ప్రశ్నిస్తానని రాజకీయాల్లోకి వచ్చిన పవన్ కల్యాణ్.. తన ప్రశ్నలకు తానే సమాధానం చెప్పుకోలేకపోతున్నారనిపిస్తోంది. ఎటు అడుగు వేయాలో..ఎవరితో కలవాలో.. ఎవరిని కలవకూడదో.. అర్ధం కాని కన్ఫ్యూజన్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. మొదట అడుగు వేసినప్పుడే బీజేపీతో, టీడీపీతో కలిసి.. తర్వాత వారిద్దరిపై విమర్శలు గుప్పించి.. వామపక్షాలతో కలిసి గత ఎన్నికల్లో పోటీ చేశారు కాని ఫలితం రాలేదు. ఆ తర్వాత మళ్లీ బీజేపీ బుజ్జగించగానే ఓకె చెప్పేసి చేయి కలిపారు. పోను పోను తెలుగు రాష్ట్రాలతో పాటు.. దేశవ్యాప్తంగా బీజేపీ విధానాలకు వ్యతిరేకత వస్తుండటంతో తప్పు చేశానా అనే ఆలోచనలో పడినట్లు తెలుస్తోంది.
అమరావతి, స్టీల్ ప్లాంట్ వ్యవహారాల్లోనూ..
ఎందుకంటే అమరావతి రాజధాని వ్యవహారంలోనూ, తర్వాత స్టీల్ ప్లాంట్ వ్యవహారంలోనూ బీజేపీ డ్రామా ఆడుతోందని.. వైసీపీకి సహకరిస్తోందనే విషయం అర్ధమైంది జనసేనానికి. కాని ఏం చేయాలో అర్ధం కాలేదు. స్వతంత్రంగా బీజేపీతో సంబంధం లేకుండా ప్రకటనలు అయితే చేయగలిగారు. కాని ముందడుగు వేయలేకపోయారు. ఏపీలో వైసీపీ, బీజేపీ కలిసే గేమ్ ఆడుతున్నాయని.. ఆ గేమ్‌లో భాగంగానే తన కాళ్లకు బంధాలు వేయడానికే తనను దగ్గరకు తీశారని తెలుసుకోవడానికి పవన్ కల్యాణ్‌కు చాలా టైమ్ పట్టింది.
Must Read ;- ఆందోళనలకు దూరం.. విశాఖ ఉక్కు విషయంలో జనసేనాని అస్త్రసన్యాసమా..?
తెలంగాణలోనూ..
ఇక తెలంగాణలోనూ అదే తీరు. కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేయాలనుకున్నా.. కాదని బీజేపీ రాష్ట్ర శాఖ అడ్డం పడటంతో చర్చలు జరిపి తప్పుకున్నారు. తిరుపతి ఉప ఎన్నికలోనూ అదే తీరు నడుస్తోంది. నువ్వు మాకు ఉపయోగపడాలి గాని.. మమ్మల్ని వాడుకోవడం నీకు తగదని బీజేపీ చెప్పకనే చెప్పినట్లయింది. దీంతో కళ్లు తెరుచుకున్న పవన్ కల్యాణ్ ఎలా..ఏం చేయాలనే దానిపై ఆలోచనలో పడినట్లు సమాచారం.
బీజేపీని వదిలించుకుంటేనే బెటరనా..
అంతే కాదు.. పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ చేతులెత్తేసి.. వైసీపీకి పూర్తిగా సహకరించిందని చూసిన ఎవరికైనా అర్ధమవుతోంది. జనసేన కేడర్ మాత్రం వెనక్కు తగ్గకుండా చాలా చోట్ల పోటీకి దిగారు. అవసరమైన చోట టీడీపీ సహకారం కూడా తీసుకున్నారు. ఆశ్చర్యంగా కొన్ని చోట్ల విజయం అందుకుని జనసేన అందరికీ షాకిచ్చింది. ఈ పరిణామమే పవన్ కల్యాణ్‌కు కూడా కాస్త హోప్ ఇఛ్చినట్లు కనపడుతోంది. అందుకే బీజేపీని వదిలించుకుంటేనే బెటరని.. లేదంటే దాని వ్యతిరేకత గాలిలో తాము కూడా కొట్టుకుపోతామని పవన్‌కు అర్ధమైనట్లుంది.
డైలమాలో..
కాని ఇటు చూస్తే ఏపీలో టీడీపీతో కలిసి వెళ్లటమా.. వెళ్లకపోవటమా అనేదానిపైనే క్లారిటీ రావటం లేదు. ఇటు తెలంగాణలోనూ అదే పరిస్ధితి. టీఆర్ఎస్, బీజేపీ రెండూ పోటీ పడుతున్నా.. ఇద్దరిపైనా ప్రజల్లో వ్యతిరేకత ఉందని భావిస్తున్నారు. అందుకే స్వతంత్రంగా బలపడటమా లేక.. కొన్నాళ్లు గ్యాప్ తీసుకోవడమా అనేదానిపైనే పవన్ డైలమాలో ఉన్నట్లు చెబుతున్నారు. ఏపీలో మాత్రం ఎన్నికలొచ్చేవరకు ఎవరితోనూ కలవకుండా.. స్వతంత్రంగా అంశాల వారీగా పోరు చేయాలని.. జనసేన బలం పెంచుకోవాలని.. ఎన్నికలొచ్చాకే పొత్తుల గురించి ఆలోచించాలని అనుకుంటున్నట్లుగా తెలుస్తోంది.
Also Read ;- బీజేపీ వల్లే ఓడిపోయాం.. జనసేన అధికార ప్రతినిధి పోతిన మహేష్