణం. ఎందుకంటే స్ధానికంగా ఎక్కడికక్కడ జనసేన పెద్దగా ఆర్డనైజ్ చేయలేకపోయినా.. జనసైనికులు ఎవరికివారే పంచాయతీలు, మున్సిపల్ వార్డుల్లో పోటీకి దిగారు. వీరందరిలో ఎక్కువమంది కాపు కులస్తులు. స్థానిక ఎన్నికల్లో మెజారిటీ కాపులు జనసేన అభ్యర్ధులకే ఓట్లేశారు.. జనసేన అభ్యర్ధి లేని చోట.. వేరేవారికి వేశారు తప్ప.. ఎక్కువ మంది అటే వేశారు. పైగా అవసరమైన చోట టీడీపీతో పొత్తు పెట్టుకున్నారు. బీజేపీ ఒక విధంగా స్ధానిక ఎన్నికల్లో డమ్మీ అయిపోయింది. అనుకున్నదాని కంటే ఎక్కువ శాతం ఓట్లు జనసేన స్థానిక ఎన్నికల్లో రాబట్టుకోవడంతో బీజేపీ షాక్ అయింది. ఈ పరిణామాలన్నీ బీజేపీ జాతీయ నాయకత్వాన్ని అలర్ట్ చేశాయి.. స్థానిక నాయకులను ఆలోచనలో పడేశాయి.
ఇలాగే వదిలేస్తే..తాము కేంద్రంలో అధికారంలో ఉన్నామన్న అహంకార ధోరణిని ప్రదర్శిస్తే.. పవన్ కల్యాణ్ దూరమవుతారు.. పైగా టీడీపీకి దగ్గరవుతారు. ఎంత జగన్ మిత్రుడిగా ఉన్నప్పటికీ.. అది అవసరం కోసమే తప్ప వేరే కాదని వారికీ తెలుసు. అందుకే ఇప్పుడు కాపు కులస్తులను బీజేపీ వైపు తిప్పుకోవడానికే.. పవన్ సీఎం అభ్యర్ధి అని చెబుతున్నారు. జనం పట్టించుకుంటారా లేదా అన్నది రేపు తిరుపతిలో పడే ఓట్లను బట్టి తెలుస్తుంది.
Must Read ;- జనసేన కటీఫేనా.. తిరుపతిలో బీజేపీ ఒంటరి పోరేనా











